
బావా బావా, ఇండియా ఎంత గొప్ప దేశమో కదా.
అవును బామ్మర్దీ.
పట్టు బావా, మన జండా. పోయి మనమూ రోడ్డు మీద ఊపుదాం జండా.
ఎందుకు బ్రో ఇన్ లా..!!
ఏం బావా అట్లా మాట్లాడతావ్, చంద్రయాన్ చంద్రుడిపై దిగిందిగా, అదీ మనుషుల్లేకుండా.
అవును, నిజంగా గ్రేట్ కదా.
అందుకే బావా, పద, త్వరగా.
వస్తాను గాని దానికి ముందు ఓ మాట చెబుతా వింటావా.
చెప్పు బావా, చంద్రయాన్ గురించే కదా.
అవుననుకో, కానీ వాస్తవాలు ఒప్పుకోవాలి బ్రో ఇన్ లా.
చెప్పు బావా.
ఈ విజయమేమీ మొదటిది కాదు, చివరిదీ కాదు.
అంతేగా.
ఐన్‌స్టీన్, న్యూటన్ అంతటోళ్ళే తమకు ఎక్కువ దూరం కనిపిస్తుందంటే తాము ఇంకొకరి భుజాల మీద ఉన్నామన్నారు మరచిపోయావా.
ఎలా మరచిపోతాను బావా, మరిచిపోయినా నీవు గుర్తు చేస్తావుగా..
అందుకే బ్రోయి, తొందరగా ఎమోషన్లోకి పోవద్దు.
పోను గాని ఒక పక్క మన ప్రధాని ఆఫ్రికా నుండి మన జండా ఊపుతుంటే, ఇంకో పక్క చంద్రయాన్ చంద్రుడిపై దిగుతుంటే టీవీలో చూడాలి బావా.... నా ఎమోషన్ తగ్గడం లేదు బావా.
ఇందాక ఏం చెప్పాను.
మనం ఇంకొకరి భుజాల మీద ఉంటే....
అదే, ఆ మాట మరవద్దు ఎప్పుడూ. అంతా నీవే చేసేసినావని అనుకోవద్దెప్పుడూ.
మరి దీనివల్ల మనకేమీ మంచి జరగలేదంటావా.
ఎందుకు జరగలేదూ, జరిగింది. ఈ విజయం మనందరి విజయం. ప్రపంచ జనాభాలో మొదటిదేశంగా ఉన్న ప్రతి ఒక్క భారతీయునిది.
కరెక్ట్ బావా, భలే చెప్పావ్.
ఇంతసేపూ చెప్పాను కదా, నీకేమర్ధమయింది?
ఏ ప్రధాని ఐనా మొదటి ప్రధాని నెహ్రూ గారి భుజాల మీద ఉన్నట్టే, అంతే కదా.
ఒక విధంగా అంతే. ఇంకా చెప్పాలంటే అందరూ ప్రజల భుజాలపై, శాస్త్రవేత్తల భుజాలపై ఉన్నామని మరువరాదు.
భలే, భలే, బాగా చెప్పావ్
మనకు ప్రత్యేకంగా మంచి ఏమీ జరగలేదంటావా అనడిగావ్ కదా, రెండు జరిగాయి.
ఏమిటా రెండు.
ఒకటి అందరి చేతుల్లో మన జాతీయ జండా రెపరెపలాడుతోంది. ఆ జండాను దూరంగా పెట్టినోళ్ళు కూడా దాని వెనుక దాక్కొని ఉన్నారు.
రెండోది...?
ఆ జండా రెపరెపల్లో ఓట్లు రాలుతున్నాయి, జాగ్రత్తగా కొందరు ఏరుకుంటున్నారు చూడు.
అవును కదా బావా... ఇది చంద్రయాన్ అనుకున్నాను, ఓటుయాన్ అని ఇప్పుడే తెలుస్తోంది.
- జంధ్యాల రఘుబాబు, సెల్:849753298