
'జాగర్తగా ఎల్లిరా మావా' అని అలవాటుకొద్దీ అనేశాక నాలిక్కరుచుకుని, 'జాగర్తగా ఎల్లి రండి స్వామీ' అని భర్త సూరిబాబుకు వీడ్కోలు పలికింది మల్లి. రైల్వేస్టేషన్ అంతా అయ్యప్ప స్వాములతో, వారిని శబరిమల యాత్రకు సాగనంపడానికి వచ్చిన కుటుంబ సభ్యులుతో, స్నేహితులతో నిండిపోయి కోలాహలంగా ఉంది. నుదుటిమీద విభూది, మధ్యలో పెద్ద బొట్టు, మెడలో బంతిపూల దండ, నెత్తిమీద ఇరుముడితో అయ్యప్ప స్వామి అవతారంలో సూరిబాబు మల్లికి అపురూపంగా కనిపిస్తున్నాడు. 'నీ సూరిబాబు స్వామిని బద్రంగా ఎనక్కి తీసుకొత్తాంలే తల్లీ' అని గురుస్వామి అప్పలనారాయణ మల్లికి అభయం కూడా ఇచ్చేడు.
పెళ్ళినాడు పుట్టింటివారు పెట్టిన కుత్తిగంటుని తాకట్టుపెట్టి తెచ్చిన మూడువేలూ సూరిబాబు చేతిలో పెట్టింది మల్లి. ఆ సొమ్మును కళ్ళకద్దుకుని రొంటిలో భద్రంగా దాచుకుంటున్న భర్తను మురిపెంగా చూసుకుంది మల్లి. రైలు ప్లాట్‌ఫాం వదిలిపోయేవరకూ అక్కడే నిలబడింది చేతులూపుతూ. మెడలో మిగిలిన పసుపుకొమ్ము కట్టిన తాడును తడుముకుంటూ పరధ్యానంలో పడిన మల్లిని పక్కింటి సుబ్బమ్మత్త కుదిపేసరికి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చిపడి ఇంటికి బయలుదేరింది. స్టేషన్ బైటకొచ్చి షేర్‌ఆటో ఎక్కి కూచున్న మల్లికి ఒక్కసారి రెండు నెలల క్రితం నాటి తన పరిస్థితి గుర్తుకొచ్చింది. ఒక్కసారి ఒళ్ళు జలదరించింది. మళ్ళీ ఆ పరిస్థితి తనకు రానివ్వొద్దని దైవానికి మనసులోనే దండం పెట్టుకుంది.
'ఒలే మల్లీ! నీ మొగుడు ఆ ఈది సివర్న ఒల్లు తెలీకుండా పడున్నాడని మా బొట్టి సెప్పింది. ఎల్లి తెచ్చుకో' అంటూ పక్కింటి సుబ్బమ్మత్త కేకేసింది. 'ఓరి నాయనో! ఈ సచ్చినోడు మల్లీ పుల్లుగా తాగేసినాడు కావాల!' అని తిట్టుకుంటూ పరిగెత్తింది మల్లి. రోడ్డు పక్కన మురిక్కాలువ, కుళ్ళుకంపు, ఆ మధ్యలో పడున్న సూరిబాబును చూసేసరికి మల్లికి గుండెలవిసిపోయాయి. నెత్తి బాదుకుంది. అక్కడున్న రిక్షావాళ్ళ సాయంతో మొత్తానికి సూరిబాబును ఇంటికి తెచ్చింది. ఓ పక్క ఇంట్లో ఏడాది కూడా నిండని పసిగుడ్డు ఏడుపు. ఇంకోపక్క మైకంలో అప్పుడప్పుడూ నోటికేదొస్తే అది అంటున్న భర్త, తన్నుకొస్తున్న ఏడుపును దిగమింగుకుంటూ సూరిబాబుకు స్నానం చేయించింది మల్లి.
ఉతికిన లుంగీ కట్టబెట్టింది. బలవంతంగా నాలుగు ముద్దల అన్నం నోట్లో కుక్కింది. తీసుకెళ్ళి మంచం మీద కూలేసింది. ఆ తర్వాత ఏడుస్తున్న చంటిపాపని ఒళ్ళో పెట్టుకుని గుమ్మం దగ్గర కూలబడింది. కంట్లో నీరు ఎప్పుడో ఇంకిపోయింది.
'ఇదేటమ్మా మరీ గోరం! మన మొగోల్లలో ఎవులు తాగడం నేదు కానీ ఇలా ఒల్లూ పైనా తెలీకుండా తాగీడవేుటి?' అనుకుంటూ వచ్చింది సుబ్బమ్మత్త.
'ఇదంతా నాకరమ' అంటూ ఏడుపు మొదలెట్టింది మల్లి. 'ఊరుకోయే! ఇలాటివి ఎన్ని సూయిస్సినాను నాను? ఇదిగిదిగిదిగో ఇప్పుడే మనం దైర్నెం తెచ్చుకోవాల. ఇందులోంచి బైట పడే దారి ఎతకాల .. ఆ' అంది సుబ్బమ్మత్త.
అదుగో, ఆ టైముకే వచ్చేడు మల్లి అన్న అప్పారావు. 'ఏటి? ఈడు మల్లీ పడిపోనాడా? కూడెట్టేవా? నువ్వేమన్నా తిన్నావా.. నేదా?' అనుకుంటూ పరామర్శల వర్షం కురిపించేడు. ఇంటికొచ్చిన అన్నకి టీ కాచి ఇచ్చింది మల్లి. దీన్నుంచి బైట పడే దారి లేదా అన్నట్టు అన్న కళ్ళలోకి చూసింది. అప్పారావు అది గ్రహించినట్టు స్పందించేడు. 'ఈడిసేత ఎలాగోలా మాల ఏయించేత్తాను. అదే మారగం' అని తన నిశ్చయాన్ని ప్రకటించేడు. 'దాంతోనైనా ఈడు బాగుపడతాడా?' అనడిగింది మల్లి. 'మరందుకే గదా స్వామి మాల ఏయిత్తానన్నాను?' అని చెల్లికి అభయం ఇచ్చేడు అప్పారావు.
మర్నాడు ఉదయం సూరిబాబు పని చేస్తున్న మెకానిక్ గారేజి దగ్గరికి వెళ్ళేడు అప్పారావు. బావమరిదిని చూడగానే నిన్నటి వ్యవహారం అడుగుతాడన్న చిన్నపాటి భయం సూరిబాబు కళ్ళలో కనిపిచింది. 'రా బావా' ముక్తసరిగా అని, మళ్ళీ బండీ ఇంజన్ క్లీనింగ్‌లో పడ్డాడు సూరిబాబు. ఎలా మొదలెట్టాలా అని అప్పారావు తటపటాయిస్తున్న టైమ్‌లోనే 'ఎదవ తొత్తుకొడకా! కల్లెక్కడ ఎట్టుకున్నావురా! లం. కొడకా' అంటూ బూతులు లంకించుకున్నాడు షెడ్డు ఓనర్ మాణిక్యం. బావమరిది ఎదురుగా తనకి జరిగిన అవమానం సూరిబాబుకి మింగుడు పడలేదు. ఈ లోపు అప్పారావే మాణిక్యానికి సర్దిచెప్పి అక్కడినుంచి పంపేశాడు.
ఆ తర్వాత పక్కనే ఉన్న టీ కొట్టుకి సూరిబాబుని తీసుకెళ్ళేడు. 'సూడు బావా! మన మరేద మనం నిలుపుకోవాల. అడ్డమైనోడూ మనల్ని నానా మాటలూ అనే శాన్సు మనం ఇయ్యకూడదంతే. సూడు, నా మాటిను. రేపు ఉదయాన్నే ఇంటికొత్తాను. నువ్వు స్వామి మాల ఏసెయ్యాలంతే. ఇయ్యేలదాకా నిన్ను నానా బూతులూ తిట్టినోల్లు రేపటినుంచీ ఎంత మరేదగా పిలుత్తారో నువ్వే సూత్తావు'' అని హితబోధ చేసేడు. అప్పారావు ఆత్మగౌరవ ప్రబోధం మొత్తానికి పని చేసినట్టుంది. సూరిబాబు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోడానికి సిద్ధపడిపోయేడు. 'మరి ఓపాలి మాలేసినాక మందు, ముక్క ముట్టకూడదు సుమా' హెచ్చరించేడు అప్పారావు. సరేనన్నట్టు తలూపేడు సూరిబాబు.
ఆ రోజు సాయంత్రం మామూలుగానే వీధిచివరి లిక్కర్ షాపుకెళ్ళి ఆ ఆరోజు సంపాదనతో కొనగలిగినంత మందూ కొనేసి అక్కడే దానిని తాగేసి ఇల్లు చేరేడు సూరిబాబు.
ఇంటి గుమ్మంలో దిగాలుగా తనని చూస్తున్న మల్లిని చూసేసరికి సగం మత్తు దిగిపోయింది. మెల్లిగా దగ్గరచేరి మల్లి చేతిని తన చేతుల్లోకి తీసుకుని తలకానించుకున్నాడు. చిన్నగా ఏడుపు కూడా తన్నుకొచ్చేసింది సూరిబాబుకి. దాంతో మల్లి కూడా ఏడుపు మొదలెట్టింది' నీమీదొట్టే మల్లీ, ఇకమీద తాగనంటే తాగనులేయే. రేపే మీ యన్నొత్తానన్నాడు. రేపే మాలేసీసుకుంతన్నాను. అందుకని సివరాకరిగా ఈ యెదవ తాగుడుని మరిసిపోయేలా తాగీసినాను' అని తన నిశ్చయాన్ని ప్రకటించేడు.
అప్పారావు మర్నాడు ఉదయాన్నే వచ్చేసేడు. రాగానే మల్లి చేతిలో ఓ పాకెట్టు పెట్టేడు. అందులో రెండు జతల నల్ల లుంగీలు, రెండు నల్ల చొక్కాలు, రెండు నల్ల తువ్వాళ్ళు ఉన్నాయి. వాటితోబాటు ఓ జపమాల కూడా ఉంది. విభూది పొట్లాం, కుంకం పొట్లాం ఉన్నాయి. వీటికి డబ్బెక్కడిది అన్నట్టు చూసిన మల్లితో' తెల్లారే ఆడి సావుకోరు కాడికెల్లి అడమాన్సు తెచ్చినాను. సూరిబాబు మాల ఏత్తన్నాడనగానే మారుమాటాడకండా ఇచ్చీసినాడు ఎయ్యి రూపాయిలు. ఆ డబ్బెట్టే ఈటిని కొన్నాను' అని చెప్పేడు. ఇంట్లోకి బియ్యం, చింతపండు నిండుకున్నాయని అన్నకి చెప్పబోయి తమాయించుకుంది మల్లి. ఎన్ని తిప్పలు పడైనా సూరిబాబును ఆ తాగుడు అలవాటు నుండి తప్పించగలిగితే అదే పదివేలు అనుకుంది. తను పాచి పని చేస్తున్న ఇంటి అమ్మగారిని అడిగి వంద రూపాయలు తెచ్చింది. ఆ రోజుకి ఇంట్లో అవసరాలు గడిచాయి.
సాయంత్రం సూరిబాబు తొందరగానే వచ్చేశాడు. తాగకుండా ఉన్నాడు. నిబ్బరంగా ఉన్నాడు. అది చూడగానే ఎక్కడలేని ఉత్సాహమూ వచ్చింది మల్లికి. 'నాకెంత సరదా యేత్తందో తెల్సా మావా' అంది. 'నాను ఇప్పుడు సూరిబాబు స్వామినే. నన్ను ఎవులైనా సరే స్వామీ అనే పిలాల. నా వొంటిమీద స్వామి ఉన్నాడన్నమాట' అని సూరిబాబు హెచ్చరించేడు. తమాయించుకుని 'అలాగే స్వామీ' అని సంబరంగా లోపలికి పరిగెత్తింది మల్లి.
'మరి ఈ సాయంత్రం పక్కీదిలో అంబలం పూజ ఉన్నాది. అక్కడికి పిలిసినారు. తానం సేసి పూజకు ఎల్లాల. అక్కడే పెసాదం ఎడతారు' అని చెప్పేడు సూరిబాబు. అలాగేనంది మల్లి.
మర్నాడూ మరో చోటికి పూజకి బయలుదేరేడు సూరిబాబు. 'సావుకారు కూలిడబ్బులు ఇయ్యనేదా స్వామీ' అని నెమ్మదిగా అడిగింది మల్లి. 'మీ యన్న అడమాన్సు తెచ్చినాడు కదా. దానికింద ఇరగ్గొట్టుకున్నాడు సావుకారి. రేపు సూద్దుం లే' అనేసి ఎల్లిపోయాడు.
మూడో రోజు సాయంత్రం మళ్ళీ పూజకి బయలుదేరేముందు మల్లి చేతిలో రెండొందలు పెట్టేడు సూరిబాబు. అయిదొందల రోజు కూలీకి ఇంతే తెచ్చేవేమిటన్నట్టు చూసింది మల్లి. 'వొట్టి సేతుల్తో పూజకి ఎల్లలేము కదా. పూలూ పళ్ళూ కొన్నాను' అని చెప్పేడు సూరిబాబు. పోనీలే, ఇదివరకు మందుకి ఖర్చు పెట్టేవాడు. ఇప్పుడు పూజకి పెడుతున్నాడు. ఇంటికొచ్చే డబ్బులో తేడా లేదు కాని మనిషిలో తేడా వచ్చింది కదా అనుకుని తృప్తి పడింది మల్లి.
సగం రోజుల దీక్ష తర్వాత ఆ రోజు సాయంత్రం సూరిబాబు ఇంటిదగ్గరే ఉండిపోయాడు. 'ఈ రోజు పూజ నేదా?' అడిగింది మల్లి. 'ఉందే. కాని ఏ మొకవెట్టుకుని ఎల్లగలను? ఏదో ఓ రోజు నా ఇంట్లోనూ పూజ సెయ్యాలి కదా? నాకాడ సొమ్మేది?' అంటూ వాపోయాడు సూరిబాబు. ఆ రాత్రంతా ఆలోచించింది మల్లి. ఎన్ని కష్టాలు పడినా సూరిబాబును తాగుడు లోంచి బైట పడెయ్యాలని నిశ్చయించుకుంది. సుబ్బమ్మత్త సలహా మేరకు పది రూపాయల వడ్డీకి పదివేలు తీసుకొచ్చింది. అందుకు పూచీగా పెళ్ళినాటి తులం బంగారం గొలుసును పెట్టింది.
ఇంక వారంలో శబరిమల ప్రయాణం ఉంది. మళ్ళీ డబ్బు కావాలి. ఈ సారి తనమెడలో మిగిలిన నల్లపూసల కుత్తిగంటు అక్కరకొచ్చింది.
మరోసారి బోసిమెడను తడుముకున్న మల్లి ఈ లోకంలోకి వచ్చింది. షేర్ ఆటో దిగింది. నలభై రోజుల దీక్ష సూరిబాబు చేస్తున్నట్టు అనిపించలేదు. తానే దీక్ష పూనినట్టు అనిపించింది మల్లికి. ఈ దీక్ష ఫలిస్తుందా? ఎందుకో కాస్త బెంగగా అనిపించింది. ఓదార్పుగా ఉంటుందని సుబ్బమ్మత్త దగ్గరకెళ్ళి కూర్చుంది. నీ కష్టం ఊరికే పోదులే అని సుబ్బమ్మత్త ఓదార్చింది.
శమరిమల నుండి సూరిబాబు తిరిగొచ్చేడు. నలభై రోజుల పాటు మందు జోలికి పోలేదేమో, మనిషి కాస్త రంగు తేలేడు. సూరిబాబును చూసుకుని మురిసిపోతోంది మల్లి. 'మనం పెల్లి సేసుకున్నప్పుడు ఎలా వుండీవోడివో ఇప్పుడు అలాగే అవుపడతన్నావు' అంది భర్తతో.
ఆ రోజే డ్యూటీకి వెళ్ళిపోయేడు సూరిబాబు. కాని సాయంత్రం వేళకి ఇల్లు చేరలేదు. మల్లి గుండెల్లో అలజడి మొదలైంది. రాత్రి పదిగంటలవేళకి వచ్చేడు సూరిబాబు. ఎవరో తెచ్చి ఇంటిదగ్గర దింపి వెళ్ళిపోయేరు. మత్తులో జోగుతున్నాడు సూరిబాబు. మెకానిక్ షెడ్డు షావుకారును నానా బూతులూ తిడుతున్నాడు. తిట్టి తిట్టి అలాగే మంచం మీదకి జారిపోయేడు. దాంతో నిలువునా నీరుగారిపోయింది మల్లి.
మర్నాడు పలకరించడానికి వచ్చిన అన్నయ్యకి విషయం అంతా చెప్పింది. 'ఐతే ఈడు మల్లీ మొదటికే ఒచ్చేడన్నమాట' అని నిట్టూర్చేడు అప్పారావు. కాసేపటికి 'ఏడాది పొడుగునా మాల ఏసుకునే దీక్స ఏదన్నా వుంటే ఎంత బాగుంటది?' అన్నాడు.
'ఒద్దురా అన్నయ్యా! ఇంతవరకూ అయింది సాలు. ఇప్పుడీడు సేసిన దీక్స ఆడికే గాదు, అంతకన్నా నాకు పెద్ద సిచ్చ అయిపోనాది. ఈడు పుల్లుగా తాగీసివొచ్చినప్పుడూ నాకు సాకిరీ తప్పినాది కాదు. మాల ఏసినప్పుడూ తప్పలేదు. దాంతోబాటు మీరెట్టిన బంగారవూ, నల్లపూసల తాడూ ఆవిరైపోనాయి. తాగుబోతోడికి సొమ్మిచ్చేది లేదని కుండబద్దలుగొట్టి సెప్పొచ్చు. అలాగే కదా నానిన్నాల్లూ మీరెట్టిన బంగారాన్ని కాపాడుకొచ్చినాను? కానీ ఈ దీక్స నుండి మాత్తరం నా బంగారాన్ని కాపాడుకోలేకపోనాను. పోనీ ఈ ఎదవ తాగుడునైనా ఆపగలిగేనా అంటే అదీ నేదు.' అంటూ బోసి మెడని మరోసారి విరక్తిగా తడుముకుంటూ చెప్పింది మల్లి. 'నేనేమైనా చెల్లికి తప్పుడు సలహా గాని ఇచ్చేనా? తాగుడు నుండి బావని కాపాడుకోడానికే కదా నేనూ తాపత్రయపడ్డాను? మరి ఇలాగైందేంటి?' అని బుర్ర గోక్కుంటూ వెళ్ళిపోయాడు అప్పారావు.
'ఇచ్చట అన్ని రకముల వ్రతములకు, దీక్షలకు కావలసిన అన్ని రకాల సామగ్రీ లభించును' అన్న బోర్డు ఓ వైపు, 'అన్ని పుణ్య క్షేత్రములకూ టూరిస్టు యాత్రలు కలవు' అన్న బోర్డు మరోవైపు పెట్టుకున్న షావుకారు సుబ్బిశెట్టి, బ్రాందీ షాపు నడిపే అతగాడి బావమరిది కూర్చుని లెక్కలు వేసుకుంటున్నారు. ఆ పక్కనే అంతా పరిశీలిస్తున్న సుబ్బిశెట్టి పుత్రరత్నం, ఈ రెండు వ్యాపారాలలో ఏది ఎక్కువ లాభసాటిగా ఉందో తేల్చుకోలేకపోతున్నాడు. ఇది కూడా నిర్ధారించలేని తాను చదువుకున్న ఎంబియే కోర్సు వలన ఉపయోగం ఏమిటో కూడా అతగాడికి బోధపడలేదు. ఉండబట్టలేక తండ్రిని అడిగేశాడు. సుబ్బిశెట్టి నవ్వేసి 'ఆ కాలేజీ కూడా మనం ఎట్టిందే కదా?' అన్నాడు. అతగాడి బావమరిది గొల్లున నవ్వేడు.
సుబ్రమణ్యం