Jun 27,2023 06:43

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఎన్నికల నాడు ఉద్యోగులకు సంబంధించి అనేక హామీలు ఇచ్చారు. నిజంగానే ఉద్యోగులు నమ్మి ఆయన రాజకీయ ప్రయోజనం నెరవేర్చారు. కానీ వారికి మాత్రం పిసరంత ప్రయోజనం కలగలేదు.
 

                                                                                సిపిఎస్‌ రద్దు

ఈ కాలపు ఉద్యోగుల ప్రధాన సమస్య సిపిఎస్‌ రద్దు కావటం. ఇతరేతర సమస్యలకంటే ఈ సమస్య పరిష్కారమే జీవన్మరణ సమస్యగా ఉద్యోగులు, సంఘాలు పోరాడుతూ వచ్చాయి. అసలు సమస్యకే ప్రభుత్వం ఎసరు పెట్టింది. నాలుగేళ్ళకు పైగా ఎదురు చూసిన సిపిఎస్‌ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. జిపిఎస్‌ పేరుతో మోసమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నో సంఘాలు, ఎన్నెన్నో పోరాటాలు చేసినా నిండా ముంచిందనే అసంతృప్తితో ఉన్నారు. పాత పెన్షన్‌కు మరేదీ ప్రత్యామ్నాయం కాదని పాత పెన్షన్‌ హామీనే అడుగుతున్నారు. దేశంలో అందరికంటే ముందే హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ''వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు'' హామీ నుండి వెనక్కిపోవడం తగని పని. హామీ ఇచ్చిన నాడు ఓ మాట, అమలుకొచ్చేసరికి భవిష్యత్‌ తరాలకు భద్రత అని, ప్రభుత్వానికి భారమని, ద్రవ్యోల్బణం అరికట్టడానికని, రాబోయే 20 సంవత్సరాల లెక్కలు ముందే చెప్పి కథలు అల్లుతున్నారు.
     ప్రభుత్వం జిపిఎస్‌ తుది పరిష్కారం అని చెబుతున్నా, ఉద్యోగుల ప్రధానంగా ఉపాధ్యాయ, సిపిఎస్‌ సంఘాలు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. సచివాలయ, ఏపిఎన్‌జిఓ నేతలు ఇప్పటికే ఆమోదం, అభినందనలు చెప్పేశారు. మిగిలిన కొందరు ఇప్పటికిదే పరిష్కారం అంటున్నారు. అనేక రాష్ట్రాలు సిపిఎస్‌ నుండి వెనక్కి వస్తూంటే జగన్‌ మోహన్‌ రెడ్డి జిపిఎస్‌ ఉద్యోగులకు పెద్ద లాభమంటున్నారు. మళ్ళీ ఎన్నికల నాటికైనా సిపిఎస్‌ సమస్య పరిష్కారం అవుతుందేమో అని ఆశించిన వారికి ఆశాభంగమే మిగిలింది. ప్రభుత్వం ప్రకటించిన జిపిఎస్‌ మీద పూర్తి స్పష్టత లేదు. అనేక అనుమానాలున్నాయి.
        జిపిఎస్‌ విధానం ప్రభుత్వానికే లాభకరంగా ఉంది. సిపిఎస్‌లో ప్రభుత్వం చెల్లించాల్సిన 10 శాతం ఎన్‌ఎస్‌డిఎల్‌కు చెల్లించలేదు సరికదా ప్రభుత్వం ఈ నిధులను తన అవసరాలకు వాడుకొంది. జిపిఎస్‌లో ప్రభుత్వం 10 శాతం కడుతుందో లేదో స్పష్టత లేదు. ఇతర హామీలు చూస్తే పిఆర్‌సికి సంబంధించి ఐఆర్‌, ఫిట్‌మెంట్‌, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు, పిఆర్‌సి ఆర్థిక లాభం, 12వ పిఆర్‌సి అమలు చేయాల్సిన సందర్భంలో 11వ పిఆర్‌సి అమలు పూర్తికాకపోవడం, వీటిపై ఆర్థిక లాభం ఎప్పుడెప్పుడో చెల్లిస్తామని తేదీలు నిర్ధారించడం గతంలో ఎన్నడూ లేదు. నాలుగేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన డిఏలకూ ఇదే పరిస్థితి.
 

                                                                     కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌

ఉద్యోగులకు సంబంధించి మరో ముఖ్యమైన హామీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులరైజేషన్‌ చేస్తామని. వారందరిని ప్రభుత్వంలోకి లాగేస్తామని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల వేతనాలు పెంచుతామని, కనీస వేతనం అమలు చేస్తామని ఇవన్నీ ముఖ్యమంత్రి గారి హామీలే. మ్యానిఫెస్టోలో మాటలే. కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ కోసం ఉద్యోగ సంఘాలు సుదీర్ఘ కాలం పోరాడుతూ వచ్చాయి. నాలుగేళ్ళ తర్వాతనైనా వివిధ శాఖలలో 10,117 మందిని రెగ్యులరైజ్‌ చేస్తామని క్యాబినెట్‌ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకైనా రెగ్యులరైజ్‌ చేయడం అభినందనీయమే. న్యాయం ఆలస్యంగా జరిగింది. ప్రభుత్వం ఈ నాలుగేళ్ళలో తనపై ఆర్థిక భారం పడకుండా, ఉద్యోగులకు లాభం అందకుండా జాగ్రత్త పడింది. ఈ విషయంలో కూడా ప్రభుత్వం సహజ న్యాయం, సమాన న్యాయం చేయలేదు. జూన్‌ 2014 తేదీకి ముందు ఐదేళ్ళు అనే ట్విస్ట్‌, నియామక పద్ధతిపై మెలికలు, సుమారు 25 ఏళ్ళ నుండి పని చేస్తున్న పార్ట్‌ టైమ్‌, కంటింజెంట్‌ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌ ప్రస్తావన లేకపోవడం, తక్కువ మందికి న్యాయం, వీరిలో ఎక్కువమందికి ప్రభుత్వం అన్యాయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో ఇంకా 30 వేల మంది, ప్రభుత్వ రంగ, ప్రభుత్వ స్కీమ్‌లలో పని చేస్తున్న 30 వేల మంది మా రెగ్యులరైజేషన్‌ ఎప్పుడని అడుగుతున్నారు.
           కావున ఇచ్చిన హామీ మేరకు అన్ని శాఖలలో దశాబ్దాలుగా కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారందరినీ ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయాలి. ప్రభుత్వ నిర్ణయం అందరికీ సమానంగా వర్తింపజేయకపోవడం అన్యాయం. కాంట్రాక్ట్‌ ఉద్యోగులలో చాలామందికి మినిమమ్‌ టైమ్‌ స్కేలు నాలుగేళ్ళుగా అమలు కాలేదు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతన పెంపుదల జరగలేదు. అంగన్‌వాడీ ఉద్యోగులకు తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తానన్న హామీ వారితో సమానంగా కూడా జీతాలు చెల్లించడం లేదు. అంగన్‌వాడీ, ఆశాలకు మళ్ళీ జీతాల పెంపు...సమస్యలు పరిష్కరించబడలేదు.
       విద్యారంగానికి సంబంధించి ఈ ప్రభుత్వం ఒక్క డిఎస్‌సి కూడా ప్రకటించలేదు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఖాళీల భర్తీ చేయలేదు. ఉపాధ్యాయులకు నెలవారీ ప్రమోషన్లకు తిలోదకాలిచ్చి, ఒక్కసారి మాత్రమే ప్రమోషన్లు ఇచ్చింది. ఉపాధ్యాయులకు ప్రమోషన్‌ స్కేల్‌ ఇవ్వకుండా రూ.2500 అలవెన్స్‌ అనే కొత్త పద్ధతి ప్రవేశపెట్టింది. ప్లస్‌ టూ అమలుకు సంబంధించి కూడా రెగ్యులర్‌ స్కేల్‌ వర్తింపజేయడం లేదు. ఉన్న ఉపాధ్యాయుల్నే సర్దుబాటు చేస్తున్నది.
          మాట తప్పం. మడప తిప్పం. విశ్వసనీయత గల ప్రభుత్వం అని పదేపదే చెప్పే ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఈ నాలుగేళ్ళలో చెప్పినదంతా రివర్సే. మాకు సంబంధించి మేనిఫెస్టో ఏం అమలు జరిగిందని అడుగుతున్నారు. వీరి సమస్యల పట్ల అసమ్మతి బయటకు రాకుండా అడుగేస్తే అక్రమ అరెస్టులతో నిరసన హక్కుపై ప్రభుత్వం నిర్బంధం ప్రయోగిస్తుంది. ఉద్యోగులకు ఈ ప్రభుత్వ కాలంలో అందాల్సిన ఆర్థిక ప్రయోజనం చాలా తెలివిగా రాబోయే కాలానికి, రాబోయే ప్రభుత్వాలపై నెట్టివేసే విధానం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తన పదవీ కాలానికి పూచీ పడాల్సిన చెల్లింపులు భవిష్యత్తులో చెల్లిస్తారని చెప్పే హక్కు, నైతికత ఈ ప్రభుత్వానికి ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు. చెల్లింపులకు గ్యారెంటీ ఏమిటని ఆందోళన చెందుతున్నారు.
         పోట్లాడాల్సిన స్థానంలో ఉండాల్సిన సంఘాలు, మాట్లాడాల్సిన స్థానంలో ఉన్న నాయకులు నలుగురు నాలుగు దారుల్లో ఉండడం, నాలుగు రకాలుగా మాట్లాడం ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు. డిఏలు మరిచిపోయాం. పిఆర్‌సిపై ఆశలు పోయాయి. గట్టిగా అడిగితేనే, గట్టిగా నిలబడితేనే, ఐక్యంగా ఉద్యమిస్తేనే ఏమైనా సాధించుకోగలమనేది చరిత్ర పాఠం. లాభపడ్డా, తాత్కాలికంగా నష్టపోయినా ఉద్యమం ఐక్యంగా ముందుకు సాగాలి. లేకుంటే పాలకుల పాచిక పందెంలో గెలుస్తుంది. పోరాట విరమణా? పోరాటం కొనసాగింపా? తేల్చుకోవాలి. వీరులు పోరాడుతూనే వుంటారు.
(వ్యాసకర్త పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ )

(వ్యాసకర్త పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ )