ఆమె ఉదయాలకు వర్ణం లేదు
చల్లగా పోగేసుకున్న కలల వెన్నెలలను ఎవరో దోచుకెళ్లారు
నవ్వు ఇంద్రధనువునెవ్వరో విరిచేశారు!
ఊహలవాయువుకి పరిమళం లేదు
మెల్లగా అల్లుకున్న ఆశల
పొదరింటి చుట్టూ పసరికపాముల స్పర్శా చీకటి
పూల నక్షత్రాలను
ఎవరో కోసుకుపోయారు
ఆమె కళ్ళ సాగరానికి
తీరం లేదు
నలువైపులా
చెలియల కట్ట దాటిన
ఆగని దుఃఖ ప్రవాహం
కత్తి పడవలెన్నో గుండెల్ని
తొలుచుకెళుతూనే ఉన్నాయి!
జీవం పోసే ఆ సృష్టిపాటకొక్క కరతాళధ్వనైనా వినిపించదు
చుట్టూ వేళ్ళకు కంటకాలు మొలిచి
ఆ పచ్చని స్వరాన్ని చీల్చుతూనే ఉన్నాయి
ఆ నెత్తుటి వాక్యాలనెత్తుకున్న
నువ్వో అక్షరమై
రేయంతా దుఃఖిస్తావు
తెల్లవారి ఆమె
ఓ నవ్వుల వస్త్రాన్ని కప్పుకొని
పగటిని నడిపిస్తుంది.
ఆ వస్త్రం వెనుక ఆమె
గాయలలా స్రవిస్తూనే ఉంటుంది
రాతిరాతిరీ పీల్చుకున్న ఆమె
ఆఖరి నెత్తుటి బిందువు సాక్షిగా
ఆమె ఉదయ దేహానికో వర్ణం లేదు
పచ్చిగా సలుపుతున్న వ్రణాలు తప్ప!
డి. నాగజ్యోతిశేఖర్
94921 64193










