Dec 07,2022 07:47

           పెద్దల సభగా చెప్పబడే శాసన మండలికి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు చోటుచేసుకోవడం ఆందోళనకరం. రాష్ట్రంలో మూడు పట్టభద్రుల, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు త్వరలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ ఎన్నికలకు తొలిమెట్టు ఓటర్ల నమోదు. ఓటర్లుగా అర్హులైన వారు నమోదైతేనే సరైన వారు ఎన్నికయ్యే అవకాశముంటుంది. ఓటర్ల జాబితాలే అనర్హులతో నిండిపోతే ఇక చట్టసభకు అర్హులైన వారిని ఎన్నుకోవడమెలా సాధ్యం ? గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులను, వాలంటీర్లను మండలి ఎన్నికల్లో భాగస్వాములు చేయరాదని ఎన్నికల కమిషన్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చినా ఓటర్ల నమోదుకు వారిని యథేచ్ఛగా వినియోగించారు. వారిపై ఒత్తిడి చేసి, లక్ష్యాలు నిర్ణయించి అక్రమ ఓటర్లను యథేచ్ఛగా నమోదు చేయించారు.
        శాసనాల రూపకల్పనలో, ఆమోదంలో అసెంబ్లీ వేదికగా జరిగే తొందరపాటును, మందబలంతో పంతం నెగ్గించుకోవాలనే అధికార పార్టీ యత్నాలకు కొన్ని సందర్భాల్లో మండలి చెక్‌ పెడుతుంది. ప్రజాసమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న మేధావులు ఎమ్మెల్సీలుగా ఎన్నికైతే అధికార పార్టీకి వంతపాడే పరిస్థితి ఉండదు. ఇది కంటగింపుగా మారడంతో పాలకవర్గ రాజకీయ పార్టీలు అటువంటి వారు ఎన్నిక కాకుండా చూసేందుకు అన్ని అడ్డదారులు తొక్కుతుంటాయి. అందులో అధికార పార్టీ ముందంజలో ఉంటుంది. ఓటుకు నోటు.. బిరియానీలు, మందు పార్టీలు... ఈ తంతు పంచాయతీ నుంచి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల వరకూ నడిపిస్తున్న పాలక పార్టీలు నేడు మండలి ఎన్నికల్లోనూ సాగిస్తున్నాయి. తొలుత అనర్హులను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు తమ అధికారాన్ని వినియోగిస్తున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో బోధన అంటేనే తెలీని వారిని, పట్టభద్రుల నియోజకవర్గాల్లో పదో తరగతి కూడా పాస్‌ కాని వారిని ఓటర్లుగా నమోదు చేసేస్తున్నారు. కడపలో ఒక ప్రయివేటు పాఠశాలలో 12 మంది ఉపాధ్యాయులుంటే, ఆ పాఠశాల పేరిట 40 మందిని నమోదు చేసెయ్యడం అక్రమాల తీవ్రతకు నిలువెత్తు నిదర్శనం. విశాఖ జిల్లా 210 పోలింగ్‌ బూత్‌లో 1489 మంది ఓటర్లలో ఒకరి పేరు నాలుగు సార్లు, మరొకరి పేరు మూడుసార్లు, 20 మంది పేర్లు రెండు సార్లు చేర్చేశారు. ఓటరు పేరులో స్పెల్లింగ్‌లో ఒక అక్షరం మార్చేసి పలుమార్లు నమోదు చేయడం, అటెస్టేషన్‌ లేకుండా అప్‌లోడ్‌ చేయడం, సర్టిఫికెట్లు మార్ఫింగ్‌ చేయడం... ఇలా అడ్డగోలు తంతుకు అంతే లేకుండా పోతోంది. అనంతపురం, నెల్లూరు డిఇఒల ఆకస్మిక బదిలీ ఇలాంటి అక్రమాలకు సహకరించకపోవడం వల్లేనని విమర్శలు వెల్లువెత్తాయి. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో ఈ నెల 5వ తేదీకి 1,98,695గా ఉన్న ఓటర్లు ఏడో తేదీ సాయంత్రానికి 2,81,301కి, అదే రోజు రాత్రి 12 గంటలకు 4,17,244కు పెరిగిపోయారు. ఇక్కడి ఉపాధ్యాయ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. విశాఖ జిల్లాలోనే తప్పుడు పేర్లున్న 2,163 మంది జాబితాను గుర్తించి, తొలగించాలని ఎన్నికల అధికారులకు పిడిఎఫ్‌ అభ్యర్థి మద్దతు దారులు అందజేశారు. మరోవైపు అర్హులైన పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఓట్లు నమోదు చేయకుండా మొండిచేయి చూపారు. రాజకీయ ఒత్తిళ్లతో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువమంది అర్హులైన ప్రభుత్వ ఉపాధ్యాయుల ఓట్లను తిరస్కరించారనే విమర్శలు సరేసరి. కొన్ని గంటల వ్యవధిలోనే వేలాది ఓట్లు చేర్పించేయడం, అనర్హులకు ఓటు హక్కు కల్పించడం వంటి అక్రమాలు చోటుచేసుకుంటున్నా ఎన్నికల అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో వెరిఫికేషన్‌ చేయాలన్న ప్రజాస్వామిక వాదుల ఆకాంక్షను నెరవేర్చాలి. ఓటర్ల అప్లికేషన్లు, సర్వీసు/డిగ్రీ సర్టిఫికెట్లతోపాటు ఎన్నికల కమిషన్‌ వెబ్‌సైట్‌లో ఉంచితేనే పారదర్శకత. ప్రైవేటు సంస్థల యాజమాన్యాలే బరిలో నిలిచి, అక్రమాలకు పాల్పడుతున్న తరుణంలో అన్ని ప్రైవేటు ఉపాధ్యాయుల, అధ్యాపకుల ఓట్లను పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఇందుకోసం జిల్లాకొక ఐఎఎస్‌ అధికారిని పరిశీలకునిగా నియమించడం అవసరం. ఓటు చాలా విలువైనది. అన్ని విధాల అర్హులకు మాత్రమే ఆ హక్కు దక్కాలి. అనర్హులు ఓటర్లయితే అయోగ్యులు అందలమెక్కుతారు. అది ప్రజాస్వామానికి చేటు.