Mar 13,2023 12:55

ఇంటర్నెట్‌డెస్క్‌ : వేసవిలో పుచ్చకాయల్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని వైద్యులు చెబుతున్నారు. పుచ్చకాయల్లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో వేసవి తాపాన్ని తగ్గించుకోవాలంటే తప్పనిసరిగా పుచ్చకాయ జ్యూస్‌గానీ, ముక్కలు గానీ తీసుకుంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.
- పుచ్చకాయలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తి పెంచేందుకు ఎంతగానో దోహదపడుతుంది. అలాగే గాయాలు నయం చేసేందుకు శరీరంలో కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేస్తుంది.
- పుచ్చకాయలో చక్కెర శాతం ఎక్కువ. 100 గ్రాముల పుచ్చకాయ ముక్కల్లో 6.2 గ్రామల షుగర్‌ ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పుచ్చకాయలో ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో పుచ్చకాయ ముక్కల్ని కొన్ని తిన్నా.. ఆకలి తీరినట్టుగా ఉంటుంది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల దీన్ని తింటే బరువు పెరగరు.
- పుచ్చకాయలోని న్యూట్రీషియన్స్‌ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే లైకోపిన్‌ కొలెస్ట్రాల్‌ని తగ్గించడమే కాదు.. రక్తపోటు నివారించడానికి సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.