- కేవలం 13శాతమే వసూలు
- పదేళ్లలో రూ.13 లక్షల కోట్లు మాఫీ
- ఆర్‌టిఐ దరఖాస్తుకు ఆర్‌బిఐ సమాధానం
- భారీ రుణమాఫీ వివరాలిచ్చేందుకు నిరాకరణ
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గత ఐదేళ్లలో కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్లకు పైగా రుణాలు మాఫీ చేసినట్టు ఆర్‌బిఐ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దాఖలు చేసిన సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) పిటిషన్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) సమాధానమిచ్చింది. గత ఐదేళ్లలో రూ.10,09,510 ఓట్లు ఎన్‌పీఏ కింద బ్యాంకులు మాఫీ చేశాయని తెలిపింది. అందులో రూ.1,32,036 కోట్ల (13శాతం) రుణాలు మాత్రమే బ్యాంకులు వసూలు చేసినట్టు తెలిపింది. 2022-23 నాటికి అంచనా వేసిన స్థూల ఆర్థిక లోటు రూ.16.61 లక్షల కోట్లలో 61శాతం రుణమాఫీ అవుతుందని అంచనా వేశామనీ, మార్చి 2022 నాటికి ఎన్‌పిఎలు రూ.7,29,388 కోట్లకు తగ్గించిందని ఆర్‌బిఐ వెల్లడించింది. గత పదేళ్లలో రూ.13,22,309 కోట్లు రుణమాఫీ చేసినట్టు తెలిపింది. స్థూల గణన ప్రకారం డిఫాల్ట్ చేసిన రుణాల మొత్తం రూ.16.06 లక్షల కోట్లు (రుణమాఫీతో సహా ఐదేళ్లలో రైట్-ఆఫ్‌ల ద్వారా రికవరీ చేసిన రుణాలు మినహాయించి) ఉందనీ, రుణమాఫీలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు, బ్యాంకులు పేర్కొన్న 5.9శాతం నుంచి మొత్తం ఎన్‌పిఎ నిష్పత్తి 13.10శాతానికి పెరుగుతుందని పేర్కొంది.
ప్రభుత్వ రంగ బ్యాంకులు అత్యధికంగా రూ.7,34,738 కోట్లు (దాదాపు 73శాతం) రుణాలు మాఫీ చేశాయని ఆర్‌బిఐ తెలిపింది. ''క్రమబద్ధీకరించబడని క్రెడిట్ వాతావరణంలో బ్యాంకులు జారీచేసిన నిబంధనలకు లోబడి తమ బోర్డు ఆమోదించిన విధానాలకు అనుగుణంగా రుణాల వాణిజ్య అంచనా ప్రకారం చెడ్డ రుణాల (బ్యాడ్‌లోన్స్)ను మాఫీ చేయడంతో సహా క్రెడిట్-సంబంధిత నిర్ణయాలను తీసుకోవాలని సూచించినట్టు ఆర్బీఐ తెలిపింది. పెద్ద మొత్తం చేసిన భారీ రుణమాపీలను ఆర్‌బిఐ వెల్లడించలేదు. ''రుణ గ్రహీతల వారీగా రుణమాఫీ గురించి సమాచారం మేం సేకరించలేదు. అందువల్ల దానికి సంబంధించిన డేటా మా వద్ద అందుబాటులో లేదు'' అని తెలిపింది. రుణగ్రస్తుల పేర్లను వెల్లడించకుండానే బ్యాంకులు గత కొన్ని సంవత్సరాలుగా అనేక భారీ రుణాలను రద్దు చేశాయి. గత ఐదేళ్లలో ప్రభుత్వ రంగంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) ఎన్‌పిఎలు రూ.2,04,486 కోట్లు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) రూ.67,214 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.66,711 కోట్లు చేశాయి. ఐసిఐసిఐ బ్యాంక్ రూ.50,514 కోట్లు మాఫీ చేశాయి.

ప్రజల పొదుపు సొమ్ము దోపిడి : సీతారాం ఏచూరి
ప్రజలు జీవితకాలం పొదుపు చేసుకునే సొమ్మును దోచుకుంటున్నారని సిపిఐ (ఎం) కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'గత ఐదేళ్లలో ఆశ్రిత పెట్టుబడిదారులు తీసుకున్న రూ.10 లక్షల కోట్లకుపైగా బ్యాంకు రుణాలను రద్దుచేశారు. బ్యాంకు ఖాతాల్లో ప్రజల పొదుపు సొమ్మును దోచుకుంటున్నారు. మోడీ సన్నిహితుల పేర్లు రహస్యంగా ఉంచారు. సరిగ్గా ఇలానే ఎలక్టోరల్ బాండ్లను రహస్యంగా ఉంచాలని కోరుతున్నారా?' అని ప్రశ్నించారు. ప్రజల జీవితాలను, ఆర్థిక వ్యవస్థను రక్షించడం కంటే ఈ ప్రభుత్వానికి ఎలక్టోరల్ బాండ్లు చాలా ముఖ్యమైనవి' అని విమర్శించారు. 'రుణమాఫీ (రైట్ ఆఫ్) అనేది సాంకేతిక పదమని ప్రభుత్వం చెబుతోంది, అయితే 90 శాతం డబ్బు తిరిగి రావడం లేదు. వాస్తవానికి దేశ ప్రజానీకం డబ్బుతో బడా కార్పొరేట్లు లబ్ది పొందుతున్నారు. ఒక రైతు రుణం చెల్లించకపోతే, ఆ రైతు పేరు అందరికి చెబుతారు. కానీ బడా కార్పొరేట్ చెల్లించకపోతే ఎందుకు చెప్పరు'' అని ఏచూరి ప్రశ్నించారు.











