అక్షర తుమ్మెదలం మేము
భావ మకరందం సేకరణలు చేస్తూ
మస్తకాన్ని అందులో దాచుకొని
అక్షరాలను ఏరుకొని ఆరగిస్తున్నాం..
రెండు కళ్లను ఒకటి చేసి
పుస్తకం పైనే మనసు ఎక్కుపెట్టి
మునివేళ్లతో చేతులు పరుగులు పెట్టిస్తూ
కంటి ద్వారా సారాన్ని మస్తిష్కానికి చేరుస్తున్నాం..
పుట్టల్లో దాగిన మర్మాన్ని
అక్షర సొగసుల విన్యాసాన్ని
భావోద్వేగాల సమాహారాన్ని
మౌనంగా ఆస్వాదిస్తున్నాం..
జిజ్ఞాస మరిగిన విజ్ఞానిలా
అక్షర జ్ఞాన సముపార్జన విద్యార్థుల
పుస్తక సారాంశాన్ని ఆసాంతం స్వీకరిస్తూ
విజ్ఞాన వీధుల్లో తిరుగుతున్నాం..
ప్రతిక్షణం అక్షరం కోసం అడుగులు వేస్తూ
గ్రంథాలయ అరణ్యములో అన్వేషణ చేస్తూ
ఆకర్షించే ప్రతి పుస్తకాన్నీ స్వీకరిస్తూ
కళ్లమ్మడి ఆనంద భాష్పాలు కారుస్తున్నాం..
త్రికాలాలలో నిత్య నైవేద్యంగా
భావ సౌందర్యమే నీరాజనమై కొలుస్తుంది
ప్రతిరోజు రాయడానికి ప్రేరణనిస్తూ
గ్రంథమే భావాలను కానుకగా సమర్పిస్తుంది..
కొత్త పుస్తకం సువాసన మత్తెక్కించే
మెరిపించే ముఖచిత్రం ఆకర్షించే
మనసులో వేదన పుస్తకంపై ప్రసరించే
పురుడుబోసుకునే అక్షరాలకు మరో రూపం కల్పించే..
నా సత్కారాలకు నిలువెత్తు
రూపం ఈ పుస్తకాలు
నా కవితల వర్షములో
మొలిచిన అక్షర రూపాలు
నన్ను వెన్నంటి నడిపించే విజ్ఞానపుదారులు
నా ప్రతి సన్మానం
అక్షర పుస్తకం అందించే ఆయువు..
కొప్పుల ప్రసాద్
98850 66235