
ఉలితో ఊహలకు రూపాలు కల్పించి, శిలకు కళాకాంతులు తెస్తాడు శిల్పి. కుంచె పట్టుకుని ఎంచుకున్న భావాలకు రూపురేఖలు తొడుగుతాడు చిత్రకారుడు. నేర్పుగా సారె తిప్పే కుమ్మరి రకరకాల ఆకృతులలో మట్టిపాత్రలను తయారుచేస్తాడు. నూలు వడికి మగ్గం ఎక్కించి అందమైన వస్త్రాలను రూపొందిస్తాడు నేతన్న. ఇదొక అద్భుతమైన కళ. మనిషి బతకడానికి అవసరమైన కూడు, గూడు, గుడ్డ, నీరు ఎంతో ప్రధానం. ప్రపంచానికి ఆహారాన్ని అందించే రైతన్న ఎంత అవసరమో, వస్త్రాన్ని అందించే నేతన్న కూడా అంతే ప్రధానం. మనిషికి ప్రతి దశలోనూ వస్త్రాల యొక్క ప్రాముఖ్యత అనివార్యం. మానవాళికి చేనేత వస్త్రాలను అందించిన ఘనత... అగ్గిపెట్టెలో పట్టే ఆరడుగుల చీరను నేసి ప్రపంచాన్ని అబ్బురపరచిన చరిత్ర... మన నేతన్నల నిపుణతకు నిదర్శనం. 'మైజారు కొంగున జరీ నిగనిగ, ఆమె కళ్లల్లోనూ, చెక్కిళ్ళమీదా, పెదవుల మీదా తళుక్కుమంది' అంటాడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తన 'పుల్లంపేట జరీచీర' కథలో. 'చేనేత సాహిత్యం తెలుపు... చంద్రునికో నూలుపోగు చందం' అన్నట్లుగా చేనేతల జీవితాలపై సాహిత్యంలోనూ అనేక కథలు, కవితలు వచ్చాయి. చేతి నైపుణ్యంతో అందమైన చీరలను సష్టించడం నేతన్నకు మాత్రమే సాధ్యం. నేత చీర దర్పాన్ని ప్రదర్శిస్తుంది, సహజంగా కనిపిస్తుంది. 'మనసు మమత పడుగు పేక చీరలో చిత్రించినాను/ ఇది ఎన్నో కలల కలనేత నా వన్నెలరాశికి సిరిజోత' అంటాడు ఆరుద్ర. సందర్భం ఏదైనా... మహిళలకు వన్నెతెచ్చేది మాత్రం చేనేత చీర. భారతీయ సాంస్కృతిక కళావైభవంలో ఒకటైన చేనేత కళ ప్రపంచానికే ఆదర్శం.
భారత స్వాతంత్య్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించింది చేనేత. 1905 ఆగస్టు 7న కలకత్తాలో మొట్టమొదటగా స్వదేశీ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. విదేశీ వస్త్రాలను బహిష్కరించి, స్వదేశీ వస్త్రాలనే ధరించాలన్న నినాదం ఉవ్వెత్తున ఎగసింది. అంతటి సుదీర్ఘమైన చరిత్ర చేనేతది. భారతీయుల జీవితంతో పెనవేసుకొని, భారతీయ సంస్కృతికి అద్దం పడుతుంది చేనేత. 'ఏదైనా జాతీయ విద్యావిధానంలో నూలు వడకడం, నేయడం ఒక అవసరమైన భాగంగా నేను భావిస్తాను' అంటారు గాంధీజీ. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న చేనేత వస్త్రాల్లో 95 శాతం భారత్‌లోనే ఉత్పత్తి అవుతోంది. దేశంలోని చేనేత రంగంలో కోటీ 30లక్షల మందికి పైగా ప్రత్యక్షంగానూ, మరో 9 కోట్ల మందికి పైగా పరోక్షంగానూ ఆధారపడి వున్నారు. భారతదేశంలో చేనేత పరిశ్రమ గణనీయమైన ఆర్థిక ప్రాముఖ్యతను కలిగివుంది. వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్నది చేనేతరంగమే. 17, 18 శతాబ్దాల నాటికి ప్రపంచ వస్త్ర వ్యాపారంలో 25శాతం వాటా మన దేశానిదే. ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటూ ఖ్యాతిగడించారు మన నేతన్నలు. ఇప్పటికీ వందలాది కుటుంబాలు చేనేత వృత్తినే జీవనోపాధిగా చేసుకున్నాయి. ఉత్పత్తి వివిధ దశల్లో స్త్రీ పురుషులిద్దరి భాగస్వామ్యం వుంటుంది.
మానవాళికి వస్త్రాన్ని అందించిన నేతన్న బతుకు నేడు ఆధునిక యంత్రాలతో పోటీపడలేక ఛిద్రమైంది. కుట్టులేకుండా మువ్వన్నెల జెండా నేసిన నేతన్నకు చేయూత కరువైంది. ఎన్ని కష్టాలెదురైనా... తమ వారసత్వ వృత్తిని, కళను కాపాడుకుంటున్న నేతన్న... బతుకు చిత్రం కళ తప్పి వెలిసిన వస్త్రంలా మారిపోయింది. పొట్ట చేత పట్టుకొని మరమగ్గాలపై పనిచేసేందుకు, ఇతర వృత్తులకు పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు. అప్పులు చేసి మర మగ్గాలు కొనుక్కున్నా.. ముడిసరుకు అందుబాటులో లేక, చేసిన అప్పులు తీరక... ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి నుంచి నేతన్నను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ప్రాచీనమైన చేనేత కళా వైభవాన్ని... ఆధునికతను జోడించి భవిష్యత్తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుంది. భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, చేనేత కార్మికులను శక్తివంతం చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రతియేటా ఆగస్టు 7 నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉపన్యాసాలకు, గత చరిత్రను వల్లెవేయడానికి కాకుండా... చేనేతను బతికించడానికి ఉపయోగపడాలి.