Nov 27,2022 10:19

వైరుధ్యాల సమాజపు
నాలుగు రోడ్ల కూడలి
కొత్త ఇజాల కవాతులతో
కిటకిటలాడుతోంది
అధికారాన్ని చేరుకునే
రహదారులన్నీ వాగ్దానాల
వర్షపు జల్లులతో తడిసి
ముద్దవుతున్నాయి
అర్థం కాని నినాదాలతో
అసత్యపు ఆరోపణలతో
ఆకాశాన్నంటే అరుపులతో
గొంతులు చిట్లుతున్నాయి
అబద్ధాల తొక్కిసలాటలో
సత్యం సొమ్మసిల్లిపోతోంది
విరుద్ధభావాల పెనుగులాటలో
నిజం నీరుగారిపోతుంది
అస్థిత్వపు కుమ్ములాటల్లో
చైతన్యం సన్నగిల్లిపోతోంది
ఆధిపత్యపు పోరాటంలో
నైతిక విలువలు నశిస్తున్నాయి
విరిగి ముక్కలైన వాస్తవాలను
అతికించే క్రమంలో
ఆస్తిపంజరంలా అగుపిస్తోంది
మనుషుల అసలు నైజం
తీరం చేరుకున్న తర్వాత
తెడ్డును తగలెడుతున్నారు
నడిచొచ్చిన దారుల్లో
ముళ్ళు నాటుతున్నారు
జీవితం ఒరిగిపోతుందని
శిఖరం చేరుకున్న తర్వాత
వెనుతిరగాల్సిందేనని
అర్థం చేసుకోలేకపోతున్నారు
 

ఈదర శ్రీనివాసరెడ్డి
esreddy67@gmail.com