Feb 03,2023 07:15

మానవ వాదానికి బీజాలు విజ్ఞాన శాస్త్రంలోనే ఉన్నాయి. ఏ మతం లోనూ లేవు. అందుకే జ్ఞానాన్ని మత రహిత స్థాయికి తెచ్చుకోవాలి. ప్రాపంచిక దృక్పథంతో, విశాల భావాలతో మానవ జాతి అంతా ఒకటేనని జన్యుశాస్త్రం అందించిన ''జ్ఞానాన్ని'' స్వీకరిస్తే ప్రతి ఒక్కరూ మానవవాదులే అవుతారు.

మతం చుట్టూ తిరిగేదే 'జ్ఞానం' అనే ఆలోచన సమాజంలో బాగా నాటుకుపోయింది. ఏ దేశమైనా, ఏ మతమైనా ఇదే భావనని జనంలో స్థిరపరిచాయి. కానీ, కాలం గడుస్తున్న కొద్దీ జ్ఞానానికీ మతానికీ దూరం పెరుగుతూ వచ్చింది. జ్ఞానం - ఏ మతం చుట్టూ ప్రదక్షిణలు చేయదని సర్వ స్వతంత్రంగా ఎదుగుతుందని, తనను నమ్ముకున్న జనం ఎదుగుదలకు తప్పక తోడ్పడుతుందని తేలింది. మనిషి, మనిషిగా మారడానికి - మారి, నిలబడడానికీ, నిలబడి ఎదగడానికీ జ్ఞానం... అంటే విజ్ఞానం - నిరంతరం కృషి చేస్తూనే ఉంటుంది. అతణ్ణి ఈర్ష్య ద్వేషాల నుంచి, అసూయ ప్రతీకారాల నుంచి, మూఢనమ్మకాల నుంచి బయట పడేసి, నైతిక జీవిగా కొనసాగడానికి దోహదం చేస్తుంది.
         మానవ వాదానికి బీజాలు విజ్ఞాన శాస్త్రంలోనే ఉన్నాయి. ఏ మతం లోనూ లేవు. అందుకే జ్ఞానాన్ని మత రహిత స్థాయికి తెచ్చుకోవాలి. ప్రాపంచిక దృక్పథంతో, విశాల భావాలతో మానవ జాతి అంతా ఒకటేనని జన్యుశాస్త్రం అందించిన ''జ్ఞానాన్ని'' స్వీకరిస్తే ప్రతి ఒక్కరూ మానవవాదులే అవుతారు. విజ్ఞాన శాస్త్రాన్ని తన సృజనాత్మకతతో సాంకేతిక శాస్త్రంగా తీర్చిదిద్దుకోగల సామర్థ్యం కేవలం మనిషికే ఉంది. ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచిని పెంపొందించడానికి మాత్రమే ఉపయోగించుకోవాలి. మనిషిలోని స్వార్థం వెర్రితలలు వేస్తే సాంకేతిక పరిజ్ఞానం మానవ వినాశనానికి దారితీస్తుంది. ఆ విషయం కూడా గుర్తుంచుకోవడం మంచిది. 'విజ్ఞానాన్ని, మత రహిత స్థాయికి ఎందుకు తీసుకుపోవాలి? మతం ఉంటే నష్టమేమిటి?' అని ఎవరైనా ప్రశ్నిస్తే అందుకు మనం ఈ విధంగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అబద్ధాలతో నిజాలు జత కట్టవు. వాస్తవాలు ఊహల్లో తేలిపోవు. ఊహాల్లో తేలిపోతే తేలిపోవచ్చు... కానీ, అవి అప్పుడు వాస్తవాలుగా మిగలవు.
     మత గ్రంథాలలో ఉన్న స్వర్గ నరకాలకు అడ్రస్‌లు లేవు. శతాబ్దాలుగా భక్తులెవరూ తమ దేవీ దేవతల మొబైల్‌ నెంబర్లు సంపాదించలేకపోయారు. గ్రహాలన్నీ దేవతలకు నివాసాలని అంటారు కదా? మరి, రాకెట్లలో గ్రహాంతరయానం చేసే మన 'మానవ మాత్రులకు' వారు ఎక్కడా కనపడరెందుకూ? అయినా, గతంలో విశ్వసించినట్టు గ్రహాలు దేవతల నిలయాలని ఇప్పుడు ఎవరూ విశ్వసించడం లేదు. ఇక్కడ భూమి మీద సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్లనే కొద్దిమంది పరిపాలకులు కోట్ల మంది జనాన్ని అదుపులో పెట్టగలుగుతున్నారు. మరి ఈ సాంకేతిక పరిజ్ఞానం దేవీ దేవతల మీద పని చేయడం లేదు. ఎందుకంటారా? వారు నిజంగా ఉంటే పని చేసేది. లేని వాళ్ళ మీద ఎలా పనిచేస్తుంది చెప్పండి ?
       అయితే, అందుకు కారణం కూడా ఉంది. భ్రమ భ్రమలతో కలుస్తుంది. వాస్తవాలు వాస్తవాలతో మాత్రమే అతుకుతాయి. నిన్న రాత్రి నిద్రలో కన్న కలలు ఇవ్వాళ రాత్రి కూడా కను - ప్రమాదం లేదు. కానీ, పొద్దున వాస్తవంలో మోటారు సైకిల్‌పై వెళుతూ రాత్రి కన్న కలలు కంటానంటే యాక్సిడెంట్‌ అవుతుంది. ఒక వాస్తవాన్ని భ్రమలతో కలుపుతానంటే ఇలాగే ప్రమాదాలు జరుగుతాయి. వాస్తవాల ఆధారంగా బతికే వాడికే, తనకు జ్ఞానం ఉందన్న స్పృహ ఉన్నవాడికే విజ్ఞానం అందుబాటులోకి వస్తుంది. మతాల మాయలో పడితే తెలివి తేటలు కాదు గదా మూర్ఖత్వం అబ్బుతుంది! అప్పుడు అందుకు తగిన వేషం ఒకటి వేసుకుని ఎంచక్కా వ్యాపారం చేసుకోవచ్చు. సిగ్గూ ఎగ్గూ, నైతికత అన్ని వదిలేసినవాడు ఇక ఏం చేస్తాడూ? తోటి మనుషుల్ని మోసం చేస్తాడు. అన్ని మతాల గురువులు, ప్రభోదకులు, ముల్లాలు, పాస్టర్‌లు, పురోహితులు, ప్రవచనకారులు చేస్తున్న పని ఇదే!
      పాకే జంతువు నుండి పక్షి రావడం, వానరం నుంచి మనిషి రావడం అనేది వీరు తెలుసుకోరు. తెలుసుకున్నా అర్థం చేసుకోరు. ఆత్మ, జన్మ, పునర్జన్మల గూర్చిన పరిజ్ఞానమే 'జ్ఞానం' అని అనుకుంటూ ఉంటారు. ఆధునిక జన్యుశాస్త్రం చెప్పే వంశ పారంపర్య లక్షణాలు వీరికి విచిత్రంగా తోస్తాయి.
    వంద, రెండు వందల సంవత్సరాల చరిత్ర చూసుకుని మాది గొప్ప వంశం, మా కులం గొప్పది, మా మతం గొప్పది అని విర్రవీగడం హాస్యాస్పదమైన విషయం. ఇంకా వెనక్కి వెళ్ళి చూసుకుంటే వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఎక్కడ ఉండేవారో, ఎలా ఉండేవారో, ఎటు నుండి ఎటు వలస వెళ్ళారో, వారి మత విశ్వాసాలేవో, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారో ఎవరికి తెలుసు? అందువల్ల ఏదో రెండు, మూడు తరాల వంశ చరిత్ర చూసుకుని విర్రవీగడం మూర్ఖత్వం అవుతుంది. ఇంకా కొంచెం వెనక్కి వెళితే, అందరమూ ఆ మహా మిశ్రమ మానవ జాతి నుంచి వచ్చిన వాళ్ళమేనని తెలుసుకుంటాం! మానవ వాదులుగా మారడానికి తెలుసుకోవాల్సిన మొదటి అంశం-జ్ఞాన గుళిక ఇదే !
         మార్పు అంతర్గతంగా వారిలోంచే రావాలి. వారు తమ వివేకాన్ని కొద్ది కొద్దిగా ఉపయోగిస్తూ ఉంటే, తప్పకుండా మార్పు వస్తుంది. దేనివల్ల ఈ సమాజం ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలోకి వచ్చిందో ముందు గ్రహించుకోవాలి. దేవుడు, దయ్యం, ఆత్మ, పరమాత్మ, ఆధ్యాత్మికత, ధ్యానాల వల్ల రాలేదు. కేవలం వైజ్ఞానిక స్పృహ తోనే, వైజ్ఞానిక పరిశోధనల తోనే వచ్చింది. ఇవే మనల్ని ఇంకా ముందుకు తీసుకుపోతాయి. మనిషి తను కష్టపడే తత్వాన్ని, నిజాయితీని, నైతికతను వదిలేస్తే ఎదురయ్యే ప్రమాదాలు చాలా ఉన్నాయి. వదిలేయకుండా ఉండగలగడమే జ్ఞానం!
         పొరపాటున జనం పెత్తందారీ వ్యవస్థకు లొంగిపోతే గనక, తీరని నష్టాన్ని ఎదుర్కొనాల్సి వస్తుంది. ఇక్కడ మరొక పెద్ద ప్రమాదం పొంచి వుంది. పెత్తందారీ సంస్కృతి గనక సాంకేతిక శాస్త్రాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటే, అది మానవ స్వేచ్ఛనే హరిస్తుంది. అంతే కాదు, మానవ జాతిని తుదముట్టించే ప్రమాదం కూడా ఉంది. పరిస్థితులు అంతగా విషమిస్తే వాటిని అదుపులోకి తేవడానికి అసలు మనిషే ఉండడు కదా? విజ్ఞాన శాస్త్రం రెండంచుల కత్తి లాంటిది. ఎటు వాడుతున్నాం? ఎంత వాడుతున్నాం? ఎలా వాడుతున్నాం? వంటివి తెలియాలి. విజ్ఞాన శాస్త్రాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోవడమే జ్ఞానం. దీని మీద మత ఆధిపత్యం ఉండకూడదు. ఎందుకంటే, గతంలో ముక్కు మూసుకుని చేసిన తపస్సుల వల్ల ఎవరూ ఏమీ సాధించలేదు. ఇక ముందు కూడా సాధించలేరు. సాధించారని చెప్పుకునే మహిమలు కేవలం అసత్యాలు మాత్రమే! ఆ పద్ధతులు మానేసి మనిషి తనలోని స్వార్థాన్ని, కుత్సిత బుద్ధిని తగ్గించుకుంటే సత్వరం ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. చిత్తశుద్ధిగల యువతీ యువకులు హేతువాదులైతే, నిరీశ్వర వాదులైతే, సైన్సు కార్యకర్తలయితే...వారు రాజకీయంగా ఎదిగి అధికారం చేపట్ట గలిగితే ఈ ప్రపంచం రూపురేఖలు మారతాయి. మానవత్వం వెల్లి విరిస్తుంది. మతాల పరిధిలో 'జ్ఞానాన్ని' గిరికీలు కొట్టిస్తున్న కుట్రను బద్దలు కొట్టి పైకి ఎదిగితేనే... ఎవరికైనా ''జ్ఞానం - అంటే ఏమిటీ?'' అనే జ్ఞానోదయం అవుతుంది.

/ వ్యాసకర్త: కేంద్ర సాహిత్య అకాడమీ
అవార్డు గ్రహీత, జీవశాస్త్రవేత్త/
డా|| దేవరాజు మహారాజు

డా|| దేవరాజు మహారాజు