May 18,2023 15:18
  • ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, శ్రామిక మహిళా సంఘాల డిమాండ్‌

ప్రజాశక్తి- కాకినాడ : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు, బిజెపి పార్లమెంటు సభ్యుడైన బ్రిడ్జ్‌ భూషణ్‌ సింగ్‌ను తక్షణం అరెస్టు చేయాలని కోరుతూ సిఐటియు జిల్లా కార్యాలయంలో దువ్వ శేషబాబ్జి అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, ఐ.ఎఫ్‌.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే.వెంకటేశ్వరరావు, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, అంగన్వాడి వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి రమణమ్మ, ఐ.ఎన్‌.టి.యు.సి జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు, టి.ఎన్‌.టి.యు.సి జిల్లా అధ్యక్షులు గదుల సాయిబాబు మాట్లాడుతూ.. గత 25 రోజులుగా లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న మహిళా రెజ్లర్లను పిలిచి మాట్లాడి సమస్య పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. 39 కేసుల్లో నిందితుడిగా ఉన్న బిజెపి ఎంపీ, రెజ్లర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షులు బ్రిడ్జిభూషణ్‌ సింగ్‌ను తక్షణం అన్ని అధికార, రాజకీయ పదవుల నుండి తొలగించి, సుప్రీంకోర్టు లేదా హై కోర్టు న్యాయమూర్తితో సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన చేస్తున్న రెజ్లర్ల శిబిరం వద్ద విద్యుత్తు పంపిణీ, మంచినీటి సరఫరాను పునరుద్ధరించాలని, ఆందోళనకారుల పట్ల అసభ్యంగా, ప్రమానుషంగా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ప్రజాసంఘాలుగా పెద్ద ఎత్తున ఉద్యమించుతామని హెచ్చరించారు. మెడల్స్‌ సాధించినప్పుడు ఇంటికి పిలిచి మరి ఆతిథ్యం ఇచ్చిన ప్రధానమంత్రి నేడు రెజ్లర్ల సమస్య పట్ల మౌనం వహించడానికి తప్పు పట్టారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం క్రిమినల్‌ రాజకీయ నాయకుడైన బ్రిడ్జ్‌ భూషణ్‌ అరాచకాలపట్ల బిజెపి నాయకత్వం మౌనం వహిస్తుందని విమర్శించారు. గతంలో అసిఫా అత్యాచారం, హత్య సందర్భంగా, ఉన్నావ్‌ ఘటన సందర్బంగా బీజేపీ నాయకులు ముద్దాయిల పక్షం వహించారని గుర్తుచేశారు. ఈనెల 20వ తేదీన ఉదయం 10 గంటలకు రెజ్లర్ల ఆందోళనకు మద్దతుగా కాకినాడ జిల్లా కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక , శ్రామిక మహిళా సంఘాల కార్యకర్తలతో ఆందోళన నిర్వహించాలని తీర్మానం చేశారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్‌ కుమార్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షురాలు నర్ల ఈశ్వరి ,నాయకులు నాగలక్ష్మి , వేణి ,మొగలి బేబి, 108 ఉద్యోగుల సంఘం నాయకులు రమణ, జిజిహెచ్‌ నాయకులు తలుపులమ్మ, ఏఐసిసిటియు నాయకులు నరసరాజు తదితరులు పాల్గొన్నారు.