
కేంద్రంలో బిజెపి ని ఓడించడమే అంతిమ లక్ష్యంగా వుండాలి. అందుకు...రాష్ట్ర ప్రాతిపదికన వీలైనంత వరకు బిజెపి వ్యతిరేక ఓట్లను ఏకం చేయడంపై దృష్టి పెట్టాలి. బీహార్, తమిళనాడులో మాదిరిగా బిజెపి వ్యతిరేక ఓట్లను పోగు చేసేందుకు కృషి చేయాలి. క్లుప్తంగా చెప్పాలంటే, స్పష్టమైన ప్రత్యామ్నాయ విధానంతో జాతీయ సమస్యలపై ఏకాభిప్రాయాన్ని పెంపొందించుకుంటూ గరిష్టంగా బిజెపి వ్యతిరేక ఓట్లను సంపాదించడం, రాష్ట్రాలలో బిజెపికి వ్యతిరేకంగా సాధ్యమైనంత ఎక్కువ సంఘటిత ఆందోళన, పోరాటాన్ని నిర్మించడం ప్రతిపక్ష వ్యూహంగా వుండాలి. అందుకు తోడ్పడే చర్చలు, నిర్ణయాలు పాట్నా సమావేశం నుండి వస్తాయని ఆశించవచ్చు.
జూన్ 23న బీహార్ రాజధాని పాట్నాలో విపక్షాల సమావేశం జరగనుంది. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల నాటికి భిన్నంగా ఇప్పుడు విపక్షాలలో సామరస్యం, ఐక్యత కనిపిస్తోంది. మోడీ ప్రభుత్వ తొమ్మిదేళ్ల పాలన, దాని ప్రజా వ్యతిరేక విధానాలే ప్రతిపక్షాలలో ఇంతటి సామరస్యాన్ని సృష్టించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల దైనందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా, తాత్కాలిక రాజకీయ లబ్ధి కోసం మోడీ ప్రభుత్వం మతం పేరున ప్రజల మధ్య చిచ్చుపెట్టి వారిలో అభద్రతాభావం, గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్రలలో మతపరమైన అల్లర్లు పునరావృతం అవుతుండగా మణిపూర్‌లో రెండు నెలలగా కొనసాగుతున్న మతపరమైన హింస దీనినే రుజువు చేస్తున్నాయి.
జమ్మూకాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన విధించి ఐదేళ్లు పూర్తయింది. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని అరికట్టామని చెబుతున్నా అక్కడ ఎన్నికలు జరిగే సూచనలు కనిపించడం లేదు. బిజెపి పాలన ఇలాగే కొనసాగిన పక్షంలో దేశం ముక్కచెక్కలు అవుతుందన్న భయం బలంగా ఉంది. ఈ స్థితిలోనే ప్రతిపక్ష పార్టీల సమావేశం పాట్నాలో జరుగుతున్నది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ సమావేశానికి ఆతిథ్యం ఇస్తున్నారు. సిపిఎం, సిపిఐ ప్రధాన కార్యదర్శులు, కాంగ్రెస్ అధ్యక్షుడు, నలుగురు ముఖ్యమంత్రులు, శరద్ పవార్ వంటి విపక్షాల సీనియర్ నేతలందరూ ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
బిజెపి కి వ్యతిరేకంగా బలమైన లౌకిక ప్రజాస్వామ్య కూటమి ఉన్న రాష్ట్రం బీహార్. ఆర్‌జెడి నేతృత్వంలోని మహాకూటమి ఇక్కడ అధికారంలో ఉంది. లాలూ ప్రసాద్ ఆర్‌జెడి, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడి(యు) చేతులు కలపడంతో రాష్ట్రంలో బిజెపి అధికారాన్ని కోల్పోయింది. ఈ కూటమితో సిపిఎం, సిపిఐ అవగాహన కుదుర్చుకున్నాయి. బీహార్‌పై ఎప్పుడూ సామ్యవాద, వామపక్ష రాజకీయాల ప్రభావం వుండనే వుంటుంది. 1990 అక్టోబర్‌లో అద్వానీ రథ యాత్రను బీహార్ లోని సమస్తిపూర్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ అడ్డుకున్నారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జయప్రకాష్ నారాయణ్ చేపట్టిన ఉద్యమానికి బీహారే వేదికైంది. అందువల్ల మోడీ నేతృత్వంలోని హిందుత్వ శక్తులను ఎదుర్కొనేందుకుగాను ప్రతిపక్షాలు రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభించడానికి పాట్నా సరైన వేదిక అనడంలో ఎలాంటి సందేహం లేదు.
భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్షాలు తమ రాజకీయ ఎత్తుగడలకు పాట్నాలో శ్రీకారం చుట్టనున్నాయి. విపక్షాల ఐక్యతకు సంబంధించి మూడు ప్రధాన అవగాహనలు ఉన్నాయి. అన్ని విపక్షాలను ఒకే వేదిక పైకి చేర్చి జాతీయ ప్రతిపక్ష కూటమిగా ఎదగవచ్చన్నది చాలా తేలికైన ఆలోచన. మరో ఆలోచన ఏదైనా ఒక రాజకీయ పార్టీ అధినేత నేతృత్వంలో ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయడం. మూడో ఆలోచన జాతీయమైనా, ప్రాంతీయమైనా ప్రతి రాష్ట్రంలో ప్రధానమైన బిజెపి వ్యతిరేక పార్టీ నాయకత్వంలో ఐక్యత.
ఇవన్నీ భారతీయ వాస్తవికతకు దూరంగా ఉన్న భావనలని చెప్పవచ్చు. విపక్షాలన్నింటినీ కలుపుకొని జాతీయ స్థాయిలో కూటమి లేదా ఫ్రంట్ ఏర్పాటు చేయడం కష్టం. అటువంటి కూటమి లేదా ఫ్రంట్ ఏర్పాటు ద్వారానే జాతీయ స్థాయిలో బిజెపిని ఓడించగలమన్న భావనకు భారత రాజకీయ వాస్తవికతకు లంకె కుదరదు. ఎన్నికల తర్వాత నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఏర్పడి ప్రధానమంత్రి అభ్యర్థిని ఎంపిక చేసుకున్నారు. కనీస ఉమ్మడి కార్యక్రమం కూడా ఎన్నికల తర్వాత రూపొందించబడుతుంది. కాబట్టి ఎన్నికలకు ముందే నాయకుడిని, ఫ్రంట్‌ను ఎంచుకోవాలనే వాదన భారత రాజకీయ వాస్తవికతకు సరిపోదు.
జాతీయ ప్రాముఖ్యత కలిగిన రాజకీయ అంశాలపై ప్రతిపక్షాల ఐక్యత ముఖ్యం. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, పార్లమెంటరీ వ్యవస్థ, ఫెడరలిజంపై మోడీ ప్రభుత్వం, దానికి నాయకత్వం వహిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్-బిజెపి దాడి చేస్తున్నాయి. ఇటువంటి కీలకమైన అంశాలపై ప్రతిపక్షం ఐక్యంగా నడుస్తుందా అన్నది ప్రశ్న. అదానీ వ్యవహారంపై జెపిసి విచారణ జరిపించాలని 18 రాజకీయ పార్టీలు రాసిన లేఖ అది సాధ్యమేనని రుజువు చేసింది. దీంతో పాటు ఇ.డి, సిబిఐ తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను వేధించడానికి వ్యతిరేకంగా మెజారిటీ ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినప్పుడూ ప్రతిపక్షాలు ఐక్యంగా నిరసన తెలిపాయి. ఆ తర్వాత తమిళనాడు మంత్రి వి.సెంథిల్ బాలాజీని ఇ.డి అరెస్టు చేసింది. ఢిల్లీ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులకు జైలుశిక్ష పడింది.
అయితే, మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న భారీ రేషన్ కుంభకోణాలపై దర్యాప్తు చేయడానికి ఏ కేంద్ర ఏజెన్సీ కూడా సిద్ధంగా లేదు. అదానీ విషయంలోనూ అలాగే ఉంది. నియామకాలు, బదిలీల విషయంలో ఢిల్లీ లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికే తుది అధికారం ఉంటుందన్న సుప్రీంకోర్టు తీర్పును అతిక్రమిస్తూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఢిల్లీ పోలీసులు చట్టపరమైన తమ విధులను విస్మరించి మహిళా రెజ్లర్లను వేధించిన బిజెపి ఎం.పి, భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వత్తాసు పలుకుతున్నారు. సత్యపాల్ మాలిక్ వెల్లడించిన సంచలనాత్మక విషయాలపైగాని అదానీ కుంభకోణంపైగానీ మణిపూర్‌లో మత మారణహోమంపైగానీ ప్రధాని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇటువంటి రాజకీయ సమస్యలకు ప్రత్యామ్నాయాన్ని చూపడంతో పాటు...ప్రజాస్వామ్యం, లౌకికవాదం, ఫెడరలిజాన్ని పరిరక్షించేందుకు ప్రతిపక్షాలు ముందుకు రావాలి. మరో మాటలో చెప్పాలంటే, ప్రజా సమస్యలపై ఉమ్మడి ప్రచారం, ఆందోళనలను ముమ్మరం చేయాలి.
కొన్ని రాష్ట్రాల్లో సంఘటిత ప్రచారానికి, పోరాటానికి అడ్డంకులు ఎదురుకావచ్చు. అలాంటిచోట సంబంధిత పార్టీలు ఈ ప్రచారాన్ని చేపట్టి తమదైన రీతిలో పోరాటం చేయడం మంచిది. అయితే కేంద్రంలో బిజెపి ని ఓడించడమే అంతిమ లక్ష్యంగా వుండాలి. అందుకు...రాష్ట్ర ప్రాతిపదికన వీలైనంత వరకు బిజెపి వ్యతిరేక ఓట్లను ఏకం చేయడంపై దృష్టి పెట్టాలి. బీహార్, తమిళనాడులో మాదిరిగా బిజెపి వ్యతిరేక ఓట్లను పోగు చేసేందుకు కృషి చేయాలి. క్లుప్తంగా చెప్పాలంటే, స్పష్టమైన ప్రత్యామ్నాయ విధానంతో జాతీయ సమస్యలపై ఏకాభిప్రాయాన్ని పెంపొందించుకుంటూ గరిష్టంగా బిజెపి వ్యతిరేక ఓట్లను సంపాదించడం, రాష్ట్రాలలో బిజెపికి వ్యతిరేకంగా సాధ్యమైనంత ఎక్కువ సంఘటిత ఆందోళన, పోరాటాన్ని నిర్మించడం ప్రతిపక్ష వ్యూహంగా వుండాలి. అందుకు తోడ్పడే చర్చలు, నిర్ణయాలు పాట్నా సమావేశం నుండి వస్తాయని ఆశించవచ్చు.
/వ్యాసకర్త సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు /
ఎం.వి. గోవిందన్