Oct 08,2023 11:13

ట్రింగ్‌.. ట్రింగ్‌ శబ్దం బాణీ మార్చుకుంది
హలో.. బాగున్నారా అన్న టెలిఫోన్‌
సంభాషణల ఆప్యాయతలు కనుమరుగై..
హా.. చెప్పు.. అంటూ
మొదలై గంటల కొద్దీ
సమయాన్ని హరించుకుంటుంది!
అలనాటి అనురాగాలు
మచ్చు తునకలయ్యాయి
మొబైల్‌ ఫోన్‌ రంగుల హంగుల్లో
చిక్కిన 'మమత'ల మాటున
'రియాలిటీ' దొరుకుతుందా ?
మాయా ప్రపంచం మన చేతిలోకి వచ్చేసింది మహమ్మారిలా
పక్కన మనిషి కంటే
ప్రాముఖ్యం పెంచుకుంది !
క్షణాల్లో అన్నీ దరిచేరుస్తుంది
మనల్ని భ్రమలో పడేసి
'రోబోట్‌'లా మార్చేసింది
పడుకుంటే పక్కలో.. తలగడలా చేరింది
కిచెన్‌లో దూరి..
ఒక్కచేతి వంటగా మార్చింది
తినేప్పుడు కూడా..
మనశ్శాంతి కరువే మరి
వాకింగ్‌ కూడా.. చేసుకోలేనంతగా వొదిగింది వొడిలో భాగమైంది
తెలివిగా చేరువైంది
చరవాణి చెరలో వేసింది బతుకు తీపిదనాన్ని..
మనుషుల మధ్య కమ్మదనాన్ని !
గుండెకాయగా మారి
గూడు కట్టుకుంది మనసులో
చేతికున్న 'వాచీ' చేజారి పోయింది,
'వాలెట్‌' వరుస తప్పింది
హ్యాండ్‌ బాగ్‌ అంతంత మాత్రమైంది
'పుస్తకాలు' రాక్‌లలో
అలంకార ప్రాయమయ్యాయి
ఒకే ఒక్క 'మొబైల్‌' జీవితాన్ని
సమూలంగా మార్చేసింది
డిజిటల్‌ యుగంలోకి తోసేసింది!
చేతికి సెల్‌ఫోన్‌ ఇస్తేగాని
చిన్నారులకు గోరు ముద్దలు
తినిపించలేని స్థితిలోని తల్లులను చూసి
'చందమామ' దిగులుతో
చతికిల పడింది
ఆట, పాటలను దూరంచేసి.. అన్నీ తానై అరచేతిలో తిష్టవేసి అజమాయిషీ చేస్తుంది
పెరుగుట విరుగుట కొరకే అయినా
తెలుసుకోవాలి కదా మనం!


న్యాలకంటి నారాయణ
95508 33490