Oct 08,2023 12:26

'ఎక్కడెక్కడో ఏమిటో.. గుండె చప్పుడయ్యేదెందుకో..!' అన్న కవి మాటలు ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమకు సంబంధించిన వేర్వేరు అనుభూతులు.. పలు అభివ్యక్తీకరణలు.. ప్రేమ తీవ్రతను ప్రతిబింబించే మన శరీరంలో ఎక్కడెక్కడో పరిశోధకులు కనిపెట్టేశారు.
ఇందుకోసం వందలాది మందిపై నిర్వహించిన ఒక సర్వేలోని డేటాను పరిశోధకులు ఉపయోగించారు. ఫిన్‌లాండ్‌లోని ఆల్టో యూనివర్సిటీ పరిశోధకులు ఈ పరిశోధన చేశారు. ఉదాహరణకు రొమాంటిక్‌ లవ్‌, శృంగారభరిత ప్రేమ, తల్లిదండ్రులపై ఉండే ప్రేమ, స్నేహితులు, అపరిచితులు, ప్రకృతి, దేవుడు, స్వీయ ప్రేమ ఇలా 27 రకాల ప్రేమానుభవాలకు సంబంధించిన సమాచారాన్ని సర్వేలో పాల్గొన్న వ్యక్తుల నుంచి పరిశోధకులు రాబట్టారు.
వివిధ రకాల ప్రేమను మీ శరీరం అనుభూతి చెందుతుందా? శారీరకంగా, మానసికంగా దాని అనుభూతి ఎంత తీవ్రంగా ఉంటుంది? అనే ప్రశ్నల్ని వారిని అడిగారు. ఈ అధ్యయనాన్ని ''ఫిలాసఫికల్‌ సైకాలజీ'' అనే ఒక సైన్సు జర్నల్‌లో ప్రచురించారు.
ప్రేమ తీవ్రత
ప్రేమకు ఉండే తీవ్రమైన అనుభూతిని శరీరమంతటా అనుభవించినట్లు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న యువతులు చెప్పారు. ఈ స్పందనల ప్రకారం, ప్రేమ తీవ్రత శరీరమంతటా ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు.
ఈ అధ్యయనాన్ని కో ఆర్డినేట్‌ చేసిన తత్వవేత్త పార్టిలీ రినే మాట్లాడుతూ, 'ఇది ఆశ్చర్యం కలిగించలేదు. సన్నిహితులతో ముడిపడిన ప్రేమ ఒకేలా ఉంటుంది. దాని అనుభూతి చాలా తీవ్రంగా ఉంటుందనేది గమనించాల్సిన అంశం' అని అన్నారు.
శరీరంలో ప్రేమను అనుభూతి చెందే భాగాలకు రంగు వేయాల్సిందిగా సర్వేలో పాల్గొన్నవారిని పరిశోధకులు కోరారు.
దీని ద్వారా శరీరంలోని ఏ భాగంలో ఏ రకమైన ప్రేమకు సంబంధించిన అనుభూతి పుట్టింది? శారీరకంగా, మానసికంగా వారికి ఎలా అనిపించింది? ఈ అనుభూతి ఎంత ఉల్లాసంగా అనిపించింది? స్పర్శతో దీనికి ఉన్న సంబంధం ఏంటి? అనే విషయాలను వివరించడానికి ప్రేమను అనుభూతి చెందిన శరీర భాగాలకు రంగు వేయాల్సిందిగా సర్వేలో పాల్గొన్నవారిని కోరారు.
చివరగా, వివిధ రకాల ప్రేమల్లోని సాన్నిహిత్యానికి రేటింగ్‌ ఇవ్వాల్సిందిగా వారిని అడిగారు.

2


'ఒకరికొకరు చాలా సన్నిహితంగా ఉండే ప్రేమల్లో సెక్సువల్‌, రొమాంటిక్‌ కోణాలు ఉంటాయి' అని రినే చెప్పారు.
అన్ని రకాల ప్రేమల అనుభూతి ఎక్కువగా తలలో కలుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. అయితే, శరీరంలోని వివిధభాగాల్లో దాని తీవ్రత మారుతుంటుందని చెప్పారు. కొన్ని ఛాతీలో ఎక్కువగా అనుభూతి కలిగిస్తే, మరికొన్నింటిని శరీరమంతటా అనుభూతి చెందొచ్చని చెప్పారు.
హృది నుంచి మదికి..
ఒక ఉద్వేగానికి (ఎమోషన్‌) సంబంధించి శారీరక-మానసిక తీవ్రతకు అది కలిగించే ఆహ్లాదకరమైన అనుభూతికి మధ్య పటిష్ట సంబంధాన్ని గుర్తించడం చాలా ఆసక్తికరంగా ఉంటుందని రినే చెప్పారు. 'శరీరంలో ప్రేమ భావన ఎంత ఎక్కువగా ఉంటే, మానసికంగా అంత ఎక్కువగా అనుభూతి కలుగుతుంది. మరింత ఆహ్లాదకరంగా ఉంటుంది. గాఢమైన ప్రేమను కాకుండా తక్కువ తీవ్రతతో కూడిన ప్రేమను అనుభూతి చెందినప్పుడు, ఛాతీలో దాని తాలూకు ఉత్సాహం క్రమంగా తగ్గిపోతుంది' అని అన్నారు.
బహుశా, అపరిచితుల పట్ల ప్రేమ అనేది ఆచితూచి ఆలోచించి చేసే ప్రక్రియతో ముడిపడి ఉండటం దీనికి కారణం కావొచ్చు.
ఆహ్లాదకర అనుభూతి అనేది తలకు సంబంధించినది కావడం వల్ల కూడా ఇలా జరగొచ్చు. ఈ కోణంలో ఇంకా పరిశోధన జరగాలని రినే అన్నారు. ప్రేమలో సాంస్కతిక భేదాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయని రినే చెప్పారు.
'ఒకవేళ ఈ అధ్యయనం, మతపరమైన సమాజంలో జరిగి ఉంటే దేవుని పట్ల తీవ్రమైన ప్రేమ ఎక్కువగా కనబడేది. అలాగే, తల్లిదండ్రులు అయితే తమ పిల్లల పట్ల ఎక్కువ ప్రేమను అనుభూతి చెందుతారు' అని వివరించారు.