Nov 02,2022 07:10

            రాయలసీమ రైతన్నలు చిత్రమైన పరిస్థితి ఎదుర్కుంటున్నారు. చాలీచాలని వర్షాల కారణంగా ఎండిన చెరువులు, నిండని ప్రాజెక్టులు, ఫలితమివ్వని పంటలు, మోడువారిన బతుకులు ఇక్కడ నిత్యకృత్యమే! డొక్కల కరువు నుండి అంబలి శిబిరాల నిర్వహణ వరకు ఇక్కడి దుర్భిక్ష పరిస్థితుల గురించి కథలు, కథలుగా చెప్పుకోవటం తెలుగునాట కొత్త కాదు! ఈ ఏడాది పరిస్థితి దానికి భిన్నం. ప్రాజెక్టు నిండా నీళ్లున్నా..ఆ నీటిని పొలంబాట పట్టించడానికి అవసరమైన వసతులున్నా పంటలు ఎండిపోతున్నాయి. నీటి చుక్క లేక పచ్చటి పొలాలు పసుపు రంగును పులుముకుంటున్నాయి. తమ పొట్ట కొట్టవద్దంటూ సీమ రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది! ఇదేదో రెండు దేశాల మధ్యనో, రెండు రాష్ట్రాల మధ్యనో నెలకొన్న సమస్య కాదు. ఒకే రాష్ట్రంలో, ఒకే ప్రభుత్వ అజమాయిషీ కింద ఉన్న రెండు శాఖల మధ్య నెలకొన్న సమన్వయ లోపం! విద్యుత్‌ బకాయిలు చెల్లించలేదంటూ హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతలకు కరెంటు సరఫరా నిలిపివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. సమస్య తలెత్తగానే ప్రభుత్వ యంత్రాంగం స్పందించిందా, దిద్దుబాటు చర్యలు తీసుకుందా అంటే అదీ లేదు! రెండు వారాలు గడిచిపోయి, మీడియాలో వార్తలు వచ్చి, రైతాంగం ఆందోళనకు దిగిన తరువాత ఇప్పుడు భుజాలు తడుముకుంటున్నారు. సాకులు వెతుకుతూ కథలు చెబుతున్నారు. పోనీ, ప్రాజెక్టులో ఉన్న నీటిని పంట పొలాలకు ఎప్పుడు మళ్లిస్తారో చెబుతున్నారా అంటే అదీ లేదు. అన్నీ సందేహాస్పద ప్రకటనలే! ఈ ధోరణి ఇదే మాదిరి కొనసాగి నీరు రాక, పచ్చటి పొలాలు ఎండి రైతన్నల గుండెలు పగిలితే ఆ పాపం ఎవరిది?
            హంద్రీ నీవా సుజల స్రవంతి కింద ఈ ఒక్క సంవత్సరమే 380 కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలు ఉన్నాయి. ఇదిగాక, గత ప్రభుత్వంలోనూ, ఆ తరువాత కూడా పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. మొత్తంమీద 2,300 కోట్ల రూపాయలకు పైగా విద్యుత్‌ పంపిణీ సంస్థలకు ప్రాజెక్టు బాకీ పడింది. ఈ బకాయి మొత్తాన్ని చెల్లించాలని పంపిణీ సంస్థలు ఎన్ని సార్లు కోరినా, లేఖలు రాసినా ఫలితం శూన్యం. ఇదిగాక, పంపు హౌస్‌ నిర్వహించే ఒక ప్రైవేటు సంస్థకు 32 కోట్ల రూపాయలు బకాయిపడ్డట్లు చెబుతున్నారు. ఆ మొత్తం విడుదలయితేగానీ, నీటి విడుదలకు సహకరించేది లేదని ఆ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ దుస్థితిపై పత్రికల్లో వార్తలు రావడం, రైతాంగం రోడ్డెక్కడంతో నీటి సరఫరా నిలిచిపోవడానికి, కరెంటు సరఫరాకు సంబంధం లేదని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధాన కాలువపై మరమ్మతులు చేయాల్సి రావడంతో నీటి సరఫరా నిలిపివేసినట్లు వారు వివరిస్తున్నారు. అదే నిజమనుకున్నా, వేసవి కాలమంతా ఏం చేస్తున్నారు? కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లక్షకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేసి, ఒక్కో రైతు ఇప్పటికే ఎకరాకు 30 నుండి 60 వేల రూపాయలు ఖర్చు చేసిన తరువాత కాలువ సరిగా లేదన్న విషయం గుర్తుకు వచ్చిందా? పోనీ మరమ్మతుల కోసం పంపింగ్‌ ఆపే ముందు రైతులకు ఏమైనా ముందస్తు హెచ్చరిక చేశారా? వాతావరణంతో నిమిత్తం లేకుండా ప్రాజెక్టు నిర్వహణకు, నీటి విడుదలకు ఒక ప్రోటోకాల్‌ ఉంటుంది కదా... దానిని అమలు చేశారా? ఏమీ చేయకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని ఇప్పుడు ఆకాశం వైపు చూస్తూ కూర్చోమంటే ఎలా? రెండు, మూడు రోజుల్లో నీరు రాకుంటే పెట్టిన పెట్టుబడి నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆ మొత్తం వందల కోట్ల రూపాయల్లోనే ఉంటుందని అంచనా! ఆ కష్టానికి..నష్టానికి బాధ్యత ఎవరు?
             రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలకు జరుగుతున్న అన్యాయం ఇప్పటిది కాదు. రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల పరిస్థితి అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని మాదిరి తయారైంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలూ, ఆ సందర్భంగా ఇచ్చిన హామీలు, ప్రకటించిన ప్యాకేజీలు అమలు కావడం లేదు. వాటిని పట్టుబట్టి సాధించాల్సిన ప్రభుత్వ పెద్దలు దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ముందు సాగిలపడుతున్నారు. తమకు అన్యాయం జరిగిందన్న భావన సీమ ప్రజానీకంలో బలంగా ఉంది. దానిని సరిదిద్ది, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కృషి చేయాల్సిన బాధ్యత పాలకులది. రైతుల పట్ల, రాయలసీమ పట్ల ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా హంద్రీ నీవా ప్రాజెక్టు నుండి తక్షణం నీటిని విడుదల చేయాలి. ప్రాజెక్టు నిర్వహణను ప్రైవేటు సంస్థ నుండి తప్పించి ప్రభుత్వమే చేపట్టాలి.