
- సెప్టెంబర్ 20న జిల్లా కేంద్రాల్లో భారీ సభలు
గత ఇరవై సంవత్సరాల్లో వచ్చిన అనేక కొత్త రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూళ్లు ప్రకటించలేదు. కనీస వేతన చట్టం ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మార్చాలి. కాని ఆ తర్వాత ఐదు సంవత్సరాలకు ఒకసారి జీతాలు మార్చేవిధంగా చట్టాన్ని సవరించారు. 2011 నుంచి నేటి వరకు ఒక్క షెడ్యూల్‌లో కూడా జీతాలు మార్చలేదు. పాలక వర్గాలు నియమించిన కనీస వేతన సలహా బోర్డు ఛైర్మన్లు...పదవులు, సౌకర్యాల రందిలో పడి...కార్మికులను పట్టించుకోవడంలేదని దీన్నిబట్టి స్పష్టమౌతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కనీస వేతనాల సలహా బోర్డును నియమించాలి. కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించడానికి తగిన చర్యలు చేపట్టాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి కనీస వేతనాలు నిర్ణయించిన 70 షెడ్యూల్ రంగాల్లో 50 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. కనీస వేతన చట్టం ప్రకారం రాష్ట్రం లోని ఒకే రంగంలో వెయ్యి మంది కంటే ఎక్కువ కార్మికులు వుంటే వారికి షెడ్యూల్ వేతనాలు ప్రకటించాలి. గత ఇరవై సంవత్సరాల్లో వచ్చిన అనేక కొత్త రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూళ్లు ప్రకటించలేదు. కనీస వేతన చట్టం ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మార్చాలి. కాని ఆ తర్వాత...ఐదు సంవత్సరాలకు ఒకసారి జీతాలు మార్చేవిధంగా చట్టాన్ని సవరించారు. 2011 నుంచి నేటి వరకు ఒక్క షెడ్యూల్‌లో కూడా జీతాలు మార్చలేదు. పాలక వర్గాలు నియమించిన కనీస వేతన సలహా బోర్డు ఛైర్మన్లు...పదవులు, సౌకర్యాల రందిలో పడి...కార్మికులను పట్టించుకోవడంలేదని దీన్నిబట్టి స్పష్టమౌతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కనీస వేతనాల సలహా బోర్డును నియమించాలి. కనీస వేతనం నెలకు రూ.26 వేలు చెల్లించడానికి తగిన చర్యలు చేపట్టాలని సిఐటియు డిమాండ్ చేస్తున్నది.
సర్వసంపదలను సృష్టించేది కార్మికవర్గం. ఎండ వానలో, దుమ్ము ధూళిలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఎత్తైన భవనాలు నిర్మించే కార్మికులు ఇటుకరాయి లాగా రాలిపడి ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రతి సంవత్సరం లక్షలమంది మోటారు రవాణా కార్మికులు నడిరోడ్డుపై విగత జీవులు అవుతున్నారు. యాజమాన్యాలు భద్రత పాటించనందువల్ల ప్రతి పరిశ్రమలో ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఫార్మా, రసాయన క్వారీ, మైనింగ్ రంగాల్లో బ్లాస్టింగ్ పేలుళ్ళలో కార్మికుల దేహాలు ముక్కలౌతున్నాయి. ప్రాణ త్యాగాన్ని మించిన త్యాగం లేదు. సందపను సృష్టించి సమాజం సుఖ సంతోషాల కోసం కార్మిక వర్గం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నది. కానీ పెట్టుబడిదారీ వర్గం కార్మికవర్గం పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. అత్యంత లాభాలు వచ్చే రంగాలతో సహా కార్మికుల పరిస్థితి అధ్వాన్నంగా వుంది. రొయ్యల పరిశ్రమ వార్షిక టర్నోవర్ రూ.57,600 కోట్లు. ఇందులో సగభాగం మన రాష్ట్రానికే వస్తుంది. రొయ్యల కంపెనీల్లో 50 వేల మంది మహిళలు మైనస్ 20 డిగ్రీల శీతల వాతావరణంలో పనిచేస్తారు. కానీ వారికిచ్చే దినకూలి రూ.200 మాత్రమే. బస్ చార్జీలు పెరిగాయి. కానీ జీతాలు పెరగలేదు. మహిళలపై దోపిడీ అన్ని రంగాల్లో తీవ్రంగా వుంది. లాభాలు గడించే సిమెంట్ రంగంలో ధూళి ఎక్కువ. జీతాలు తక్కువ. ఎనిమిది గంటలపాటు నిల్చొని పని చేస్తున్న 'బ్రాండిక్స్' కంపెనీలో మహిళలకు నెలకు రూ.7,898 మాత్రమే జీతం చెల్లిస్తున్నారు. 12 గంటలు పని చేయించుకునే షాపులు, మాళ్లతో సహా కార్మికుల జీతం గొర్రె తోక బెత్తెడు చందంగా వుంది. బలహీన వర్గాలతో హీనమైన పనులు చేయించుకొని అతి స్వల్పమైన జీతాలిస్తున్నారు. షెడ్యూల్ రంగంలో రొయ్యలు, గార్మెంట్లు, షాపులు, మాల్స్, హోటళ్లు, ఆస్పత్రులు, గ్రానైట్, జీడిపప్పు, రోడ్లు, భవన నిర్మాణం, స్పిన్నింగ్, జిన్నింగ్, సిమెంటు, ఫార్మా, రసాయన, ఆటోనగర్‌లు, గ్రోత్ సెంటర్లు, మినీ స్టీల్స్, ఫెర్రో ఎల్లాయిస్, పైపులు, ఆటోమొబైల్, రవాణా తదితర రంగాలు ముఖ్యమైనవి. రాష్ట్రం లోని ప్రతి పరిశ్రమలోను పర్మినెంట్, అనుభవం వున్న కార్మికులను తగ్గించి కాంట్రాక్టు కార్మికులను పెంచడం నేటి ప్రభుత్వ విధానం. కాంట్రాక్టు కార్మికులకు పర్మినెంటు కార్మికుల కంటే 3.4 రెట్లు తక్కువ వేతనాలిస్తున్నారు.
తక్కువ జీతానికి ఎక్కువ కష్టం చేస్తూ కాంట్రాక్టు కార్మికులు బతుకులు ఈడుస్తున్నారు. పని భద్రత లేకుండా కాంట్రాక్టర్లు హైర్ అండ్ ఫైర్ పద్ధతిని అమలు చేస్తున్నారు. రాబోయే కాలంలో అత్యంత దోపిడీ విధానం పేర్లు మార్చుకుని ఫిక్స్‌డ్ టరమ్ ఎంప్లాయిమెంట్ గాను, ఆర్మీలో అగ్నిపథ్ గాను రానుంది.
పెట్టుబడిదారీ విధానం నేడు అత్యంత తీవ్రమైన దోపిడీ పద్ధతులను అనుసరిస్తున్నది. దీనినే క్రోనీ క్యాపిటలిజం అంటాం. కోవిడ్‌ను అడ్డం పెట్టుకొని కార్మికులను కోట్ల సంఖ్యలో పనుల నుంచి తొలగించారు. జీతాలకు కోతలు విధించారు. అధునాతన ఆటోమేషన్ పద్ధతులు అనుసరించి నిరుద్యోగాన్ని పెంచుతున్నారు. విదేశీ, స్వదేశీ బహుళజాతి పెట్టుబడిదారులకు భూములు, భారీ పరిశ్రమలు, గనులు, సముద్ర తీరాన్ని కారుచౌకగా అమ్ముతున్నారు. కాకులను కొట్టి గద్దలకు పెట్టినట్లుగా కార్మికులను దోపిడి చేసి కార్పొరేట్లకు కట్టబెట్టే విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.
షెడ్యూల్ రంగాల్లో పని చేసే కార్మికుల జీతాలు అతి తక్కువ. మరోవైపు ప్రభుత్వ విధానాల వల్ల ధరలు పెరుగుతున్నాయి. ధరలు ఆకాశానికి, జీతాలు పాతాళానికి అన్న చందంగా వుంది పరిస్థితి. మోడీ అధికారంలోకి వచ్చేనాటికి రూ.400 వున్న వంటగ్యాస్‌ను కేంద్ర ప్రభుత్వం రూ.1100కు పెంచింది. పప్పులు, నూనెల ధరలు సంవత్సరంలో రెట్టింపు అయ్యాయి. ధరలు పెరుగుదల వల్ల నిజ వేతనాలు దారుణంగా పడిపోతున్నాయి. ప్రభుత్వం పెంచితే, మేం జీతాలు పెంచుతామని యజమానులు చెబుతున్నారు. ప్రభుత్వం పెంచదు. యజమానులు చెల్లించరు. ఇద్దరూ కుమ్మక్కయి కార్మికులకు ద్రోహం చేస్తున్నారు.
సరళీకరణ విధానాల్లో భాగంగా ''ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' పద్ధతి అమల్లోకి వచ్చింది. ఈ విధానాలు కార్పొరేట్లకు అనుకూలంగాను, కార్మికులపై భారాలు పెంచే విధంగా అమలౌతున్నాయి. కార్మికులపై పెరిగే భారాలకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు తప్పవు. ఆ ఉద్యమాలను అణచడానికి కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్లను త్వరలో అమలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తొందర పడుతున్నాయి. లేబర్ కోడ్‌లు అమలు చేసి కార్మికులతో బానిసలు మాదిరిగా పనులు చేయించుకోవాలనే కుట్ర సాగుతున్నది. చట్టాలు లేనప్పుడే కార్మికవర్గం పోరాడి చట్టాలు సాధించింది. వున్న చట్టాలు మారితే కార్మికరవ్గం చేతులు ముడుచుకొని కూర్చోదు. మరీ ముఖ్యంగా నిజ వేతనాలు దారుణంగా పడిపోతున్న 50 లక్షల మంది షెడ్యూల్ కార్మికులు కదలాలి. అన్ని రంగాల్లోను కార్మికులు భారీ పోరాటాలకు సిద్ధం కావడంలో భాగంగానే...సెప్టెంబరు 20వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో సిఐటియు ఆధ్వర్యంలో భారీ సభలు జరుగుతాయి. యావత్తు కార్మికవర్గం ఈ సభలను జయప్రదం చేయడం నేటి కర్తవ్యం.
/ వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు,
ఎ.పి కనీస వేతన సలహా బోర్డు పూర్వ సభ్యులు /
సిహెచ్. నర్సింగరావు