'హలో.. ఫుడీస్.. వెల్‌కమ్ టు విస్మయి ఫుడ్' అనే స్వీట్ వాయిస్ గృహిణులకు, బాచిలర్స్‌కు, కొత్తగా వంట చేయాలనుకునే వారికి సుపరిచితమే. ఆ వాయిస్ వినగానే అలర్ట్ అయి.. ఆ వాయిస్‌లోని మెలోడినెస్‌కు ఆకర్షితులై.. వంటగది మొహమే ఎరుగని పురుషులు సైతం ఒక్కసారి చేసిచూద్దాం అనుకునేంత హాయిగా ఉంటుందా పలుకు. అసలింతకీ ఎవరిదా గొంతు..? ఏమా కథ? అని చూస్తే.. నోరూరించే వంటలు, వావ్.. అనిపించే విభిన్న ప్రాంత రుచులు, అంతకంటే తేనెలూరే మాటలతో.. మన ముందుకు వచ్చిన.. తెచ్చిన.. తేజా పరుచూరిది గుంటూరు జిల్లా, నరసరావు పేట. తేజా, 2016లో 'విస్మయి ఫుడ్' అనే కుకరీ ఛానెల్‌ను ప్రారంభించారు. తేజా భార్య పేరు శ్వేత, కొడుకు పేరు విస్మరు. బాబు పేరుతోనే ఛానెల్ ప్రారంభించారు. ఇప్పటికి 3.44 మిలియన్స్ సబ్‌స్క్రైబర్స్ హృదయాలను దోచుకుంది ఈ ఛానెల్. పేరుకు తగ్గట్టే వంటలన్నీ విస్మయాన్ని కలిగిస్తాయి. అద్భుతమైన రుచినిస్తాయి. ఎవ్వరైనా సరే సునాయాసంగా నేర్చుకునేందుకు వీలుగా వెబ్‌సైట్ కూడా స్టార్ట్ చేశారు తేజా. పక్కా కొలతలతో.. చేసే విధానం కళ్ళకు కట్టినంత వివరంగా వీడియోలో చెప్పటమే కాక, ప్రజంట్ చేస్తారు. చిన్న చిన్న టిప్స్‌తో అద్భుతమైన రుచిని ఎలా తేవాలో వివరంగా అందిస్తారు. చిన్న టిప్ మిస్ అయినా డిష్ మొత్తం మారిపోతుందంటారు తేజా. పక్కా కొలతలు, టిప్స్‌ను ఫాలో అవటమే విస్మయి ఫుడ్ విజయంగా భావిస్తున్నానంటారీయన. దీనిలో రెస్టారెంట్ స్టైల్, ట్రెడిషనల్ రెసిపీస్, సింపుల్ హోమ్‌ఫుడ్, పండుగలు.. ప్రత్యేక రోజులకు సంబంధించిన వంటలు.. ఒకటేమిటి.. ఏది కావాలంటే ఆ ఐటమ్ విస్మయి ఫుడ్‌లో ప్రత్యక్షమవుతుంది. వాయిస్, రుచికరమైన వంటలు, తక్కువ సమయంలో అందించడం, విజువల్ ఎఫెక్ట్స్ ఛానెల్‌కు అదనపు ఆకర్షణ అయ్యాయి. 2020లో 'కాస్మో ఇండియా ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఆఫ్ ది ఇయర్' అవార్డుని గెలుచుకున్నారు. ఇది కాస్మోపాలిటన్ ఇండియా వారి మ్యాగజైన్ అందించే ప్రసిద్ధ అవార్డు. అంతకుముందు టిక్‌టాక్ షెఫ్ సీజన్ 1, పద్మ మోహన అవార్డులు గెలుచుకున్నారు. తేజా షెఫ్ మాత్రమే కాదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. స్పైడర్‌మాన్ సినిమాలో హీరోకి డబ్బింగ్ చెప్పింది తేజానే. ఆయన తయారీ నుంచి కొన్ని వంటలు ప్రత్యేకంగా ఎలా చేయాలో తెలుసుకుందాం.
- ఉసిరి బిర్యానీ..
కావలసినవి : బియ్యం - కప్పు, ఉసిరికాయలు - 5, ఉప్పు - తగినంత, నీరు - 2 కప్పులు, నువ్వులు - 2 స్పూన్లు, మిరియాలు - 1/2 స్పూను,
తాలింపుకు : ఆవాలు - స్పూను , పచ్చి శనగపప్పు - స్పూను, మినప్పప్పు - స్పూను, వేరుశనగ పప్పు - గుప్పెడు, నువ్వుల నూనె - 5 స్పూన్లు, ఎండుమిర్చి - 2, పచ్చిమిర్చి - 2, జీరా - స్పూను, సాంబార్ పొడి - 4 స్పూన్లు, కరివేపాకు
తయారీ : కుక్కర్‌లో కడిగిన బియ్యం, పసుపు, ఉప్పు, నీరు వేసి హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ రానిచ్చి స్టౌ ఆఫ్ చేయాలి. స్టీమ్ పోయిన వెంటనే మూత తీసి, అన్నాన్ని ఆరనివ్వాలి. నువ్వులు, మిరియాలు దోరగా వేయించి బరకగా పొడి చేసుకోవాలి. ఉసిరి కాయలు తురిమి పక్కనుంచుకోవాలి.
బాండీలో నువ్వుల నూనెతో తాలింపు పెట్టి వేయించాలి. తరువాత కరివేపాకు, సాంబార్‌పొడి వేసి అర నిమిషం పాటు వేపి స్టౌ ఆఫ్ చేయాలి. ఇప్పుడు నువ్వులు-మిరియాల పొడి, ఉసిరి కాయ తురుము తాలింపుకున్న వేడిలోనే రెండు నిమిషాలు వేయించాలి. ఈ తాలింపును ఉడికించుకున్న అన్నానికి బాగా కలిపి, సర్వ్ చేసుకోవడమే. అంతే ఘుమఘుమలాడే ఉసిరి అన్నం రెడీ.
- నిమ్మకాయ కారం..
కావలసినవి : నిమ్మరసం - 125 మి.లీ., పసుపు - స్పూను. ఉప్పు - 4 స్పూన్లు, కారం - 100 గ్రా., పచ్చిమిర్చి - 6, ఆవాలు - 2 స్పూన్లు, మెంతులు - స్పూను
తయారీ : ముందుగా మెంతులు, ఆవాలు దోరగా వేయించి, మెత్తని పొడి తయారుచేసుకోవాలి. ఒక వెడల్పు గిన్నెలో నిమ్మరసం, కారం, ఉప్పు, ఆవాలు+మెంతి పొడి, పసుపు, మధ్యకు చీల్చిన పచ్చిమిర్చి అన్నింటినీ బాగా కలిపి, శుభ్రంగా ఉన్న జాడీలో పెట్టుకోవాలి. అంతే పుల్లపుల్లగా ఎంతో రుచిగా ఉండే నిమ్మకారం రెడీ. ఈ కారానికి నిమ్మ రసానికి బదులు దబ్బకాయ రసం కూడా వాడుకోవచ్చు.
- ఉలవచారు..
కావలసినవి : ఉలవలు - కప్పు, నీరు - 2 లీ., ఉప్పు - తగినంత, కారం - 2 స్పూన్లు, పసుపు - 1/2 స్పూను, చింతపండు - 75 గ్రా., వేయించిన మెంతి, జీలకర్ర పొడి - స్పూను, బెల్లం - 30 గ్రా.
తాలింపుకు : నూనె - , ఆవాలు - స్పూను, ఎండుమిర్చి - 2, పచ్చి శనగపప్పు -కొద్దిగా, వెల్లుల్లి - 6, కరివేపాకు - 2 రెబ్బలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి.
తయారీ : ఉలవలు రాళ్లేమీ లేకుండా ఏరి, పది సార్లు కడిగి నీటిలో 16 గం.ల పాటు నానబెట్టాలి. కుక్కర్‌లో ఆ నీటితో సహా లో ఫ్లేమ్ మీద 20 విజిల్స్ (దాదాపు 40 ని.) వచ్చేంత వరకూ ఉడికించి, ఆవిరి పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి, వడకట్టాలి. మెంతులు, జీలకర్ర దోరగా వేయించి, పొడి చేసుకోవాలి. బాండీలో నూనె వేడిచేసి ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి తరుగు, కరివేపాకు వేయాలి. వెల్లుల్లి ఎర్రగా అయ్యేంత వరకూ వేయించాలి. తరువాత ఉల్లి తరుగు, పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లి ముక్కలు లేత గులాబీ వర్ణంలోకి వచ్చేంత వరకూ వేయించాలి. దానిలో ముప్పావు కప్పు చింతపండు గుజ్జు పోసి, కలుపుతూ నూనె పైకి తేలేంత వరకూ ఉడకనివ్వాలి. పులుసు మరిగిన తర్వాత కారం, పసుపు వేసి వేగనిచ్చి ఉలవకట్టు, మెత్తని ఉలవల పేస్ట్ బాగా కలిసేలా కలిపి, సన్నని సెగ మీద ఉడికించాలి. ఒక పొంగు వచ్చిన వెంటనే మెంతి, జీలకర్ర పొడి, బెల్లం వేసి చిక్కబడేంత వరకూ కలుపుతూ ఉడికించాలి. దీనికి మరలా ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుతో తాలింపు పెట్టి, చారు పైన చిలికిన పాల మీగడ గార్నిష్ చేసి, సర్వ్ చేయడమే. ఎంతో రుచిగా ఉండే ఇంట్లోనే తయారైన ఉలవ చారు రెడీ.