Nov 08,2023 11:11

ప్రజాశక్తి-పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా, పెద్దదోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లి ఓటరు లిస్టులో జగన్‌ ఫొటోతో ఓటు నమోదైంది. ఆ పంచాయతీలో 571 మంది పురుషులు, 512 మంది మహిళలు కలిపి మొత్తం 1063 మంది ఓటర్లుగా నమోదయ్యారు. అయితే 308 ఓటరుగా నమోదైన జనపతి గురవమ్మ పేరు ఉండగా ఆమె ఫొటో స్థానంలో ముఖ్యమంత్రి జగన్‌ ఫొటో ఉంది. గురవమ్మ కొత్తగా ఆన్‌లైన్‌ ద్వారా ఓటు నమోదు చేసుకున్నారు. ఆమె పరిధిలో బిఎల్‌ఒగా విఆర్‌ఒ ఉన్నారు. ఓటరు జాబితాలో ఆమె స్థానంలో జగన్‌ ఫొటోను చూసి గురవమ్మ కంగుతిన్నారు. ఇలా ఎందుకు జరిగిందని అధికారులను ప్రశ్నించారు. తహశీల్దార్‌ వేణుగోపాల్‌కు ఆమె మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఇది కాస్తా సోషల్‌ మీడియా ద్వారా వైరల్‌ కావడంతో కలెక్టర్‌ ఎఎస్‌ దినేష్‌ కుమార్‌ జరిగిన తప్పిదంపై నివేదిక అందజేయాలని తహశీల్దార్‌ వేణుగోపాల్‌ను ఆదేశించారు. తహశీల్దార్‌ వేణుగోపాల్‌ మాట్లాడుతూ ఫొటో మార్పిడిపై జరిగిన తప్పిదాన్ని విచారించి జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తానని తెలిపారు.