Oct 12,2022 07:19

దేశంలో ప్రస్తుతం అమలు చేస్తున్న స్మార్ట్‌ సిటీ, అమృత పథకం... గతంలో అమలు చేసిన జవహర్‌లాల్‌ నెహ్రూ పథకం వంటివన్నీ పట్టణ వ్యవస్థలోని పౌర సదుపాయాలను వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ చేసి పన్నుల భారాలు మోపేవే. పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, రోడ్లు, పార్క్‌లు, వీధి లైట్ల నిర్వహణలో చేస్తున్న ఖర్చును పూర్తిగా ప్రజల నుండి వివిధ పన్నుల రూపాల్లో వసూలు చేయాలన్నదే వీటి లక్ష్యం. అలాగే ఈ వ్యవస్థల నిర్వహణ నుండి మున్సిపల్‌ సంస్థలు వైౖదొలిగి ప్రైవేట్‌ సంస్థల పరం చేయాలన్నదే ఈ సంస్కరణల వ్యూహం.

       గాంధీ జయంతికి ఒక్కరోజు ముందు కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోని పారిశుధ్య పరిస్థితులపై సర్వే నిర్వహించి నగరాలకు ర్యాంకులను ప్రకటించింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌-2022 కింద ఈ ర్యాంకులను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా లక్షకు పైబడి జనాభా గల నగరాలకు ప్రకటించిన 100 ర్యాంకుల్లో ఇండోర్‌ మొదటి ర్యాంకు సాధించింది. ఇండోర్‌ గత ఆరు సంవత్సరాల నుండి వరుసగా మొదటి ర్యాంకులో నిలుస్తున్నది. సూరత్‌ రెండో స్థానంలోను, నవీ ముంబాయి మూడో స్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌ లోని విశాఖపట్నం, విజయవాడ నగరాలు నాలుగు ఐదు ర్యాంకులు పొంది టాప్‌ 5లో నిలిచాయి.
         కేంద్ర ప్రభుత్వం 2016 నుండి పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్య మెరుగుదల కొరకు స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల పథకాన్ని ప్రకటించింది. జాతీయ స్థాయిలో లక్ష జనాభాకు పైబడిన నగరాలు, రాష్ట్ర స్థాయిలో లక్ష లోపు పట్టణాలు, దీనిలో జోనల్‌ స్థాయి పేర పట్టణాలను నాలుగు కేటగిరీలుగా విభజించి ర్యాంకులు ఇస్తున్నారు. చెత్త రహిత నగరాల పేర నగరాలకు స్టార్‌ రేటింగ్‌లు కూడా ప్రకటిస్తున్నారు. ఈ ఏడాది 7 నక్షత్రాల రేటింగ్‌ అవార్డును ఇండోర్‌కి కల్పించారు. ప్రస్తుతం దేశంలో 7 నక్షత్రాల హోదా కలిగిన ఏకైక సిటీ ఇండోర్‌ మాత్రమే. సూరత్‌, భోపాల్‌, మైసూర్‌, నవీ ముంబాయి, విశాఖపట్నం, తిరుపతి నగరాలకు 5 నక్షత్రాల చెత్తరహిత ధృవీకరణ అవార్డులు ఇచ్చారు. మొత్తంగా 412 నగరాలు, పట్టణాలకు 7 నుండి 1 వరకు స్టార్‌ రేటింగ్‌ హోదాలు కల్పించారు.
         కేంద్ర ప్రభుత్వం నేడు సరళీకరణ విధానాలకు రోల్‌మోడల్‌గా ఇండోర్‌ నగరాన్ని చూపిస్తున్నది. పారిశుధ్య నిర్వహణలో గత ఆరేళ్ళ నుండి మొదటి ర్యాంకు ఇస్తూ దేశ పట్టణ ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దేశంలోని ముఖ్యమైన నగర పాలక సంస్థల కార్పొరేటర్లను, మేయర్లను అధ్యయన యాత్ర పేర ఇండోర్‌ సిటీకి తీసుకెళ్తున్నారు. ప్రభుత్వం ఇండోర్‌ వేదికగా వర్క్‌షాపులు, అంతర్జాతీయ సెమినార్లు, సింపోజియమ్‌లు నిర్వహిస్తున్నది. వీటన్నింటి ఉద్దేశ్యం ఇండోర్‌లో చేపట్టిన విధానాలను దేశంలోని అన్ని నగరాల్లో అమలు చేయాలనే ఎజెండాయే కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకున్నది.
         ఇండోర్‌లో చేపట్టిన కొన్ని సంస్కరణలను మనం పరిశీలిస్తే ప్రభుత్వ అసలు ఎజెండాను అర్థం చేసుకోవచ్చు. మొదటగా పారిశుధ్య నిర్వహణ చూద్దాం. ఈ నగరంలో బిజెపి పాలక వర్గంగా ఉంది. 25 లక్షల జనాభా కలిగిన ఈ నగరంలో 7500 మంది కార్మికులు పారిశుధ్య విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా పర్మినెంట్‌ కార్మికులు కాదు, కాంట్రాక్టు కార్మికులు. మొత్తం నలుగురు కాంట్రాక్టర్ల కింద పనిచేస్తున్నారు. వీరి నెల జీతమెంతో తెలుసా? కేవలం రూ.8700 మాత్రమే. వీరంతా దళితులు, పేద కుటుంబాల నుండి వచ్చిన కార్మికులు. అత్యంత దారుణంగా వీరి శ్రమను దోచుకుంటున్నారు. వీరి ఉద్యోగాలకి ఎలాంటి భద్రతే లేదు.
ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్నును మదింపు చేసే పద్ధతిని అమలులోకి తెచ్చారు. నీటి ఛార్జీలను నెలకి రూ.300కు పెంచారు. మురుగునీటి ఛార్జీలను నెలకి రూ.60 వసూలు చేస్తున్నారు. చెత్తపై యూజర్‌ ఛార్జీలను నివాస గృహాలకు నెలకి రూ.90 నుండి రూ.160 వసూలు చేస్తున్నారు. ప్రతి ఏడాది వీటన్నింటిపై 10 శాతం చొప్పున పెంపుదల విధించారు. పార్కింగ్‌ ఫీజులు నగరమంతా విధించారు.
         ఇళ్ళ దగ్గర నుండి, వీధుల నుండి సేకరించిన చెత్తను తరలించడం కూడా ప్రైవేటీకరించారు. చెత్త తరలించే కార్మికులు, వాహనాలు కూడా ప్రైవేటువే. ఇండోర్‌ లోని బస్‌స్టాప్‌లు, రోడ్డు డివైడర్లు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, గ్రీనరీ, బహుళ అంతస్తుల పార్కింగ్‌లు, ట్రాఫిక్‌ సిగల్‌ బోర్డులు వంటివన్నీ 15 నుండి 20 ఏళ్ల పాటు ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేశారు. వీటి నుండి వ్యాపార, వాణిజ్య, ప్రకటనల ఫీజులు ద్వారా వచ్చే ఆదాయం మొత్తం ప్రైవేట్‌ సంస్థలకే దక్కే ఒప్పందాలు చేశారు. స్మార్ట్‌ సిటీ ప్రాంతంలో 24×7 మంచినీటి పథకం పేర మంచినీటి సరఫరాను, నిర్వహణను, చార్జీల నిర్ణయం, వసూళ్లును పూర్తిగా 15 ఏళ్లపాటు ప్రైవేట్‌ సంస్థకు ధారాదత్తం చేశారు.
          మరో ప్రమాదకర చర్యలకు కూడా ఇండోర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ తెరలేపింది. కార్పొరేషన్‌ నిర్మించిన 200 షాపులను వేలంలో అమ్మకానికి పెట్టారు. వాణిజ్య సముదాయాలను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం (పిపిపి) పేర ప్రైవేట్‌ సంస్థలకు గుత్తకిచ్చారు. ఆస్తిపన్ను చెల్లింపులో ఏడాది దాటి ఆలస్యమైతే 1.5 నుండి 2 రెట్లు పెనాల్టీ విధించే విధానాన్ని తీసుకొచ్చారు. దీనికోసం రాష్ట్ర మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం-1956 లోని సెక్షన్‌ 136ని సవరించారు. 2021లో ఇండోర్‌ డెవలప్‌మెంట్‌ స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. రోడ్లు వెడల్పుల పేర 500 మీటర్ల వరకు రోడ్డుకిరువైపుల బెటర్‌మెంట్‌ చార్జీల పేర నివాస, వాణిజ్య భవనాలపై అదనపు పన్నులు వడ్డిస్తున్నారు. ఇప్పుడు వ్యర్థాల నిర్వహణను కూడా ప్రైవేట్‌ సంస్థలకి అప్పగించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం వ్యర్థాల నుండి సంపద సృష్టి పేర రూ.550 కోట్లు పెట్టుబడితో బయో-సిఎన్‌జి గ్యాస్‌ ఉత్పత్తిని పిపిపి పేర బడా కార్పొరేట్‌ సంస్థకి కట్టబెట్టారు. బిఆర్‌టిఎస్‌ రోడ్డు రవాణాను కూడా ప్రైవేట్‌ పరం చేశారు. ఇప్పుడు నిధులు లేక తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. అప్పుల ఊబి లోకి ఇండోర్‌ను దించేశారు. ఈ కార్పొరేషన్‌ వార్షిక నికర బడ్జెట్‌ రూ.1564 కోట్లు మాత్రమే. కానీ అప్పు చూస్తే రూ. 648 కోట్లకు చేరింది. ఇప్పుడు చేపట్టిన ప్రాజెక్టులకు నిధులు లేక ఇంకా అప్పులు కోసం ఇండోర్‌ ఎదురు చూస్తున్నది. ఇదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని పట్టణాలు, నగరాల్లో అమలు చేయటానికి కేంద్ర బిజెపి సర్కార్‌ పూనుకుంది.
        కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణ రంగంలో ర్యాంకుల పద్ధతిని ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో తీసుకొచ్చింది. ర్యాకింగ్‌లతో నగరాల మధ్య పోటీతత్వాన్ని పెంపొందించటం ద్వారా నగరాల్లో, పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుపడుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తున్నది. ఇదంతా ఒక తంతు మాత్రమే. ప్రతి ఏడాది మార్చిలో ప్రజల నుండి ఆన్‌లైన్‌ మరియు ప్రత్యక్ష పద్ధతి ద్వారా అభిప్రాయాలు సేకరించి ప్రకటిస్తున్నారు. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతాల నుండి ఈ అభిప్రాయ సేకరణ జరుగుతుంది. ఉదాహరణకు విశాఖలో ఆర్‌కె బీచ్‌, ఎంవిపి, మురళీనగర్‌ ఇలా పెద్ద రోడ్లు ఉండి మధ్య తరగతి ప్రజలు ఉండే ప్రాంతాల నుండి అభిప్రాయ సేకరణ జరుగుతుంది. పారిశుధ్య నిర్వాహణ కూడా ప్రధాన రహదార్లు, మధ్యతరగతి నివాస ప్రాంతాలపైనే కేంద్రీకరణ ఉంటుంది. పేదల ఆవాసాలు, మురికివాడలు, కొండ వాలు, విలీన ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో అత్యంత ఘోరంగా ఉంటుంది. ఈప్రాంతాల్లో అభిప్రాయ సేకరణే జరగదు. అంతేగాక ర్యాంకుల కోసం రాష్ట్రాలు కేవలం కొన్ని నగరాలపైనే దృష్టి కేంద్రీకరించి అత్యధిక నగరాలు, పట్టణాల పారిశుధ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి.
         సేకరించిన ఘన వ్యర్థాలను వేరు చేయడంలో, పోగుపడిన వ్యర్థాల నిర్వహణలో దేశంలోని అన్ని నగరాలు పూర్తిగా విఫలమౌతున్నాయి. పారిశుధ్య నిర్వహణ ర్యాంకుల పేర దీనిని మరుగున పరుస్తున్నారు. నేడు వ్యర్థాల నిర్వహణ అన్ని నగరాలు, పట్టణాలకు పెద్ద సవాలుగా మారింది. కొన్ని ప్రాంతాల్లో వ్యర్థాలను పోగు పెట్టటం, భూమిలో పూడ్చటం, కాల్చటం ద్వారా తీవ్ర పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి. వ్యర్థ నిల్వలు ఉన్న ప్రాంతమంతా దుర్గంధంతో నిండి ఆ ప్రాంత ప్రజలు అనారోగ్యం పాలౌతున్నారు. ఈ వ్యర్థాలన్ని శాస్త్రీయంగా, సాంకేతికంగా నిర్మూలించాలంటే చాలా వ్యయంతో కూడుకున్నది. దేశంలో ఏ నగరం అంత ఖర్చును భరించలేదు. ఎందుకంటే ప్రస్తుత చెత్త సేకరణ, తరలింపు కొరకు పట్టణ స్థానిక సంస్థలు తమ బడ్జెట్లలో కనీసం 20 నుండి 25 శాతం ఖర్చు చేయాల్సి వస్తున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వ్యర్థాల నిర్మూలనకు నిధులు ఇవ్వవు. ఫలితంగా దేశంలో ప్రతి నగర, పట్టణ శివార్లలో డంపింగ్‌ యార్డులు వేల, లక్షల టన్నుల వ్యర్థాలతో నిండి పోయి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.
         ర్యాంకుల ఆధారంగా అభివృద్ధిని అంచనా వేయడం వెనుక ప్రజలు, పట్టణాలు, వివిధ రంగాల స్థితిగతులను మెరుగుపర్చటం ప్రభుత్వ ప్రధాన ఉదేశ్యం కాదు. ర్యాంకుల సిద్ధాంతం ప్రపంచ బ్యాంకుది. భారత దేశంలో గత రెండు దశాబ్దాల నుండి పట్టణ రంగంలో సరళీకరణ విధానాలు అమలుపర్చటానికి ప్రపంచ బ్యాంకు ర్యాంకుల ప్రక్రియను ముందుకు తీసుకొచ్చింది. ప్రపంచబ్యాంకు ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు, ఇతర అంతర్జాతీయ సంస్థలు వాటి నిధులతో మన దేశంలో అమలు చేస్తున్న పథకాల్లో ఒక షరతు ర్యాంకుల సిద్ధాంతం అమలు చేయడం. విదేశీ, స్వదేశీ బడా పెట్టుబడిదారులకు అన్ని రంగాల్లో స్వేచ్ఛగా అవకాశం కల్పించటం. పట్టణ వ్యవస్థలో పౌరసేవలను ప్రైవేటీకరించటం ఈ ర్యాంకుల ప్రధాన లక్ష్యం. అందులో భాగంగానే ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేర దేశాలకు ప్రపంచ బ్యాంకు ర్యాంకులు ప్రకటిస్తున్నది. ప్రతి దేశంలోని రాష్ట్రాలకు కూడా ర్యాంకులు ప్రకటిస్తున్నారు. ఈ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ ఈ ఏడాది మొదటి ర్యాంకు పొందిన విషయం తెలిసిందే. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో భాగంగా దేశంలోని అత్యధిక నగరాల్లో భవన నిర్మాణాల ప్లాన్‌లను ప్రైవేటీకరించేశారు. నివాస యోగ్యం పేర నగరాలకు ర్యాంకులను కూడా ప్రకటిస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లోకి ఈ ర్యాంకుల పద్ధతిని తీసుకొచ్చి ప్రజలను, దేశాన్ని సమస్యల నుండి పక్కదారి పట్టిస్తున్నారు. ప్రైవేటీకరణ చర్యలను వేగంగా అమలు చేస్తున్నారు. ప్రజలపై అనేక రకాల పన్నులు, యూజర్‌ చార్జీలు, ఫీజుల భారాలు మోపుతున్నారు.
          దేశంలో ప్రస్తుతం అమలు చేస్తున్న స్మార్ట్‌ సిటీ, అమృత పథకం...గతంలో అమలు చేసిన జవహర్‌లాల్‌ నెహ్రూ పథకం వంటివన్నీ...పట్టణ వ్యవస్థలోని పౌర సదుపాయాలను వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ చేసి పన్నుల భారాలు మోపేవే. పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, మంచినీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, రోడ్లు, పార్క్‌లు, వీధి లైట్ల నిర్వహణలో చేస్తున్న ఖర్చును పూర్తిగా ప్రజల నుండి వివిధ పన్నుల రూపాల్లో వసూలు చేయాలన్నదే వీటి లక్ష్యం. అలాగే ఈ వ్యవస్థల నిర్వహణ నుండి మున్సిపల్‌ సంస్థలు వైౖదొలిగి ప్రైవేట్‌ సంస్థల పరం చేయాలన్నదే ఈ సంస్కరణల వ్యూహం.
           రెండోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ స్థానిక సంస్థలకు ఇచ్చే నిధులలో క్రమేణా కోత పెడుతున్నారు. ఇచ్చే కొద్దిపాటి ఆర్థిక సంఘం నిధులు, వివిధ పథకాల నిధులకు కూడా షరతులు ముడిపెడుతున్నారు. నిర్వహణకు అవసరమైన నిధులను స్థానిక ప్రజల నుండే సేకరించుకోవాలని అందుకు చట్టాలను మార్చేస్తున్నారు. ఇప్పుడు నిధుల సమీకరణ కొరకు నగరాలను బోంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో నమోదవ్వాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం వత్తిడి చేస్తున్నది. అప్పుల సామర్థ్యం తెలిపేందుకు క్రెడిట్‌ రేటింగ్‌ ఏజెన్సీలు ప్రతి నగరానికి ''ఎ నుండి డి'' వరకు క్రెడిట్‌ రేటింగ్‌ ఇస్తున్నాయి. ఇప్పటికే ఇండోర్‌, అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, లక్నో వంటి అనేక నగరాలు అప్పుల కోసం బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లో నమోదయ్యాయి. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ''అమరావతి బాండ్స్‌'' విడుదల చేసి రూ.2 వేల కోట్లు రుణం సేకరించిన విషయం తెలిసిందే. ఇలా దేశంలోని పట్టణ, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. అందుకు ర్యాంకులను ఒక ఎరగా పట్టణాలు, నగరాలపై కేంద్ర బిజెపి సర్కార్‌ ప్రయోగించింది.

(వ్యాసకర్త సెల్‌ : 9490098792)
డా|| బి. గంగారావు

డా|| బి. గంగారావు