
చంద్రయాన్-3 చందమామ మీద సురక్షితంగా దిగటంతో యావత్ ప్రపంచం మన శాస్త్రజ్ఞుల ప్రతిభా పాఠవాలకు మురిసిపోయింది. దీనికి కొద్ది రోజుల ముందు రష్యా వాళ్ళ ఉపగ్రహం కూలిపోవడంతో మనం ఆందోళన చెందాం చంద్రయాన్ గురించి. చివరికి కథ సుఖాంతమై అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దేశం గర్వపడింది మన శాస్త్రవేత్తల దీక్ష, దక్షత చూసి. ఇది ఇస్రో విజయం. భారత్ సైన్స్ విజయం. భారతీయులందరి విజయం. ఇది ఇండియన్ సైన్స్ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయవలసిన అద్భుత విజయం. అందులో ఎటువంటి సందేహమూ లేదు. అయితే ఈ విజయం మనకు ఏ పాఠం బోధించుతున్నదో ఆలోచించే సమయం వచ్చింది.
మన దేశానికి సైన్స్ సంస్కృతి, జాతీయ సైన్స్ విధానం, సైన్స్ విద్య, శాస్త్రీయ దృక్పథం అనే అంశాలను పెంపొందించటానికి విధాన రూపకల్పన ఆవశ్యకత వున్నది. దీని మీద విస్త్రుత చర్చ జరగాలి. రాజకీయం సంతరించుకున్న అంశం కాదు గదా అనుకోకుండా ఆ చర్చకి ప్రధాన స్రవంతి మీడియా సహకరించాలి. ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి మన ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం విన్న చాలామందికి విచారం కలిగింది. శాస్త్రవేత్తలను అభినందించటం అభిలషణీయమే. కానీ ఆ సందర్భంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అశాస్త్రీయంగా వున్నాయి. మన ఉపగ్రహం దిగిన చోటుని 'శివశక్తి'గా నామకరణం చెయ్యటం హాస్యాస్పదంగా వుంది. ఇది ఇస్రో విజయం, ఈశ్వర విజయం కాదు. సైన్స్ విజయానికి మత విశ్వాసానికి సంబంధం లేదు. చంద్రయాన్ కోసం పనిచేసిన శాస్త్రజ్ఞుల్లో అనేక మత విశ్వాసాలకు చెందిన వారు ఉండొచ్చు. వారు విశ్వాసాలతో నిమిత్తం లేకుండా కేవలం శాస్త్రీయ దృక్పథంతో ఒక ధ్యేయం కోసం అంకితభావంతో పని చేశారు. మరి అటువంటి పనికి ఒక మతపరమైన పేరు పెట్టటాన్ని ఏమనుకోవాలి? ప్రధాని ఆలోచన దేశ ప్రజల మనోభావాలను బాధించింది. ఇదేనా సైన్సు విజయానికి, శాస్త్రవేత్తలకు ఇచ్చే గౌరవం?
సైన్సు పట్ల గౌరవం వేరే విధంగా వుండాలి. రోదసి సైన్సుకి పునాదులు వేసిన హోమీబాబా, విక్రమ్ సారాభారు లాంటి వారి జీవితాలను చిన్నపిల్లలకు తెలియచేయాలి. వారిలో సైన్స్ పట్ల ఇష్టం పెంచాలి. అంతేగాని ఇస్రోలో ఈశ్వర నామం ఏంటి? ఇంకా నయం. దేశ ప్రజలు చేసిన పూజలు ఫలించి, భగవంతుని ఆశీస్సులతో మన ఉపగ్రహం సురక్షితంగా దిగింది అనలేదు. మన నాయకులు ఏమన్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. మన నాయకుల్లో శాస్త్రీయ దృక్పథం లేదుగనక. మతాన్ని పరిపాలనకు ఎజెండాగా చేసుకున్న నాయకులకు శాస్త్రీయ దృక్పథం ఎక్కడి నుంచి వస్తుంది? ఆగస్టు 23ని రోదసి దినోత్సవంగా ప్రకటించడం కంటి తుడుపు చర్యలా వుంది. ఇకపోతే ఇస్రోకి భారతరత్న అవార్డ్ ఎందుకు ఇవ్వకూడదు? వ్యక్తులకే కాదు సంస్థలకు గూడా ఇవ్వవచ్చు అత్యున్నత బిరుదు. ఏదో ఒక రోజున పాటించటం కాకుండా కనీసం మన స్కూళ్లలో సైంటిఫిక్ టెంపర్ అనే అంశం మీద చిన్నారుల్లో అవగాహన, ఆసక్తి కలిగించటానికి అనువైన చర్యలు తీసుకోవాలి.
చందమామ ఉపరితలానికి మన ఇష్టం వచ్చినట్లు పేర్లు పెట్టటం విడ్డూరం. చందమామ ఏమన్నా భారతీయుల సొంతమా? అక్కడ మనం దిగిన ప్రదేశానికి మన ఇష్టంవచ్చిన పేర్లు పెట్టుకోవచ్చునా? అంతర్జాతీయ చట్టం, అవగాహనా ఒప్పందాలు ఏం నిర్దేశిస్తున్నాయి? సైన్సు సాధించిన విజయంలో నుంచి సైన్స్‌ను పూర్తిగా విస్మరించి మతం రంగు పులమడం అనేది అవిద్య వలన సంక్రమించిన అజ్ఞానం. వీళ్లా మన దేశాన్ని విజయ పథంలో నడిపిస్తామని గుండెలు బాదుకుని అరిచేది? ఇటువంటి పాలకులకు సైన్సువిధానం రూపొందించే బాధ్యతను అప్పచెప్పటం సబబేనా? అందుకే సైన్స్ విధానం మీద చర్చించాల్సిన అవసరముంది. సరే దీన్ని కాసేపు ఇక్కడ వదిలేద్దాం. ఇంకా ముఖ్యమైన విషయాలున్నాయి చర్చించటానికి. మన విద్యా విధానంలో సైన్సు గురించి చిన్నారులకు తొలిసారి తెలిసేది హైస్కూల్ దశలో. ఈ దశలో పిల్లలకు సైన్సు పట్ల ఆలోచన, ఆసక్తి రేకెత్తించటానికి ముఖ్యంగా కావలసినది ప్రయోగశాల. దేశవ్యాప్తంగా ప్రభుత్వ హైస్కూళ్లలో ప్రయోగశాలలు లేవు. ఉన్నాకూడా పేరుకేగానీ అక్కడ ప్రయోగాలు జరగవు. కారణం అందరికీ తెలుసు. ప్రయోగాలకు కావలసిన పరికరాలు వుండవు. పరికరాలు అరకొరగా వున్నచోట రసాయనాలు లాంటి పదార్ధాలు కొనటానికి నిధులుండవు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్లో సైన్సు పట్ల ఆసక్తి ఏవిధంగా మొలకెత్తుతుంది? కేంద్ర ప్రభుత్వం దేశానికి విద్యావిధానం రూపొందిస్తుంది గానీ విద్య కోసం రాష్ట్రాలకు సరైన ఆర్థిక వనరులు సమకూర్చదు. వనరుల విషయానికి వస్తే విద్య ఉమ్మడి జాబితా అంశమవుతుంది. విధానానికి వస్తే ఉమ్మడి జాబితాలోని అంశాల మీద విధానాలను రూపొందించే అధికారం కేంద్రానికి వుంది అనేది ఢిల్లీ పెద్దల వాదన. మరి నేటి విద్యార్థులు రేపటి శాస్త్రజ్ఞులు ఎలా అవుతారు? మన హైస్కూళ్లలో సైన్సు విద్యను ప్రోత్సహించటానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? చిన్నారుల మనసు సైన్సువైపు మళ్లేలా చేపట్టవలసిన కార్యాచరణ ఏమిటి? ఈ ప్రశ్నలు పాలకుల ముందుంచాలి. ముందుగా నిధుల అవసరం గుర్తించాలి. సైన్సును వ్యాప్తి చేసేవిధంగా ఉపాధ్యాయులను ప్రోత్సహించాలి. నూతన బోధనా పద్ధతి మీద ఉపాధ్యాయులలో అవగాహన కలిగించాలి. ప్రయోగశాలలను మెరుగుపరచాలి. పరికరాలు, రసాయన పదార్థాల కొనుగోలుకు వీలు కల్పించాలి. జిల్లా పరిషత్ హైస్కూళ్లలో గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలి. మంచి పుస్తకాలను పిల్లలకు అందుబాటులో ఉంచాలి. వీటన్నిటికీ నిధులు కావాలి. అవి ఎక్కడ నుంచి వస్తాయి? అందుకే సైన్సు విధానం, సైన్సు విద్య, సైన్సు సంస్కృతి, శాస్త్రీయ దృక్పథం అన్న అంశాల మీద విస్త్రుత చర్చ జరగాలి.
మత విశ్వాసాలు బలంగా నాటుకున్న సమాజంలో శాస్త్రీయ దృక్పథం పెంపొందించటం చాలా కష్టంతో కూడుకున్న పని. ఒక సైన్సు ప్రయోగం విజయం సాధించాలని దేశం నలుమూలలా యజ్ఞయాగాలు చెయ్యటం చూసి ప్రపంచం విస్తుపోయింది. ఆ ప్రయోగం విజయవంతమయ్యాక మన ప్రధాన మంత్రి నోటి నుంచి 'శివశక్తి' అనే మాట వచ్చినప్పుడు విశ్వాసం, విజ్ఞానం కలిసిపోయినాయి. అది పెద్ద ప్రమాదాన్ని సూచించే మాట. జ్ఞాన అన్వేషణకు, జ్ఞాన సముపార్జనకు, సత్య శోధనుకు విఘాతం కలిగించే మాట.
ఎంతో అభివృద్ధి చెందిన జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్ వంటి దేశాలు ఈ రోదసి ప్రయోగాల జోలికి పోవటం లేదు. వారి దేశాల్లో మానవ అభివృద్ధి సూచికలను మెరుగుపరిచే దిశగా వారు పయనిస్తుంటే మనకెందుకు ఈ గోల? మన దేశ అవసరాలేమిటి? మన ప్రజల ఆశలు, ఆశయాలేమిటి? మనం చేస్తున్నదేమిటి? చంద్ర మండలం మీద దాగివున్న రహస్యాలను ఛేదించితే మన దేశానికి కలిగే ప్రయోజనం ఏమిటి? ఈ రంగం మీద మనం వెచ్చించే నిధులను విద్యా వనరులు అభివృద్ధికి వెచ్చిస్తే ఉపయోగంగా ఉంటుంది అనుకునేవారు లేకపోలేదు. కాకపోతే ఇప్పుడున్న మతమౌఢ్య వాతావరణంలో పైకి అనకపోవచ్చుగానీ వారి అభిప్రాయంలో మెరిట్ లేకపోలేదు. అన్వేషణ చేయవలసిందే. కానీ అది మనకి ఉపయుక్తంగా ఉండాలి. భూగోళంలోనే మనిషికి అంతు పట్టని అనేక అంశాలున్నాయి. వాటి మీద పరిశోధనలు చేయవచ్చు. ఉదాహరణకి మనం వాతావరణాన్ని గురించి తెలుసుకోవటంలో చాలా వెనకబడి వున్నాము. ఏ ఊరి వాతావరణం ఎలా వుంటుందో తెలుసుకోలేక పోతున్నాము. ఆరుగాలం రైతు కష్టపడి పండించిన ధాన్యాన్ని మార్కెట్ యార్డ్‌కి తీసుకొచ్చి ఆరుబయట వుంచుకుంటాడు ఎండాకాలమే కదా అనుకొని. అకాల వర్షం ముంచుకొచ్చి ధాన్యం తడిసిపోవటం మనం తరచు చూస్తుంటాము. వాతావరణ శాస్త్రం ఎంతో అభివృద్ధి చెందినాగూడా వర్షం వచ్చే విషయాన్ని ముందుగా తెలుసుకోలేకపోతున్నాం. అటువంటి అంశాల మీద మనకి పరిశోధన అవసరం. కానీ దురదృష్టం ఏంటంటే మనం వాటి జోలికి పోము.
కనీసం టాయిలెట్ సౌకర్యం గూడా లేని కుటుంబాలు కోట్లలో వున్న ఈ దేశంలో ప్రజల అవసరాలేమిటి? పాలకుల ఆలోచన ఏమిటి? ఇక్కడ పాయింట్ ఒక్కటే. పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చి ప్రజల దృష్టిని మళ్లించటానికి, ప్రజల్లో ఒక ఫాల్స్ ప్రిస్టేజిని నింపటానికి చేసే ప్రయత్నంగా చూడాలి ఈ ప్రయోగాలను. సైన్యం విజయాన్ని, సైన్స్ విజయాన్ని నాయకులు తమ విజయంగా చెప్పుకోవటం మనకు అలవాటే. 2003లో మనం రెండవసారి అణు విస్ఫోటనం చేశాక, 2004లో భారత్ వెలిగిపోతుందనే ప్రచారంతో ఎన్నికలకు పోయింది నాటి వాజ్‌పేయి ప్రభుత్వం. కానీ అప్పుడు ప్రజలు పదేళ్ళపాటు బిజెపిని చీకట్లోకి నెట్టారు. నేడు కూడా అలా చెయ్యవలసిన అవసరం ఎంతైనా వుంది. మరి ప్రజలు తగినవిధంగా స్పందిస్తారా?
(వ్యాసకర్త లోక్‌సభ సచివాలయంలో మాజీ డైరెక్టర్)
గుమ్మడిదల రంగారావు