Jul 26,2023 09:06

బీజింగ్‌ : చైనా ప్రభుత్వం మంగళవారం కీలక నిర్ణయం తీసుకుంది. నూతన విదేశాంగ మంత్రిగా వాంగ్‌ యీను తిరిగి నియమించింది. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న కిన్‌ గాంగ్‌ను తొలగించి వాంగ్‌ యీకు బాధ్యతలు అప్పగించింది. మంగళవారం జరిగిన నేషనల్‌ పీపుల్స్‌ కాంగ్రెస్‌ (ఎన్‌పిసి) స్టాండింగ్‌ కమిటీ సమావేశం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో బాటు బ్యాంక్‌ ఆఫ్‌ చైనాకు కొత్త గవర్నరుగా పాన్‌గాంగ్‌షెంగ్‌ను నియమించింది. గత ఏడాది డిసెంబరులో విదేశాంగ మంత్రిగా కిన్‌ గాంగ్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు కిన్‌ గాంగ్‌ ఆకస్మిక తొలగింపునకు ఆరోగ్యపరమైన అంశాలే కారణమై ఉండొచ్చని పరిశీకులు భావిస్తున్నారు. అమెరికాతో కీలకమైన దౌత్య చర్చల్లో కిన్‌ గాంగ్‌ సమర్థవంతంగా వ్యవహరించలేకపోయారనే విమర్శలూ ఉన్నాయి. వాంగ్‌ యీ దాదాపు దశాబ్దం పాటు విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం చైనా కమ్యూనిస్టు పార్టీ విదేశాంగ వ్యవహారాల కమిషన్‌ డైరక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.