Oct 22,2023 11:23

సూర్యునికీ, చంద్రునికీ..
సగటు మనిషికీ..
విరామం ఉంది
రాజకీయ జాడ్యానికి
అలుపూ సొలుపేం ఉండదు!
కీచురాళ్ళ రొదలా వాగుడు వంకలై
మాటలు ప్రవహిస్తుంటాయి!
కుర్చీలు వారికి
కనక వర్షాన్ని కురిపిస్తాయి!
అందుకే వారు వాగ్దానాల మేఘాలపై
నడుస్తుంటారు!
దేశభక్తిని మించిన
పాలనా భుక్తిని ఎంచుకొని..
వాగ్దానాల వంటకు సిద్ధమౌతారు
సీటు, ఓటు కోసం..
చెకుముకి (కుల)రవ్వల్ని రాజేస్తూ
రాజాలా పెత్తనం చెలాయిస్తారు!
అయిదేళ్ళు నేలపై..
వాలని పాదాలకు పనిచెప్తూ..
చారు వాలాగా.. గ్లాసుల్ని తిప్పుతూ..
రైతులాగా.. నాగల్ని మోస్తూ
తలపాగతో మెరిసిపోతారు
మళ్ళీ రాజకీయ నగారా మోగుతోంది
కుర్చీల కొలువుల జాతర మొదలవుతోంది
వాగ్దానాల వంట గుమగుమలు
మనసుల్ని ఊరిస్తున్నాయి
ఊక దంపుడు మాటలు..
హౌరెత్తుతున్నాయి!
ఓటరూ! ఆలోచనల్ని కదపండి!
మీ చూపులు అభివృద్ధివైపు చాచండి!
నవ భారత నిర్మాణానికి
ఓటు ఆయుధాన్ని సంధించండి!
వాగ్దానాల వలలకు చిక్కకండి..!

మహబూబ్‌ బాషా చిల్లెం
9502000415