Sep 24,2023 08:37

ప్రముఖ ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ చాలాకాలంగా ఊరిస్తూ వస్తోన్న 'ఛానెల్స్‌' అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇండియా సహా 150 దేశాల్లో ఈ ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఇప్పటికే ఈ ఫీచర్‌ చాలా మందికి అందుబాటులోకి వచ్చింది. తమ వాట్సప్‌లో ఈ ఫీచర్‌ కనిపించనివారు వాట్సప్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి వుంటుంది. ఈ ఛానల్‌ టూల్‌ ద్వారా మనకిష్టమైన సెలబ్రిటీలను ఫాలో అవ్వొచ్చు. తద్వారా వినియోగదారులు ఫాలో అయ్యేందుకు ఎంచుకున్న ఛానల్‌ నుంచి కీలకమైన అప్‌డేట్‌లను పొందుతారు. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ల తాజా వెర్షన్‌లలో ఈ ఫీచర్‌ను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్ల్లు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ బుధవారం ప్రకటించారు. వాట్సప్‌ వినియోగదారులు అప్‌డేట్స్‌లో ప్రతిరోజూ స్టేటస్‌లను చూసుకుంటూనే వుంటారు. ఆ స్టేటస్‌ బటన్‌ స్థానంలో ఇప్పుడు అప్‌డేట్స్‌ అని కనిపిస్తుంది. ఈ అప్‌డేట్స్‌లో స్టేటస్‌లతో పాటు చివరగా ఛానెల్స్‌ అనే ఫీచర్‌ కూడా కొత్తగా కనిపిస్తుంది. దీనిలో వేలాది కొత్త ఛానెల్స్‌ను జోడించారు. ఈ విషయాన్ని జుకర్‌ బర్గ్‌ తన ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో వెల్లడించారు.
ఈ వాట్సాప్‌ ఛానల్‌ స్టార్ట్‌ అయిన తరువాత.. వివిధ రంగాల్లో ప్రముఖులు, క్రీడాకారులు కళాకారులు, ఇన్‌ఫ్యూయర్స్‌, సంస్థలు వంటి వాటి ఫొటోల కింద వున్న 'ఫాలో' బటన్‌ను నొక్కడం ద్వారా వారిని ఫాలో అవ్వొచ్చు. ఆయా దేశాలకు సంబంధించిన ప్రముఖుల ఫిల్టర్‌ అయిన ఛానెల్స్‌ను ఎంచుకోవచ్చు. అలాగే, 'ఫైండ్‌ ఛానెల్స్‌' బటన్‌ ప్రెస్‌ చేయడం ద్వారా మనకు కావాల్సిన వారిని సెర్చ్‌ చేయవచ్చు. మీ ఫాలోవర్స్‌ను బట్టి కొత్త, అత్యంత యాక్టివ్‌, జనాదరణ పొందిన ఛానెల్స్‌ను కూడా వీక్షించే అవకాశం వుంది. ఇప్పటివరకు చిలీ, కొలంబియా, ఈజిప్ట్‌, కెన్యా, మలేషియా, మొరాకో, పెరూ, సింగపూర్‌, ఉక్రెయిన్‌లో ఈ ఛానెల్స్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.

ఛానెల్‌ అంటే?

వాట్సాప్‌ ఛానెల్‌ అనగానే యూట్యూబ్‌ ఛానెల్‌ మాదిరిగా వుంటుందేమో అనుకునే అవకాశం వుంది. అయితే, వాట్సాప్‌ ఛానెల్‌.. అచ్చంగా ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాదిరిగా వుంటుంది. వీటిలో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో అవుతుంటామో అలాగే.. వాట్సప్‌ ఛానెల్‌లోనూ ఫాలో కావొచ్చు. ఈ ఫీచర్‌ ద్వారా మీకు నచ్చిన వ్యక్తులు, సంస్థలను ఫాలో అవడం ద్వారా వాట్సాప్‌లోనే ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకోవచ్చు. కావాలనుకుంటే ఈ సమాచారాన్ని ఇతరులతో షేర్‌ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫాలో అయ్యే వారి ఫోన్‌ నంబర్‌, ప్రొఫైల్‌ ఫొటోలు ఫాలోవర్స్‌కి కనిపించవు. అంతేకాదు... ఒక ఛానెల్‌ను ఫాలో అయినంత మాత్రాన.... వినియోగదారుల ఫోన్‌ నెంబర్‌, వ్యక్తిగత వివరాలు గాని దాని అడ్మిన్‌కు కనిపించవు. అలాగే ఇతర ఫాలోవర్స్‌ కూడా వీటిని యాక్సెస్‌ చేయలేరు. ఛానెల్‌ హిస్టరీ తమ సర్వర్లలో 30 రోజులు మాత్రమే సేవ్‌ అవుతుందని వాట్సాప్‌ తెలిపింది. అంతేకాదు.. అడ్మిన్లు తమ ఛానెల్‌ నుంచి స్క్రీన్‌షాట్లు, ఫార్వర్డ్స్‌ వంటి వాటిని బ్లాక్‌ చేసే ఆప్షన్‌ కూడా వుంది.

ఛానెల్స్‌ను పొందడం..

అప్‌డేట్స్‌లో ఒక నోటిఫికేషన్‌ వస్తోంది. దానిపై క్లిక్‌ చేస్తే.. ఆటోమాటిక్‌గా అప్‌డేట్స్‌ చివరలో ఛానెల్స్‌ ఫీచర్‌ కనిపిస్తోంది. లేదంటే.. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తాజా వెర్షన్‌ వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం ద్వారానూ ఈ ఫీచర్‌ను పొందొచ్చు.

సొంత ఛానెల్‌ క్రియేట్‌ చేసుకోవడం..

ఛానెల్స్‌ ఆప్షన్‌ ద్వారా ఎవరికివారు తమ సొంత ఛానెల్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ఛానెల్స్‌ పక్కనే ఉన్న ప్లస్‌ గుర్తుపై క్లిక్‌ చేస్తే క్రియేట్‌ ఛానెల్‌ అనే ఆప్షన్‌ వస్తుంది. తర్వాత డీపీ, ఛానెల్‌ పేరు, ఛానెల్‌ డిస్క్రిప్షన్‌ ఇవ్వడం ద్వారా సింపుల్‌గా ఛానెల్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. ఆ ఛానెల్‌కి మంచి లోగో కూడా పెట్టుకోవచ్చు. మీకు నచ్చినవారికి ఆ లింక్‌ను షేర్‌ చేయొచ్చు. అయితే, ఆ ఛానెల్‌ డిస్క్రిప్షన్‌లో ఛానెల్‌ను ఎందుకు పెట్టారు? లేదా మీ ఛానెల్‌ ఉద్దేశం ఏమిటి? వంటి విషయాలను పేర్కొనడం ద్వారా మిమ్మల్ని ఫాలో అయ్యేవారికి మీ ఛానెల్‌లో ఏ సమాచారం లభ్యమౌతుందో సులభంగా తెలుస్తుంది.
ఛానెల్స్‌ అనేవి అడ్మిన్లు టెక్ట్స్‌, ఫొటోలు, వీడియోలు, స్టిక్కర్లు వంటివి పంపడానికి ఉపయోగపడే వన్‌వే బ్రాడ్‌కాస్ట్‌ టూల్‌. అడ్మిన్స్‌గా వుండేవారు వివిధ రకాల బ్రాడ్‌కాస్ట్‌ మెసేజ్‌లను పంపించడానికి ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. అంటే, బిజినెస్‌లను మార్కెట్‌ చేసేవారికి, కంటెంట్‌ క్రియేటర్స్‌కు ఉపయోగకరంగా వుంటుంది. ఇలాంటి ఛానెల్స్‌ కోసం సెర్చ్‌ చేయడానికి అవసరమైన ఒక డైరెక్టరీని కూడా వాట్సాప్‌ రూపొందిస్తోందని ఆ సంస్థ వెల్లడించింది. చాట్స్‌, ఇమెయిల్స్‌ ద్వారా పంపే ఇన్‌వైట్‌ లింక్స్‌ ద్వారా కూడా ఛానెల్స్‌ను యాక్సెస్‌ చేయొచ్చు.

ఎన్‌క్రిప్షన్‌ ఉందా?

ఛానల్స్‌ ద్వారా ఎక్కువ మంది ఆడియన్స్‌కు చేరువయ్యే లక్ష్యంతో వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను డెవలప్‌ చేసింది. అందుకే ఛానల్స్‌ ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్ట్‌ కావు. అయితే ఛానల్స్‌లో నాన్‌ ప్రాఫిట్‌ లేదా హెల్త్‌ ఆర్గనైజేషన్స్‌ వంటి వాటికి లిమిటెడ్‌గా ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను పరిచయం చేయడానికి ఆప్షన్స్‌ అన్వేషిస్తున్నట్లు ఆ సంస్థ తెలిపింది.