
- ఆగస్టు 27న కృష్ణా జిల్లా గుడివాడలో శ్రామిక మహిళల రాష్ట్ర సదస్సు
కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఐసిడిఎస్, ఎన్‌హెచ్‌ఎం, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, మధ్యాహ్న భోజన పథకం, సర్వశిక్ష అభియాన్, ఉపాధి హామీ వంటి పథకాలలో అత్యధిక మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరెవరికీ కనీస వేతనాలు అమలు కావడం లేదు. స్కీమ్ వర్కర్లను సైతం కార్మికులుగా గుర్తించటం లేదు. ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న వారిని వర్కర్లుగా గుర్తించి, కనీస వేతనాలు అమలు చేయాలని 44వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ఐఎల్‌సి) సిఫార్సు చేసింది. అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే గత ఏడెనిమిదేళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ సిఫార్సులను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నది.
మహిళా సాధికారత గురించి ఏలికలు గొప్పలు చెప్పడమే గాని ఆచరణలో అడుగు ముందుకు వేయడం లేదు. పని ప్రదేశా లలో మహిళలకు కనీస వసతులు కల్పించడంలో యాజమాన్యాలు ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదు. ఇలా వుండగా మహిళలతో రాత్రుళ్లు కూడా పని చేయించేందుకు వీలుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చట్టాలలో మార్పు చేస్తోంది. దీంతో శ్రామిక మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది.
కనీస వసతుల లేమి
పని ప్రదేశాలలో మహిళలకు ప్రత్యేక వసతులు కల్పించాలని చట్టాలు సూచిస్తున్నాయి. ఆచరణలో మాత్రం మహిళలకు ఆ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్న దాఖలాలు చాలా పరిమితం. దీని మూలంగా మంచినీళ్లు ఎక్కువ తాగితే టాయిలెట్‌కి వెళ్ళాల్సి వస్తుందని భయపడి రోజుకు 8 నుండి 9 గంటల పని సమయంలో గుక్కెడు నీళ్లు కూడా తాగకుండా విధులు నిర్వహిస్తున్నారు. షాప్ ఎంప్లాయీస్ రోజంతా నిలువు కాళ్ళ మీద నిలబడాలి. బహుళజాతి సంస్థలైన బ్రాండిక్స్ వంటి కంపెనీలలోనే టాయిలెట్‌కి వెళ్లి రావటానికి యాజమాన్యం టైమ్ నిర్దేశించడం కార్మికుల్లో భయాందోళనలను కలిగిస్తున్నది. వీటి మూలంగా అత్యధిక మంది శ్రామిక మహిళలు గర్భసంచి వ్యాధులకు గురవుతున్నారు.
కొరవడిన కనీస వేతనాలు
కేంద్ర ప్రభుత్వ పథకాలైన ఐసిడిఎస్, ఎన్‌హెచ్‌ఎం, ఎన్‌ఆర్‌ఎల్‌ఎం, మధ్యాహ్న భోజన పథకం, సర్వశిక్ష అభియాన్, ఉపాధి హామీ వంటి పథకాలలో అత్యధిక మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరెవరికీ కనీస వేతనాలు అమలు కావడం లేదు. స్కీమ్ వర్కర్లను సైతం కార్మికులుగా గుర్తించటం లేదు. ప్రభుత్వ పథకాలలో పనిచేస్తున్న వారిని వర్కర్లుగా గుర్తించి, కనీస వేతనాలు అమలు చేయాలని 44వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (ఐఎల్‌సి) సిఫార్సు చేసింది. అందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే గత ఏడెనిమిదేళ్లుగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ సిఫార్సులను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ పథకాలలో పని చేస్తున్న వారికి కనీస వేతనాల ఊసే లేదు. ఇక ప్రైవేటు సంస్థల్లో పని చేస్తున్న వారి పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు, షాపులు తదితర సంస్థలలో నెలకు రూ. 5000 నుండి రూ. 12,000 లోపు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారు. పని గంటలు, ప్రమాద బీమా, గ్రాట్యుటీ, ఇ.పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ సౌకర్యాల మాటే లేదు.ఆక్వా , బీడీ, చింత పిక్కలు, జీడిపప్పు తదితర పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి వర్ణనాతీతం. బీడీల తయారీలో ఇంటిల్లపాది పని చేసినా తిండికి గడవని పరిస్థితి. ఇక చింతపిక్కలు, జీడిపప్పు సంస్థల్లోని మహిళా కార్మికులకు వేతనాలు ఎప్పుడు పెరుగుతాయో, ఎంత పెరుగుతాయో, అసలు జీవోలు ఎంత నిర్ణయిస్తున్నాయో కూడా తెలియని స్థితిలో బతుకులీడుస్తున్నారు.
పేరుకుపోతున్న సమస్యలు-పట్టించుకోని ప్రభుత్వం
అంగన్వాడి ఉద్యోగులకు తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ జీతం చెల్లిస్తామని గద్దెనెక్కిన సందర్భంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి నాలుగున్నరేళ్ళు గడుస్తున్నా ఈ హామీని నెరవేర్చలేదు. పైపెచ్చు ఇంటి అద్దెలు, టిఏ, డిఏ లు నాలుగేళ్లుగా చెల్లించిన దాఖలాలు లేవు. రోజుకో యాప్ ప్రారంభించి వర్కర్ల నెత్తి మీద భారం మోపుతున్నారు. మధ్యాహ్న భోజనం కార్మికులకు పని భద్రత లేకుండా అక్షయ పాత్ర, ఇస్కాన్ వంటి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. వీరికి వంట గ్యాస్ బిల్లులు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. ఐకెపి వివోఏ లకు మార్కెట్ల పేరుతో తలకు మించిన భారం పెట్టి బలవంతంగా సరుకులు కొనిపిస్తున్నారు. వేలాది మంది మహిళా చిరుద్యోగులను ఉద్యోగాల నుండి తొలగించారు. ఎమర్జన్సీ పేరుతో ఆశా వర్కర్లకు సెలవులు ఇవ్వకుండా 24 గంటలు చాకిరీ చేయిస్తున్నారు.
'జగనన్నకి చెబుదాం' వంటి పేర్లు పెట్టి ప్రభుత్వమే అధికార పార్టీ ప్రజా ప్రతినిధులను గడపగడపకు తిప్పుతున్నది. ఈ సందర్భంగా ఎవరు ఏ సమస్యలు ఎదుర్కొన్నారో చెప్పమని అడుగుతున్న ప్రభుత్వమే...తమ సమస్యల గురించి చెప్పిన శ్రామిక మహిళలను నిర్దాక్షిణ్యంగా ఉద్యోగాల నుండి ఊడబెరుకుతున్నది. గత మార్చిలో గుంటూరు నగరంలోని మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు విమల ఆ విధంగానే ఉద్యోగం నుండి తొలగించబడింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మీటింగ్‌కు వెళ్లారనే సాకుతో ముగ్గురు మున్సిపల్ పారిశుధ్య మహిళా కార్మికులను నిరంకుశంగా ఉద్యోగాల నుండి తొలగించారు.
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానన్న వాగ్దానం నెరవేరలేదు. సిపిఎస్ రద్దు కోసం పోరాటాలు కొనసాగుతూనే వున్నాయి. ఉద్యోగ కార్మికులలో వస్తున్న అసంతృప్తిని బయట పడకుండా చేయటానికి ప్రభుత్వం నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నది.
భవన నిర్మాణ రంగంలో రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది వరకు పనిచేస్తుండగా అందులో శ్లాబ్ ముఠా, పునాదులు తదితర పనులలో మహిళలే అధికం. గత టిడిపి ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుత వైసిపి ప్రభుత్వం కూడా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను దారి మళ్లించి అడ్డగోలుగా వాడుకోవడం వల్ల కార్మిక సంక్షేమ పథకాలన్నీ కూడా నిలిచిపోయాయి. మరోవైపు ఇసుక దందా మూలంగా కరోనాలో కరోనా తరువాత, కూడా కార్మికులకు చేతి నిండా పని లేకుండా పోయింది. ఇంకోవైపు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎడాపెడా భారాలు మోపుతున్నాయి. పెరిగిన నిత్యావసరాల ధరలకు ఈ భారాలు తోడు కావడంతో భవన నిర్మాణ మహిళా కార్మికులు పస్తులతో బతకాల్సి వస్తున్నది.
రాష్ట్రంలో గత కొన్నేళ్లగా హోటళ్లు, రెస్టారెంట్లు, దాబాలు వంటి వాటిల్లో మహిళా కార్మికులనే నియమిస్తున్నారు. భోజనాలు వడ్డించడం, బల్లలు తుడవడం, కంచాలు కడగడం కూడా వీరే చేయాల్సి ఉంటుంది. రోజంతా నిలువు కాళ్ల మీదే పని చేయాలి. రోజుకు 10 నుండి 11 గంటలు చాకిరీ చేయాలి. ఇంత చేస్తున్నా హోటళ్లలో మిగిలిపోయిన టిఫిన్లు, భోజనాలు కూడా ఈ కార్మికులకు పెట్టరు. పైగా జీతం నెలకు రూ.7000 నుండి రూ.8000 లోపు మాత్రమే ఇస్తారు.
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో, వార్డు సచివాలయాలలో పని చేసే మహిళా కార్మికుల దుస్థితి వర్ణనాతీతం. ఈ కాలంలో అనేక చోట్ల లైంగిక వేధింపులకు, అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు వీరు గురవుతున్నారు. నెల్లూరులో వికలాంగురాలైన వార్డు వాలంటీర్‌ను అధికార పార్టీ నాయకుడు దుర్భాషలాడి దౌర్జన్యానికి పాల్పడిన ఘటన ఇటీవల చోటుచేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో సాలూరు మున్సిపల్ ఉద్యోగినిపై అధికారి లైంగిక వేధింపులకు పాల్పడినప్పుడు...సిఐటియు జోక్యం చేసుకొని ఆ మహిళలకు అండగా నిలబడి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అధికారిపై చర్యలు తీసుకోక తప్పలేదు. ఈ నేపథ్యంలో...పని ప్రాంతాలలో రక్షణ కోసం, కనీస వసతుల కోసం, కనీస వేతనాల కోసం, ఉద్యోగ భద్రత కోసం...శ్రామిక మహిళలు సంఘటిత పోరాటాలకు సిద్ధం కావాల్సి వుంది.
/ వ్యాసకర్త శ్రామిక మహిళా రాష్ట్ర సమన్వయ కమిటీ కన్వీనర్ /
కె. ధనలక్ష్మి