నిన్నటి అనుభవాల మీద
ఆమె రాస్తూ పోతుంది
ఒకనొక మధ్యాహ్నం కలగంటుంది
తన ఇంటిలోకి చంద్రకాంతి
కిటికీల వెంట నక్షత్రాల వెలుగు
జొరబడుతున్నాయని!
దిండును కన్నీటి బొట్లతో
నదిలా మార్చింది
దుప్పటిని మేఘాల్లా కమ్ముకుంది
ఎన్నిసార్లో ఆమెలో
కుంభవర్షం కురిసింది
ఎన్నో తుఫానులు
ఆమె కళ్ళ వెనకాతల
మరెన్నో వరదలు
హృదాయంతరాళాల్లో
ఎడతెగని ముసురు
ఎప్పుడూ ఆమె దేహంలో..!
సేవ చేసీ చేసీ అలసి
పక్కనే అరిగిన చెప్పులను విప్పి
కాసేపు సేదతీరుతుంది
కనురెప్పలు మాత్రం
కడుపులో బుగులుతో
పటపటమని కొట్టుకుంటూ
నిద్రలోనే మెలుకువ
మెలుకువలోనేమో భయం
ఎటూ తెగని సంసారమే తల్లీ ఇది!
నువ్వెన్ని అతుకులేసిన
అస్తిత్వాల చిరుగులు
కనిపిస్తూనే ఉంటారు
నువ్వెన్ని పూజలు చేసినా
ఎన్ని దేవుళ్ళకు మొక్కినా
నీ చేతిరాతలెప్పుడో
నువ్వు చేసే పనికి
సమసిపోయారు!
నువ్వో వెలకట్టలేని శ్రామికవి
బాధ్యత ముసుగులో
నీ ఉచిత శ్రమను
శతాబ్దాలుగా దోపిడీ చేస్తున్నారు
నీపై నీ శరీరంపై గౌరవం లేదు
ఇంకా రాలేదు..ఇకనైనా రాదా..!!?
- రఘు వగ్గు
9603245215