
కొద్దిమందికి మాత్రం అత్యంత ఆధునిక విద్య, కోట్లాది మందికి ప్రాచీనకాలం నాటి వర్ణ వ్యవస్థను బలపరచే అశాస్త్రీయ విద్యను అందించాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. ఆటోమేషన్ వంటి అనేక నూతన శాస్త్రీయ పరిశోధనలు ప్రపంచాన్ని అబ్బుర పరుస్తుంటే...జ్యోతిష్యం, భూతవైద్యం అంటూ కొన్ని శతాబ్దాల నాటి విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. యువ శ్రామికశక్తిలో 70 శాతం గ్రామీణ ప్రాంతం నుండి వస్తున్నారు. వీరికి వృత్తిశిక్షణ, ఐటిఐ, పాలిటెక్నిక్ లాంటివి అందుబాటులో వుంచి నైపుణ్యాన్ని పెంచాలి. స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, గ్లోబల్ విద్య అంటూ చేస్తున్న ఉత్తుత్తి ప్రచారం ఎన్నికల్లో కొద్దికాలం ఓట్లు రాల్చవచ్చునేమో కాని యువత భవితకు ఏ మాత్రం ఉపయోగపడదు. రాజ్యాంగం హామీ ఇచ్చిన శాస్త్రీయమైన, నైపుణ్యవంతమైన విద్యా విధానం అందరికీ కావాలి.
మన దేశంలో 2030 నాటికి సుమారు 2 కోట్ల 90 లక్షల మంది యువత సరైన నైపుణ్యం లేక ఉపాధికి దూరమవుతారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) తాజా నివేదిక పేర్కొంది. ప్రపంచ జనాభాలో భారత దేశానిది అగ్రస్థానం. కేవలం సంఖ్యలోనే కాదు, యువశక్తిలో కూడా భారత దేశానిదే ప్రథమ స్థానం. దేశ జనాభాలో 45 శాతం ప్రజలు 25 సంవత్సరాల లోపు వారే. 2025 నాటికి మన దేశ సగటు మధ్యస్థ వయసు 31 సంవత్సరాలుగా వుంటుందని అంచనా. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కలిగిన ఐదు దేశాలతో పోలిస్తే అత్యంత యువశక్తి కలిగిన దేశంగా మన దేశం వుంటుంది. అయితే ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు దేశంలో నిరుద్యోగం భారీగా పెరిగిపోతున్నది. 2023 మార్చి లెక్కల ప్రకారం దేశంలో గత 45 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ రేటు 7.76 శాతంగా వుంది. ఇది పట్టణాల్లో 8.3, గ్రామాల్లో 7.3 శాతం. చదువుకున్న వారి సంఖ్య పెరగడం వల్ల ఏర్పడిన నిరుద్యోగం కాదు. మన చదువులు సరైన నైపుణ్యత నేర్పకపోవడం వల్ల, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల పెరుగుతున్న నిరుద్యోగం. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందివ్వకపోతే యువత శక్తి నిర్వీర్యం అవుతుంది. మతతత్వ, విచ్ఛిన్నకర శక్తుల చేతిలో పదునైన ఆయుధంగా మారుతుంది. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన అనేక నినాదాల్లో 'నైపుణ్య భారతం' ఒకటి. 2022 నాటికి 40 కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే లక్ష్యంతో 2015లో కేంద్ర ప్రభుత్వం స్కిల్ ఇండియా మిషన్ ఏర్పాటు చేసింది. ప్రారంభించిన నాడు చేసిన హంగామా తప్ప ఆచరణలో ఏ ప్రయోజనం జరగలేదు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యా నైపుణ్యం కోసం గ్లోబల్ విద్య అందిస్తామని ఇటీవలే నిపుణుల కమిటీ వేశారు. ఈ కమిటి నెల రోజుల లోపే నివేదిక ఇవ్వాలని గడువు నిర్ణయించారు. యువతలో నైపుణ్యాన్ని పెంచాలనే చిత్తశుద్ధి కంటే ఎన్నికల్లో యువత ఓట్లు కొల్లగొట్టడానికి, దేశీయ, విదేశీ కార్పొరేట్ కంపెనీల్లో పని చేయడానికి అవసరమైన కొద్దిమంది నిపుణులను తయారు చేయడానికి పాలకులు అనేక ఆకర్షణీయమైన పథకాలు ప్రకటిస్తున్నారు.
యువ భారతం
జనాభాలో చైనాను అధిగమించి అత్యధిక జనాభా వున్న దేశంగా అగ్రస్థానం పొందాము. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుపుతామని బిజెపి నేతలు ఊదరగొడుతుంటే ఈ రంగంలోనైనా అగ్రస్థానం లోకి వచ్చాములే అని నెటిజన్‌లు ఎత్తిపొడుస్తున్నారు. వాస్తవానికి ప్రపంచంలో అత్యధిక యువశక్తి వున్న దేశం మనదే. మొత్తం జనాభాలో 65 శాతం 28 సంవత్సరాల లోపు వుండగా, అందులో 25 సంవత్సరాల లోపు వున్నవారు 45 శాతం మంది వున్నారు. 2050 నాటికి కూడా మన దేశ మధ్యస్త సగటు వయసు 38 సంవత్సరాలు మాత్రమే. అప్పటికి అమెరికా సగటు మధ్య వయసు 40 నుండి 42 సంవత్సరాలు, చైనా 39 నుండి 44 సంవత్సరాలుగా వుంటుంది. రాబోయే 15-20 సంవత్సరాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక యువ కార్మికశక్తి నాలుగు శాతం తగ్గుతుండగా, మన దేశంలో 32 శాతం పెరిగి, ప్రతి సంవత్సరం కొత్తగా ఒకటిన్నర కోటి మంది లేబర్ మార్కెట్‌లో పని చేయడానికి సిద్ధమవుతున్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే సహజ వనరులతో పాటు మానవ వనరులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. మన దేశంలో సహజ వనరులు, సమశీతోష్ణ వాతావరణం, అన్నిటికంటే ముఖ్యంగా అతి పెద్ద సంఖ్యలో యువశక్తి వుండడం ప్రపంచ ఆర్థికశక్తిగా ఎదగడానికి గొప్ప అవకాశం. వీరికి సరైన విద్య, శిక్షణ కల్పించి నైపుణ్యాన్ని పెంచితే దేశం అభివృద్ధి చెందుతుంది. తమ భవిష్యత్తుకు భరోసా కావాలని యువత కోరుకుంటున్నారు. అందుకే ఎన్నికల్లో ఎక్కువ మంది యువతీ యువకులు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. 2014లో బిజెపి అధికారంలోకి రావడంలో మొదటిసారి ఓటు హక్కు పొందిన యువతలో 87 శాతం మంది ఆ పార్టీకి ఓటు వేశారు. వివిధ రాష్ట్రాల్లో బిజెపి సాధించిన ఎన్నికల విజయాల్లో యువత ఓటింగ్ కీలకమైంది. మన రాష్ట్రంలో గత ఎన్నికల్లో మొదటిసారి ఓటు పొందిన యువకులు అత్యధికం వైసిపికి వేశారు. అధికారంలోకి రావాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తున్నది. ఎన్నికలు దగ్గరకు వచ్చేకొద్ది దేశంలో, రాష్ట్రంలో యువతకు అనేక హామీలు వరదల్లా చుట్టుముట్టనున్నాయి. పాలక పార్టీలకు ఓట్లు, సీట్లు తప్ప యువశక్తికి అవసరమైన నైపుణ్యాన్ని అందించాలనే ప్రయత్నం మాత్రం చాలా స్వల్పం.
నైపుణ్య కొరతలో యవశక్తి
పనుల కోసం రాష్ట్రాలు దాటి వలసలు వెళ్తున్న యువకుల్లో అత్యధికమంది ఇంటర్, డిగ్రీ చదివినవారు లేదా ఆ స్థాయి చదువులు మధ్యస్తంగా ఆపేసినవారు. భవన నిర్మాణ కార్మికులుగా మహా నగరాలకు పెద్ద ఎత్తున వలసలు పోతున్నారు. ఈ యువ కార్మికులు ఎంతటి దుర్భర పరిస్థితుల్లో వున్నారో తెలుసుకోవడానికి భువనేశ్వర్ నుండి యశ్వంత్‌పూర్ వెళ్లేె ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, హౌరా నుండి గోవా yెళ్ల్లే వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ రైళ్లను చూస్తే అర్థమవుతుంది. రిజర్వేషన్ కోచ్‌లలో సైతం కిక్కిరిసి, అలసిపోయి, రెండు మూడు రోజులుగా స్నానాలు చేసే అవకాశం లేని ఆ యువతీ యువకులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన అక్షరాస్యులు. వీరిలో అత్యధికులు స్వంత భూములు లేనివారు, సామాజికంగా అట్టడుగు వర్గాలకు చెందినవారు. కాంట్రాక్టర్ల మోసాలు, యజమానుల వేధింపులు, మహిళలకు జరుగుతున్న అవమానాలు తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయులు. స్వంత అనుభవంతో భవన నిర్మాణ పనులు నేర్చుకొని అద్భుతమైన ప్రతిభతో సుందర భవనాలను నిర్మిస్తున్న కార్మికులు వీరు. వీరికి నైపుణ్య శిక్షణ ఇచ్చి వృత్తి అవకాశాలు కల్పించాలనే స్పృహ పాలకులకు ఏ మాత్రం లేకపోగా, నైపుణ్యం లేని కార్మికుల పేరుతో మరింతగా దోచుకోవడానికి సంపన్నులకు పాలక పార్టీలు తోడ్పడుతున్నాయి. డిగ్రీ, పీజీలు చేసిన వారిలో సగం మందికి నైపుణ్యత లేదని అందువల్ల ఉద్యోగాలు పొందలేకపోతున్నారని అనేక గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఇటీవల ప్రకటించిన నివేదిక సారాంశం కూడా ఇదే.
కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ 2021 నివేదిక ప్రకారం విద్యావంతుల్లో ఉద్యోగార్హత కలిగినవారు కేవలం 50 శాతం లోపు మాత్రమే వున్నారు. బి.టెక్ 47 శాతం, 47 ఎం.బి.ఏ, 43 బి.ఏ, 40 శాతం బి.కాం, 30 శాతం బి.ఎస్సీ విద్యార్థులకు మాత్రమే ఉద్యోగ నైపుణ్యత ఉన్నట్లు తెలిపింది. బి.ఫార్మసీ చదివిన వారిలో నిరుద్యోగం 67 శాతంగా వుంది. ఐటిఐ లలో చదువుకున్న వారిలో 75 శాతం మందికి ఉపాధి నైపుణ్యాలు లేవని ఇండియా స్కిల్ రిపోర్టు పేర్కొంది. 1951 నాటికి మన దేశ అక్షరాస్యత కేవలం 16.7 శాతం. 72 సంవత్సరాల స్వదేశీ పాలన తర్వాత నూటికి 64 శాతం మందికి ఎంతో కొంత చుదువు దక్కింది. అయితే డిగ్రీలు చదివిన విద్యావంతుల్లోనే సగం మందికి సరైన నైపుణ్యత లేకపోతే అంతకంటే దిగువ చదువుల నాణ్యత ఏమిటి? నైపుణ్యాన్ని అందించలేని చదువులతో ఆధునిక ప్రపంచంతో ఎలా పోటీ పడగలం? ఇంటర్, డిగ్రీ స్థాయిలలో మంచి మార్కులతో విద్యార్థులు ఉత్తీర్ణులవుతున్నప్పటికి ఎందుకని ఉద్యోగ నైపుణ్యత సాధించలేకపోతున్నారు ?
అధ్యాపకుల కొరత
ప్రభుత్వాల విధానాలు, ప్రచార హోరు, మధ్యతరగతి ఆశల మధ్య దేశవ్యాప్తంగా విద్యా ప్రైవేటీకరణ వేగంగా విస్తరిస్తున్నది. అయితే ఇక్కడ చదువులు నేర్పుతున్న అధ్యాపకుల్లో ఎంతమంది అర్హత కలిగిన వారు వున్నారనేది ప్రశ్నార్థకం. 2021 ఐక్యరాజ్యసమతి ఆధ్వర్యంలోని యునెస్కో భారతదేశ విద్యపై ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రైవేట్ విద్యాలయాల్లో అర్హత లేని అధ్యాపకులు నర్సరీ స్థాయిలో 51 శాతం, ప్రాథమిక స్థాయిలో 41 శాతం, ప్రాథమికోన్నత స్థాయిలో 55, సెంకడరీ స్థాయిలో 52, ఉన్నత విద్యలో 61 శాతం మంది వున్నారు. విద్యా పునాది నుండే అధ్యాపకుల పరిస్థితి ఇలా వుంటే నాణ్యమైన విద్య ఎలా వస్తుంది? నైపుణ్యత ఎక్కడి నుండి అందుతుంది? ఉన్నత విద్యా కేంద్రాలైన యూనివర్శిటీలలో ప్రొఫెసర్ల కొరత చాలా తీవ్రంగా వుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వున్న కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 59 శాతం ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా వున్నట్లు సమాచార హక్కు చట్టం ద్వారా ఎస్.ఎఫ్.ఐ అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది. కొత్తగా ప్రారంభించిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల పరిస్థితి అతిథి అధ్యాపకులు, అద్దె భవనాలుగా వుంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన విద్యా కేంద్రాలుగా భావిస్తున్న ఐఐటి లలో కూడా సిబ్బంది కొరత వుంది. 23 ఐఐటి లలో మంజూరైన పోస్టులు 10,881 కాగా... 4,370 పోస్టులు భర్తీ చేయాల్సి వుందని పార్లమెంట్‌కు ఈ ప్రభుత్వం తెలిపింది. ఉన్నత విద్యారంగం ఇంత అధ్వాన్నంగా వుంది కాబట్టే విశ్వవిద్యాలయాల అంతర్జాతీయ ర్యాంకుల స్థానాల్లో దేశీయ విశ్వవిద్యాలయాలు పదిలో ఒకటి కాదు, వందలో ఒకటి కూడా వుండడంలేదు. రాజకీయ ప్రచారం కోసం స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలను ఏర్పాటు చేయడం ద్వారా ఇది పరిష్కారం కాదు. మన యువత నైపుణ్య కొరతకుగల కారణాలను నిష్పక్షపాతంగా పరిశీలించి శాస్త్రీయ పరిష్కార చర్యలు తీసుకోవాలి. అప్పుడే మన దేశం రానున్న కొన్ని దశాబ్దాల్లోనైనా ప్రపంచ అగ్ర దేశాలతో పోటీ పడగలదు.
కేంద్ర ప్రభుత్వ తిరోగామి విధానాలు
ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి ఉన్నత విద్యాలయాల వరకు సరిపడ అధ్యాపకులు, ల్యాబ్‌లు, లైబ్రరీలు, మౌలిక సౌకర్యాలు అందుబాటులో లేకపోతే యువతకు నిపుణత ఎలా అందుతుంది? విద్యారంగాన్ని మెరుగుపరచి నైపుణ్యాన్ని పెంచడం కంటే కేంద్రీయ విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేయడం, పోలీసులు, గూండాల ద్వారా విద్యార్థులు, అధ్యాపకుల మీద దాడులు చేయించడం, మైనారిటీ అమ్మాయిలు ధరించే హిజాబ్ లాంటివి వివాదం చేయడం, వైస్ ఛాన్సలర్ల ద్వారా నిర్బంధ విధానాలు అమలు చేసి రాజకీయ లబ్ధి పొందేందుకు పాలకులు ప్రయత్నిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకు పాఠ్యాంశాలను బిజెపి మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ ఆలోచనలకు అనుగుణంగా మారుస్తున్నారు. కొద్దిమందికి మాత్రం అత్యంత ఆధునిక విద్య, కోట్లాది మందికి ప్రాచీనకాలం నాటి వర్ణ వ్యవస్థను బలపరచే అశాస్త్రీయ విద్యను అందించాలని బిజెపి నేతలు భావిస్తున్నారు. ఆటోమేషన్ వంటి అనేక నూతన శాస్త్రీయ పరిశోధనలు ప్రపంచాన్ని అబ్బుర పరుస్తుంటే...జ్యోతిష్యం, భూతవైద్యం అంటూ కొన్ని శతాబ్దాల నాటి విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. యువ శ్రామికశక్తిలో 70శాతం గ్రామీణ ప్రాంతం నుండి వస్తున్నారు. వీరికి వృత్తిశిక్షణ, ఐటిఐ, పాలిటెక్నిక్ లాంటివి అందుబాటులో వుంచి నైపుణ్యాన్ని పెంచాలి. స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, గ్లోబల్ విద్య అంటూ చేస్తున్న ఉత్తుత్తి ప్రచారం ఎన్నికల్లో కొద్దికాలం ఓట్లు రాల్చవచ్చునేమో కాని యువత భవితకు ఏ మాత్రం ఉపయోగపడదు. రాజ్యాంగం హామీ ఇచ్చిన శాస్త్రీయమైన, నైపుణ్యవంతమైన విద్యా విధానం అందరికీ కావాలి.
(వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు)
వి. రాంభూపాల్