'జాతీయ సమయ వినియోగ సర్వే' ప్రకారం 81.2 శాతం మహిళలు ఎటువంటి చెల్లింపు లేని ఇంటి చాకిరిలో నిమగమై ఉన్నారు. అదే పురుషుల విషయానికి వచ్చేసరికి 26.1 శాతం మాత్రమే అటువంటి పనిలో వున్నారు. పురుషులు వారానికి సగటున 42 గంటల పాటు సాంప్రదాయకంగా ఆర్థిక కార్యకలాపంగా పరిగణించే ఉత్పత్తి పనుల్లో పాల్గొంటారు. స్త్రీలు 19 గంటలు పాల్గొంటున్నారు. అయినప్పటికీ మహిళలు... గృహ నిర్వహణ, పిల్లలు-వృద్ధుల సంరక్షణ, కుటుంబంలో జబ్బు పడిన వారి కోసం 34.6 గంటలు వెచ్చిస్తారు. పురుషులు ఈ విధమైన పనులకు వెచ్చించేది 3.6 గంటలు. అంటే స్త్రీలు పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువగా కుటుంబ నిర్వహణ పనులలో వుంటారన్నమాట.
నేడు భారతదేశంలో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు...ప్రభుత్వ గణాంకాల ప్రకారం 32.8 శాతం వుండగా, ప్రపంచ బ్యాంకు ప్రకారం 24 శాతం వుంది. అదే చైనాలో 61 శాతం, బంగ్లాదేశ్‌లో 38 శాతం, నేపాల్‌లో 29 శాతం, పాకిస్తాన్‌లో 25 శాతం వుంది. మహిళా సాధికారతను కల్పించేందుకు శ్రమలో స్త్రీల వాటా పెంచాలని భారత్ భావించినట్లయితే...మహిళల పనికి సంబంధించిన అపోహలు తొలగిపోవాలి. స్త్రీల పనిని సముచితంగా లెక్కించాలి. వారు శ్రమ చేయడానికి మద్దతు ఇవ్వాలి.
తల్లిదండ్రులు ఇంటి బయట పని చేస్తున్నప్పుడు వారి బిడ్డల ఆలనాపాలనా చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలనేది విశ్వవ్యాప్తంగా అంగీకరించిన సత్యం. భారతదేశంలోని కుటుంబ నిర్మాణాలు చారిత్రాత్మకంగా తరచూ ఈ అవసరాన్ని పూరించాయి. తండ్రులు ఇంటి వెలుపల పని చేస్తారు. పిల్లలు, పెద్దల సంరక్షణ పనులను తల్లులు చేస్తారు. అయితే, ఈ విధమైన కుటుంబ నిర్మాణం...పెరుగుతున్న భారత దేశ ఆశయాలకు అనుకూలంగా లేదు. దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే, మహిళల భాగస్వామ్యం వుండాలి. అందుకు రెండు ప్రత్యేక మార్గాలు ఉన్నాయి: మహిళల పని (తరచుగా పిల్లలు, పెద్దల సంరక్షణ పని)ని సక్రమంగా విలువ కట్టాలి. ఇంటి బయట ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడానికి మహిళలకు తగిన మద్దతు ఇవ్వాలి.
మహిళలందరూ పని చేస్తారు. కానీ వారందరికీ జీతం అందదు. 2023 నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త క్లాడియా గోల్డిన్ అమెరికా చరిత్రపై చేసిన కృషి ఈ అంశాన్నే తెలియచేస్తుంది. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 2020లో విడుదల చేసిన భారతదేశపు మొట్టమొదటి 'జాతీయ సమయ వినియోగ సర్వే' ప్రకారం 81.2 శాతం మహిళలు ఎటువంటి చెల్లింపు లేని ఇంటి చాకిరిలో నిమగమై ఉన్నారు. అదే పురుషుల విషయానికి వచ్చేసరికి 26.1 శాతం మాత్రమే అటువంటి పనిలో వున్నారు. పురుషులు వారానికి సగటున 42 గంటల పాటు సాంప్రదాయకంగా ఆర్థిక కార్యకలాపంగా పరిగణించే ఉత్పత్తి పనుల్లో పాల్గొంటారు. స్త్రీలు 19 గంటలు పాల్గొంటున్నారు. అయినప్పటికీ మహిళలు...గృహ నిర్వహణ, పిల్లలు-వృద్ధుల సంరక్షణ, కుటుంబంలో జబ్బు పడిన వారి కోసం 34.6 గంటలు వెచ్చిస్తారు. పురుషులు ఈ విధమైన పనులకు వెచ్చించేది 3.6 గంటలు. అంటే స్త్రీలు పురుషుల కంటే 10 రెట్లు ఎక్కువగా కుటుంబ నిర్వహణ పనులలో వుంటారన్నమాట.
దీనికి రెండు ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి- శ్రామిక మహిళలు భయంకరమైన ''రెట్టింపు భారాన్ని'' ఎదుర్కొంటారు. ఇక్కడ ఇంటి బయట పని చేయడం, కుటుంబ ఆదాయానికి తోడ్పడడం వల్ల వారి ఇంటి చాకిరి ఏమీ తగ్గదు. రెండు-పిల్లలు, వృద్ధుల సంరక్షణకు వారు చేసే పనులేవీ ఆర్థిక కార్యకలాపాలుగా లెక్కించబడవు. ఈ పనులతో అలసిపోయిన మహిళలకు పురుషులతో పోల్చుకుంటే వారంలో అతి తక్కువ విశ్రాంతి సమయమే మిగులుతుంది.
ఎస్‌బిఐ నివేదిక ప్రకారం ఎటువంటి చెల్లింపు లేకుండా మహిళలు చేస్తున్న పని ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నది. ఇది జిడిపిలో 7.5 శాతానికి బాధ్యత వహిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, మహిళలు ఇంటి పని భారాన్ని మోయడమే కాకుండా, ఈ ప్రక్రియలో వారు జిడిపిని కూడా పెంచుతారు. అయినా అధికారిక రికార్డుల ప్రకారం వారు పనిచేయనట్టే లెక్క.
మహిళలు చేసే శ్రమను లెక్కించే విధానాన్ని ప్రభుత్వాలు మార్చుకోవాలి. అంతర్జాతీయంగా నిర్వచించబడిన 'జాతీయ ఖాతాల వ్యవస్థ' ప్రమాణాలలో మార్పు కోసం భారతదేశం పిలుపు ఇవ్వవచ్చు. ఆ కృషికి నాయకత్వం వహించవచ్చు. తద్వారా జిడిపి గణన నుండి జనాభా గణనకు ఉద్దేశించబడిన ప్రశ్నాపత్రాలన్నింటిలో మార్పులు, చేర్పులు చేయవచ్చు. లెక్కించనప్పుడు మహిళల చాకిరీ కనిపించదు. దీని ప్రభావం కార్మిక, ఉపాధి విధానాలపై ఉంటుంది. శ్రమ లెక్కల్లో కనిపించకపోవడంతో ఇంటి చాకిరి చేసే వీరు ''రక్షిత కార్మిక చట్టాల పరిధి వెలుపలే'' వుండిపోతారు. అంతేగాక ఇది పనిదినాన్ని పరిమితం చేస్తుంది. కార్మిక పరిస్థితులను నియంత్రిస్తుంది. భారతదేశంలో స్త్రీలు పురుషుల కంటే రోజుకు 1.5 గంటలు ఎక్కువ పని చేస్తారు. అది కూడా ఏ విధమైన జీతం లేకుండా, అపరిశుభ్రమైన పరిస్థితుల్లో పని చేస్తారు.
ఈ అంశానికి మరొక కోణం ఉంది. అదే-ఇంటి వెలుపల పని చేసే మహిళలకు మద్దతు ఇవ్వడం. తక్కువ-ఆదాయ కుటుంబాలలో, ఒక్కరే ఆదాయ వనరుగా వుండడమనేది అసంభవం. తల్లిదండ్రులు ఇద్దరూ పని చేయాల్సి ఉంటుంది. అంటే, డబ్బు సంపాదించేవారికి, కుటుంబ సంరక్షణ చూసే వారికి ఇప్పటి వరకు వున్న నమూనా విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. తక్కువ ఆదాయ మహిళలు మనం ఊహించనదానికంటే ఎక్కువగా ఎవరి మద్దతు లేకుండానే పని చేస్తున్నారు. అయితే ఈ పనిలో కనిపించే అస్థిరత కారణంగా వీరి శ్రమ గణాంకాల్లో ప్రతిబింబించదు. మహిళల పని కాలానుగుణంగా వుంటుంది. చెదురుమదురుగాను, క్రమరహితంగా కూడా వుంటుంది. వీరు తరచుగా ఇంట్లోంచే కుటుంబ వ్యాపారాలకు తోడ్పాటునందిస్తారు.
నాలుగు నెలల వ్యవధిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు దాదాపు 44 శాతం మహిళలు శ్రామిక శక్తిలో భాగంగా వున్నారని ఒక అధ్యయనం వెల్లడించింది. అయితే దానికి కొనసాగింపుగా నాలుగు సంవత్సరాల వ్యవధిని పరిగణనలోకి తీసుకున్నప్పుడు కేవలం 2 శాతం మహిళలు మాత్రమే లెక్కల్లో వున్నారు. ఇంటి బాధ్యతలు వారిని సాధారణ ఉద్యోగం నుండి దూరంగా ఉంచుతాయి. వారు పని చేసినప్పుడు సాధారణంగా పిల్లలు వెంటే వుంటారు. నిర్మాణ ప్రదేశాలలో ప్రమాదకరమైన పరికరాలు, అధిక కాలుష్యం నీడలో పిల్లలు ఆడుతున్నారని 2013లో హార్వర్డ్ పరిశోధకులు వివరించారు. ఇది మెదడు అభివృద్ధికి అత్యంత కీలకమైన వయస్సులో (మూడేళ్ల లోపు) వారి జీవితాలను, ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. విద్య, ఆరోగ్యం, నైపుణ్యం కోసం ఉద్దేశించిన అన్ని తదుపరి ప్రయత్నాలు, ప్రజా నిధులు బలహీనమైన పునాదిపైనే నిర్మితమయ్యాయి.
పిల్లల కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ప్రజా వ్యవస్థ-అంగన్‌వాడీ వ్యవస్థను నడుపుతోంది. 14 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా ఆరు సంవత్సరాలలోపు 8 కోట్ల మంది పిల్లలకు ఈ సేవలు అందుతాయి. అయినప్పటికీ, ఈ కేంద్రాలు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయి. కాబట్టి, మహిళలు పూర్తిగా ఎనిమిది గంటల పని చేయాలంటే వారికి అదనంగా సంరక్షణ కేంద్రాలు అందుబాటులో వుండడం అవసరం.
వేగంగా పట్టణీకరణ చెందుతున్న భారతదేశంలో మహిళలు శ్రమ చేసేందుకు వీలుగా వీరికి పలు సౌకర్యాలు కల్పించాలి. క్రెచ్‌లు ఒక పరిష్కారాన్ని అందిస్తాయి. 2020 నాటికి 'జాతీయ క్రెచ్ పథకం' దేశవ్యాప్తంగా దాదాపు 6,500 క్రెచ్‌లను నిర్వహిస్తోంది. తల్లులు ఒక స్థిరమైన వృత్తిని/ఉద్యోగాన్ని ఎంచుకుని పని చేయడానికి ఈ క్రెచ్‌లు సహాయ పడతాయి. అలాగే పిల్లలు సురక్షితంగా, ఆరోగ్యకరంగా ఎదిగే వాతావరణాన్ని అందిస్తాయి. ప్రైవేట్ రంగం ఈ అవసరాన్ని గుర్తించి అధిక-ఆదాయ కుటుంబాలకు ఈ సేవలను అందిస్తుంది. పిల్లల సంరక్షణ/ప్రీస్కూల్ అనేది రూ.31,256 కోట్ల పరిశ్రమ. 2028 నాటికి వార్షిక రాబడి (సిఎజిఆర్) 11.2 శాతం వరకు వృద్ధి చెందుతుందని అంచనా. కాబట్టి ఆదాయ అసమానతను అధిగమించడానికి, అందరికీ నాణ్యత కల్గిన బాలల సంరక్షణ సేవలు అందించడానికి...ప్రభుత్వ రంగం ఇప్పటికే మొదలెట్టిన ప్రయత్నాలను వేగవంతం చేయాల్సి వుంది.
నేడు భారతదేశంలో మహిళా కార్మిక భాగస్వామ్య రేటు...ప్రభుత్వ గణాంకాల ప్రకారం 32.8 శాతం వుండగా, ప్రపంచ బ్యాంకు ప్రకారం 24 శాతం వుంది. అదే చైనాలో 61 శాతం, బంగ్లాదేశ్‌లో 38 శాతం, నేపాల్‌లో 29 శాతం, పాకిస్తాన్‌లో 25 శాతం వుంది. మహిళా సాధికారతను కల్పించేందుకు శ్రమలో స్త్రీల వాటా పెంచాలని భారత్ భావించినట్లయితే...మహిళల పనికి సంబంధించిన అపోహలు తొలగిపోవాలి. స్త్రీల పనిని సముచితంగా లెక్కించాలి. వారు శ్రమ చేయడానికి మద్దతు ఇవ్వాలి.
/ 'హిందూ' సౌజన్యంతో /