May 31,2023 07:53

            ఎన్నేళ్లు పాలించినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగా నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం తీరుంది. అభివృద్ధి నినాదాలు, ప్రజాకర్షక వాగ్దానాల ప్రచార పటాటోపం మధ్య మతతత్వ అజెండాను దాచిపెట్టి అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తయింది. నెహ్రూ, ఇందిర, మన్మోహన్‌ల తరువాత అత్యధిక కాలం పాలించిన నరేంద్ర మోడీ ఈ కాలంలో అద్భుత విజయాలు సాధించినట్లు కార్పొరేట్‌, సోషల్‌ మీడియా, వాట్సాప్‌ యూనివర్శిటీలు చేస్తున్న అట్టహాసపు ప్రచారం ఎలా ఉన్నా... వాస్తవాలు ఆందోళనకరంగా ఉన్నాయి.
           విదేశాలకు తరలించిన నల్లడబ్బు వెలికితీసి ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని, స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సుల ప్రకారం పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని... ఇలా ఎన్నో వాగ్దానాలు 2014 ఎన్నికల్లో గుప్పించిన మోడీ సర్కారు... ఆచరణలో మొండిచేయి చూపింది. నోట్ల రద్దు నుంచి... పార్లమెంట్‌ నూతన భవన ప్రారంభోత్సవం వరకూ అన్నింటా నియంతృత్వ ధోరణి తాండవించింది. అన్ని రాజ్యాంగ వ్యవస్థలపైనా దాడిచేసింది. కార్పొరేట్‌, మతతత్వ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తోంది. కోవిడ్‌ ముసుగులో 2020లో తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను, వ్యవసాయ రంగంలో కార్పొరేటీకరణ లక్ష్యంగా కేంద్రం తీసుకొచ్చింది. ఢిల్లీలో రైతుల చారిత్రాత్మక పోరు నేపథ్యంలో... ప్రధాని రైతులకు క్షమాపణలు చెప్పి నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడంతో వ్యవసాయరంగాన్ని కబళించాలనుకున్న ప్రైవేటు సంస్థలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉపాధి హామీ చట్టం ఊపిరితీసేందుకు నిధులకోత, అడ్డగోలు నిబంధనలుసహా... అనేక యత్నాలు చేస్తోంది.
           ఈ తొమ్మిదేళ్లలో ప్రజలు ఎన్నటికీ మరిచిపోని కష్టాలు తెచ్చిన వాటిలో నోట్ల రద్దు ఒకటి. నల్లధనం, అవినీతిని అరికడతామని, ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు అరికట్టడం, నకిలీ నోట్లను అంతం చేయడం వంటి లక్ష్యాలతో 2016 నవంబర్‌ 8వ తేదీ రాత్రి ప్రధాని ప్రకటించిన నోట్ల రద్దు ఓ పెద్ద ప్రహసనం. చెలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని ఉపసంహరించుకోవడంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. దేశంలోని సమాఖ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసి, రాష్ట్రాలను ఆర్థికంగా కుంగదీసే లక్ష్యంతో జిఎస్‌టిని తీసుకొచ్చారన్న విమర్శలు నిజమని కేంద్రం గత తొమ్మిదేళ్లలో వ్యవహరించిన తీరు రుజువు చేస్తోంది. బిజెపియేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలకు నిధులు విడుదలలో మొండిచేయి చూపుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ అస్థిర పరుస్తోంది. గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్ల ద్వారా ఆటంకాలు కలిగిస్తోంది. ఎనిమిది బిజెపియేతర ప్రభుత్వాలను కుప్పకూల్చడం మోడీ మార్కు నిరంకుశత్వానికి పరాకాష్ట. జమ్ముకాశ్మీర్‌కు ప్రత్యేక హోదా తొలగింపు, పౌరసత్వ సవరణ చట్టం, కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించిన విధానం, రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కుతూ ఢిల్లీ ప్రభుత్వంపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పెత్తనం చేసేలా ఆర్డినెన్స్‌ జారీ చేయడం మోడీ ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనాలు.
          అమూల్‌ బ్రాండ్‌ పేరుతో పాల ఉత్పతుల్లో దేశవ్యాప్తంగా జోక్యం చేసుకుని స్థానిక డెయిరీల గొంతు నులిమేస్తోంది. సహకార మంత్రిత్వశాఖను కేంద్రంలో ఏర్పాటు చేసి హోం మంత్రి అమిత్‌షా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రాల వనరులను దోచుకోవడమే కార్యక్రమంగా పెట్టుకుంది. అదే సమయంలో కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు, వారికి కొమ్ముకాసేందుకు నిర్లజ్జగా ప్రయత్నిస్తోంది. అదానీ కుంభకోణాలకు సంబంధించి హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో పార్లమెంట్‌ జరగకుండా అడ్డుకోవడం మోడీ మార్కు తిరోగమన చర్య! 2014లో 7.1 బిలియన్ల డాలర్ల పెట్టుబడులతో ప్రపంచంలో 609వ స్థానంలో ఉన్న అదానీ సంస్థ 2022 నాటికి 200 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులతో రెండో అత్యంత సంపన్న పెట్టుబడిదారుగా ఎదిగింది. రష్యా నుంచి కారుచౌకగా లభిస్తున్న పెట్రో ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసి అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ భారీగా లాభపడగా, గ్యాస్‌, పెట్రో ధరలపై సర్‌ ఛార్జీలతో సామాన్యుడు బతుకు ఛిద్రమవుతోంది. కేంద్రం బాధ్యతలేని తనానికి ఇదొక నిదర్శనం! బిబిసి డాక్యుమెంటరీపై నిషేధం, రాహుల్‌గాంధీపై అనర్హత వేటు, తాజాగా రెజ్లర్లపై అమానుష దాడి... ఇలా మోడీ సర్కారు నిరంకుశత్వాన్ని చాటే ఉదాహరణలెన్నో! ఈ విధంగా మోడీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలన కార్పొరేట్లకు వరంగాను, సామాన్యులకు శాపంగాను పరిణమించింది. ఈ కార్పొరేట్‌, హిందుత్వ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా సాగనంపితే దేశానికి అంత మంచిది. 2024 సార్వత్రిక ఎన్నికలు ఇందుకు ఒక చక్కని అవకాశం.