Jun 21,2022 19:53

ముంబయి :  ప్రముఖ ప్రయివేటు టెలికం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా (విఐ) రూ.500 కోట్ల నిధులు సమీకరించనుంది.  కేంద్రం 5జి స్పెక్ట్రమ్‌ వేలానికి ప్రకటన చేసిన నేపథ్యంలో భారీగా నిధుల సమీకరణకు కంపెనీ బోర్డు నిర్ణయం తీసుకోనుందని సమాచారం.  వోడాఫోన్‌ గ్రూప్‌ సంస్థలకు ప్రాధాన్యత ఆధారంగా ఈక్విటీ షేర్లు లేదా కన్వర్టిబుల్‌ వారెంట్ల ద్వారా రూ. 500 కోట్ల వరకు నిధులను సమీకరించే ప్రతిపాదనను పరిశీలించడానికి బోర్డు బుధవారం సమావేశమవుతుందని విఐ రెగ్యూలేటరీ సంస్థలకు తెలిపింది.  దీంతో రెండు నెలల్లోనే రెండు సార్లు నిధుల సమీకరణకు ఆమోదం తెలిపినట్లవుతుంది.  ఈ ఏడాది మార్చిలో ఇద్దరు ప్రమోటర్ల రూ.4,500 కోట్ల నిధుల సమీకరణను కంపెనీ బోర్దు ఆమోదించింది.  వోడాఫోన్‌ ఐడియాలో వొడాఫోన్‌ గ్రూప్‌ దాదాపు రూ.3,375 కోట్లు పెట్టుబడి పెట్టగా, ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.1,125 కోట్లు పెట్టింది.