Dec 11,2022 14:09

మొక్కలు ఎప్పుడూ మనిషి జీవన విధానంలో ఒక భాగమే. ప్రతి జీవిని తన పరిథిలో మమేకం చేసుకోగలిగే శక్తి మొక్కలకు ఉంది. మనకు తెలిసినవి కొన్ని, కొత్తవి కొన్ని.. వాటి పుట్టుక, ప్రదేశాన్ని బట్టి రకరకాల పేర్లతో మనల్ని కనువిందు చేస్తుంటాయి. అందుకే వృక్ష శాస్త్రవేత్తలు ప్రతి మొక్కకు శాస్త్రీయ నామం ఇచ్చి, ప్రపంచానికి పరిచయం చేశారు. కడియం నర్సరీలలో అలాంటి కొత్తమొక్కలు కనువిందు చేస్తున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

 రెడ్‌ బే బెర్రీ

                                                                              రెడ్‌ బే బెర్రీ

దీని శాస్త్రీయ నామం మొరెల్లా రొబ్రా. పోషకాలు, ఔషధ విలువలు ఉన్న పండు రెడ్‌ బే బెర్రీ. దీని పండ్లు ముదురు ఎరుపు రంగులో గుత్తులుగా కాస్తాయి. పండు కొంచెం తియ్యటి రుచిని కలిగి ఉంటుంది. స్థానికంగా దీనిని బెర్రీ అంటాము. ఇది 15 నుండి 30 అడుగుల ఎత్తు వరకు పెరిగే సతత హరిత చెట్టు. చైనా, జపాన్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌ ప్రాంతాలకు చెందిన మొక్క. హైబ్రీడ్‌ డ్వార్ఫ్‌ రకం. కేవలం నాలుగైదు అడుగుల ఎత్తు మాత్రమే పెరుగుతుంది. వేసవి ప్రారంభం నుంచి కాపు కాస్తుంది. తేమ గల నేల అవసరం. ఈ మొక్కలు కడియం నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయి.

క్వాస్సియా అమర


                                                                         క్వాస్సియా అమర

శాస్త్రీయ నామం క్వాస్సియా అమర. దీనిని అమర్గో, బిట్టర్‌ యాష్‌, బిట్టర్‌ ఉడ్‌, హోంబర్‌ గ్రాండీ అని రకరకాల పేర్లతో పిలుస్తారు. దీని పువ్వులు చిలక ముక్కులాంటి ఎర్రటి ఎరుపు, కొనదేరిన చివరతో పొడవుగా ఉంటాయి. మొక్కకు చిన్నచిన్న కొమ్మలు, వాటికి రెండువైపులా పండుమిర్చి ఆకారంలో ఉన్న పువ్వులు పూస్తాయి. పువ్వుల్లోంచి సన్నని తీగ లాంటి పుప్పొడి కనిపిస్తుంది. ఈ మొక్క ఐదారు అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇది మలేషియాకు చెందినది.

33

                                                                         సిట్రస్‌ రెటిక్యులేట బాల్కనో

సిట్రస్‌ రెటిక్యులేటా దీని శాస్త్రీయనామం. ఇది సిట్రస్‌ జాతికి చెందినది. మనదేశంలో సండ్రాప్‌ ఫ్రూట్‌ అని పిలుస్తారు. నిమ్మ, నారింజ, కమల, బత్తాయి కోవకు చెందినది. రుచి వీటికంటే భిన్నంగా ఉంటుంది. తీపి పులుపుల సమ్మేళనం. దీన్ని జ్యూస్‌ చేసుకోవడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు. ఎన్నో ఔషధాలు మరెన్నో పోషక విలువలు కలిగి ఉన్న పండు ఇది. ముఖ్యంగా సి విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. మొక్క ఐదారడుగుల ఎత్తు పెరుగుతుంది. ఎర్రమట్టి నేలల్లో బాగా పెరుగుతుంది. శీతాకాలం, వేసవికాలం పండ్లు కాస్తుంది. మొక్కకి సమద్ధిగా నీరు అవసరం. ఇది కేరళకు చెందినది.

  తెల్ల మాల్ఫిజియన్‌ క్రీపర్‌

                                                                      తెల్ల మాల్ఫిజియన్‌ క్రీపర్‌

దీని బొటానికల్‌ నేమ్‌ కాంబ్రిటమ్‌ ఇండికమ్‌. శాస్త్రీయ నామం మాల్ఫిజియా. దీనినే రంగూన్‌ క్రీపర్‌ అని కూడా అంటారు. రకరకాల ఆకారాల్లో కత్తిరించి పార్కుల్లోనూ, సందర్శనా స్థలాల్లో పెంచుకునేందుకు ఇది బాగుంటుంది. దీనిలో ఇప్పటి వరకు తెలిసిన ఆకుపచ్చని రకంతో బాటు, తెల్లని ఆకులను కలిగిన కొత్తరకం కూడా నర్సరీలో లభ్యమౌతుంది. ఇది థాయిలాండ్‌కు చెందినది. కొద్దిపాటి నీటి సౌకర్యంతో, అన్ని రకాల నేలల్లోనూ పెరుగుతుంది.

99

                                                                         బనానా పప్పాయ

ప్రకతిలో ఒక్కో పండుకు ఒక్కో రూపం ఉండటం సహజం. ఒక పండు మరో పండు రూపంలో ఉండటం వింత, విశేషం. అటువంటి కోవకు చెందింది ఈ బనానా పప్పాయ. బొప్పాయి పండు అచ్చం అరటిపండు ఆకారంలో ఉంటుంది. పైగా చెట్టుకు పైన కాకుండా దాని కాండానికి అడుగుభాగాన కాయలు కాయటం దీని ప్రత్యేకత. ఇది థాయి లాండ్‌కు చెందినది. పండు చాలా మధు రంగా ఉంటుంది. నాటిన రెండో సంవత్స రానికి కాయలు కాస్తుంది. అన్ని రకాల నేలల్లోనూ పెరుగుతుంది. సంవత్సరం పొడవునా కాయలు కాస్తుంది. మంచి ఫల సాయాన్ని ఇచ్చే మొక్క.