
చే గువేరా భారత్‌లో కూడా పర్యటించారని చాలా తక్కువ మందికి తెలుసు. క్యూబా మంత్రి హోదాలో ఉన్నప్పుడు ఆయన భారత్‌కు వచ్చారు. ఆయన 1959లో తన భారత్ పర్యటనపై నివేదిక రాసి, ఫైడెల్ కాస్ట్రోకు అందించారు.
'మేము కైరో నుంచి భారత్‌కు వెళ్ళాము. 39 కోట్ల జనాభా, 30 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణమున్న దేశమది. మేమీ పర్యటనలో భారత అగ్రశ్రేణి రాజకీయ నాయకులను కలిశాం. జవహర్ లాల్ నెహ్రూ మాపై ఎంతో అభిమానం చూపారు. క్యూబా ప్రజలతో మేమున్నామని, వారు చేస్తున్న పోరాటానికి మద్దతు పలుకుతున్నామని'' నెహ్రూ చెప్పినట్లు చే గువేరా ఆ నివేదికలో పేర్కొన్నారు.
'నెహ్రూ మాకు ఎన్నో విలువైన సలహాలిచ్చారు. క్యూబా ప్రజా ప్రయోజనాల కోసం చేస్తున్న ఉద్యమానికి ఎటువంటి షరతులు లేకుండా మద్దతు ప్రకటించారు. భారత పర్యటనలో ఎన్నో విషయాలు మేం నేర్చుకున్నాం. అందులో ముఖ్య విషయమేమిటంటే ఒక దేశ ఆర్థిక అభివృద్ధి దాని సాంకేతిక అభివృద్ధిపై ఆధారపడి ఉంటుంది. అందుకోసం ఎక్కువగా పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేయాలి. ప్రత్యేకంగా ఫార్మాసూటికల్స్, రసాయనాలు, భౌతికశాస్త్ర రంగం, వ్యవసాయ రంగంలో సంస్థలను ఏర్పాటు చేయాలనే విషయాన్ని నేర్చుకున్నాం' అని ఆయన తన రిపోర్టులో పేర్కొన్నారు.
భారత్ నుంచి వీడ్కోలు సమయంలో తన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ 'భారత్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు స్కూలు పిల్లలు మాకు 'క్యూబా - భారత్.. భాయి - భాయి' అంటూ వీడ్కోలు పలికారు. ''నిజంగానే క్యూబా - భారత్ భాయి - భాయి' అని చేగువేరా ఆ నిబేదికలో రాశారు.