ప్రజాశక్తి - పెద్దాపురం(కాకినాడ) : పెద్దాపురం నియోజకవర్గ అభివృద్ధికి,ప్రజా సమస్యల పరిష్కారానికి ఇంతవరకు వైసిపి నాయకులు కృషి చేయలేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కరణం ప్రసాదరావు అన్నారు.బుధవారం స్థానిక యాసలపు సూర్యారావు భవనంలో డి క్రాంతి కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.నియోజకవర్గ పరిధిలో ప్రధాన సమస్యలను పట్టించుకోకుండా వైసీపీ నాయకులు పక్కదారి పట్టించారన్నారు.వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.సిపిఎం మండల కార్యదర్శి నీలపాల సూరిబాబు మాట్లాడుతూ పెద్దాపురం మండల పరిధిలోని రూరల్ ప్రాంతంలో ప్రధానమైన దివిలి,చంద్రమాంపల్లి,తాటిపర్తి,పులిమేరు,తిరుపతి గ్రామాల్లో ప్రజలకు పట్టాలు ఇచ్చారు తప్ప స్థలాలు చూపించలేదన్నారు.హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఇలాకాలోనే ఇలా ఉంటే మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితిని అర్థం చేసుకోవచ్చన్నారు.సామర్లకోట ప్రజలకు వేట్లపాలెంలో పట్టాలు ఇచ్చారన్నారు.పెద్దాపురం, సామర్లకోట ప్రాంతాల్లో ఆసుపత్రి భవనాలు ఉన్నా వాటిలో కనీస సౌకర్యాలు లేవన్నారు.100 పడకల ఆసుపత్రి ఊసే వినిపించడం లేదన్నారు.పెద్దాపురం పట్టణవాసులకు పూర్తిస్థాయిలో గోదావరి మంచినీటిని అందించడం లేదన్నారు.ఈ సమస్యలన్నీ ఈ ప్రాంతంలో పర్యటనకు వచ్చే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నివేదిస్తామన్నారు.ఈ సమావేశంలో కేదారి నాగు,సిరపరపు శ్రీనివాస్,క్రాంతి,శ్రీను తదితరులు పాల్గొన్నారు.










