
ఇది ఎవరో విలేకరి విషయమే అనుకుంటే సాక్షాత్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విషయంలోనూ ఇదే అప్రజాస్వామిక పోకడలు ప్రదర్శించారు బిజెపి పరివార్ నేతలు. భారత దేశం మైనార్టీల హక్కుల రక్షణ గురించి జాగ్రత్త వహించాల్సి వుంటుందని ఒబామా అనడం బిజెపి భరించలేకపోయింది. నేనే బైడెన్ స్థానంలో వుంటే ఈ సమస్యను తప్పక ప్రస్తావించేవాడినని కూడా ఒబామా అన్నారు. వెంటనే పరివార్ రంగంలోకి దిగింది.
ఒబామా అయినా సిద్దిఖి అయినా ప్రైవేటు వ్యక్తులుగానే మాట్టాడారు తప్ప అమెరికా తరపున కాదు. తమకు ఇబ్బంది కలిగింది గనకనే కనీస దౌత్య మర్యాదలు కూడా పాటించక ఒబామాపై విరుచుకుపడటం బిజెపి ద్వంద్వనీతికి అద్దం పడుతుంది. కొంత కాలం కిందట బిబిసి ఆనాటి గుజరాత్ పరిస్థితిపై డాక్యుమెంటరీ ప్రసారం చేసినప్పుడు కూడా మోడీ సర్కార్ ఇలాగే దాడి చేసింది. దానిపై నిషేధం విధించి మనకు ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ పట్ల గౌరవం లేదని చాటుకుంది. ఎన్‌డి టి.వి, వైర్ వంటి వాటితో సహా మీడియా సంస్థలపై ఎలా ఒత్తిడి సాగిందీ అందరికీ తెలుసు. అది ముదిరి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరిందన్నమాట.
ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన ఏదో అసాధారణ సందర్భమైనట్టు ప్రచారం జరిగింది. అమెరికా స్టేట్ విజిట్ (ప్రభుత్వ పర్యటన)కు ఆహ్వానించడం అరుదైన గౌరవంగానూ మీడియా హైప్ ఇచ్చింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం అది విశేషం కావచ్చు గాని అదేదో ప్రపంచానికే ప్రతిష్ట అన్నట్టు చెప్పడం కన్నా హాస్యాస్పదమైన విషయం మరోటి వుండదు. అధికార అనధికార పర్యటన, కార్యక్రమ పర్యటన, కార్యక్రమ సహిత అధికార పర్యటన ఇన్ని వుంటాయట. వాస్తవానికి మొదటి రెండింటిలో అన్నీ కలసి వున్నాయి. కాని ప్రపంచాధిపత్య రాజకీయాలలో అమెరికా అనేక వ్యవహారాలు జరపడానికి వీలుగా అధ్యక్షుడికి మట్టి అంటకుండా ఇన్ని రకాలు నిర్ణయించారు. అధ్యక్షుడు ఆహ్వానిస్తేనే అది రాజ్య పర్యటన. ఇంతవరకూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ లను మాత్రమే బైడెన్ ఆహ్వానించారట. అంటే మోడీకి ఎంత ప్రాధాన్యత అన్నది ఆనందం. అదెంత దూరం వెళ్లిందంటే మొదటిసారి శ్వేత సౌధం తలుపులు తనను పిలిచాయని ప్రధాని కూడా పరవశంగా ట్వీట్ చేసేంత! నిజానికి ఇండియా వంటి చరిత్ర, ప్రతిష్ట కలిగిన దేశాధినేత మరో దేశానికి వెళ్లి అంతగా ఆనందోత్సాహాలు వెలిబుచ్చడం దేనికి నిదర్శనమవుతుందో చెప్పనవసరం లేదు. మర్యాదలకింద వదిలేద్దాం. ఈ పర్యటన ఫలితాలేమిటి, భారత దేశం అమెరికా ధృతకాష్ట్ర కౌగిలిలో చిక్కుకోవడం ఎటు దారితీస్తుంది...ఇదివరకే ప్రజాశక్తి వ్యాసాలలో వివరంగా ప్రస్తావించబడింది. కాగా విశ్వగురుగా మనకు మనం చెప్పుకుంటున్న విశ్వవేదికపై మన ప్రజాస్వామ్యం పట్ల ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతోంది అనేది మీడియాలో అంతగా చర్చకు నోచుకోని మరో కోణం.
మస్క్ నోట కూడా...
ఏదో సామెత చెప్పినట్టు ఇండియా పట్ల ప్రపంచ దేశాల తాజా అంచనా ఎలా వుందో మోడీ వైట్‌హౌస్ చేరకముందే తెలిసిపోయింది. పారిశ్రామికవేత్తలు వరస కట్టి ఆయనను కలుసుకుంటున్నారని పెద్ద హంగామా చేశారు. వారిలో ఒకరైన విపరీత వాణిజ్యవేత్త ఎలన్ మస్క్ 'టెస్లా' కార్ల కంపెనీ ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నారన్న వార్త బాగా ప్రచారంలో పెట్టారు. మస్క్ మోడీని కలుసుకున్నాక మీడియాతో మాట్లాడుతూ ప్రశంసలతో ముంచెత్తారు. అయితే 'మీ యాజమాన్యం లోని ట్విటర్‌పై మోడీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుందట కదా...' అని విలేకరులు అడిగితే సమాధానం దాటేశారు (రైతాంగ నిరసనలపై ట్విటర్ ఇవ్వడం పట్ల కేంద్రం అభ్యంతరాలు తెల్పిందనీ వాటిని తొలగించవలసి వచ్చిందని ట్విటర్ బాధ్యుడైన ఆయన అంతకు ముందు ప్రకటించి వున్నారు). మళ్లీ మళ్లీ అడిగినపుడు ఏ దేశంలోనైనా అక్కడి చట్టాల ప్రకారమే పని చేస్తుంటామని దాటవేత సమాధానమిచ్చారు.
ఇక స్టేట్ విజిట్ లేదా రాజ్య పర్యటనలో అదనపు ఆకర్షణ లాంఛనాలే. వాటిలో స్వాగతాలు, విందులతో పాటు ఉమ్మడిగా మీడియా గోష్టి నిర్వహించడం ముఖ్యమైంది. అసలు అమెరికా తన వ్యూహాలకు లోబడి వుండే వారికే ఈ ఆహ్వానం అందిస్తుంది. మన దేశం కోణంలో చూస్తే ప్రధానిగా మోడీ మీడియాతో మాట్లాడటం, ప్రశ్నలకు స్పందించడం ఇంతవరకూ తెలియని విషయం. ఆయన ఇండియాలో వుండగా ఎందుకు మీడియాను పిలవకుండా తిరుగుతారో కూడా స్పష్టమైపోయింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా టీవీ ఇంటర్వ్యూలను పూర్తిగా బహిష్కరించడం కూడా ఇందుకే. 'చరిత్ర అడక్కు. చెప్పింది విను' చందంగా తన మన్‌కీ బాత్ వినిపించడం తప్ప జన్ కీ బాత్ వినడం ఆయన నిఘంటువు లోనే వుండదు. కనక ఆయన అమెరికాలో ముఖాముఖి విలేకరులతో మాట్లాడటం పెద్ద వార్తయింది.
మైనార్టీల మాటేంటి మోడీజీ ?
మళ్లీ వైట్‌హౌస్‌కు వస్తే మీడియా గోష్టిలో సబ్రీనా సిద్దిఖి అనే మహిళా జర్నలిస్టు ప్రశ్న ఆయనకూ సంఘ పరివారానికి బొత్తిగా మింగుడు పడలేదు. నిజానికి మోడీ పర్యటనకు ముందే వైట్‌హౌస్ తాము అధికారికంగా మైనార్టీల పరిస్థితిపై మోడీతో మాట్లాడనున్నట్టు స్పష్టం చేశారు. మాట్లాడారు కూడా. 'వాల్‌స్ట్రీట్ జర్నల్'కు చెందిన సిద్దిఖి ఇండియాలో మైనార్టీల పరిస్థితుల గురించి వారిపై వివక్ష గురించి మోడీని నేరుగా అడిగారు. భావ ప్రకటనా స్వేచ్ఛను ఎలా కాపాడతారని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అందరూ సమానమేననీ, భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నందున మతపరమైన వివక్షకు అవకాశమే లేదని అందుకే బైడెన్ తనతో అదే అన్నారని మోడీ సమర్థనతో బయిటపడ్డారు, ప్రజాస్వామ్యం మా డిఎన్‌ఎలో వుందన్నారు. ఇవన్నీ సూక్తులే తప్ప ఆమె ప్రశ్నకు సమాధానాలు కాదు. ఇదంతా ఒక ఎత్తయితే తర్వాత జరిగిన ప్రహసనం మరో ఎత్తు. సిద్దిఖి అలా ప్రశ్నించినందుకు ఆమెపై సంఘపరివారీయులు ట్రోలింగ్స్ మొదలెట్టారు. ఆమె ఉద్దేశపూర్వకంగానే ఈ అంశం లేవనెత్తారని దాడి చేశారు. బిజెపి ఐ.టి విభాగం బాధ్యుడైన అమిత్ మాలవీయ ట్వీట్ చేస్తూ మోడీ ఆమె దురుద్దేశాన్ని తుత్తునియలు చేశారని పొగడ్తలు గుప్పించారు. ఇవన్నీ భరించలేని సిద్దిఖి 2011లో బారత క్రికెట్ టీమ్ విజయం సాధించినప్పుడు ఆ డ్రస్సు వేసుకుని తండ్రితో కలసి కేరింతలు కొడుతున్న తన చిన్నప్పటి ఫోటో ఒకటి ట్వీట్ చేశారు. కొన్నిసార్లు ఫోటోలే ఎక్కువ విషయాలు చెబుతాయని వ్యాఖ్య జోడించారు. మరోవంక వైట్‌హౌస్‌లో జరిగిన గోష్టిలో ప్రశ్న వేసిన వారినే ఇలా వెంటాడి వేధించడం అమెరికా లోనూ విమర్శలకు గురైంది. చివరకు అక్కడి ఉన్నతాధికారి జాన్ కిర్బీని మోడీ పర్యటన ముగిశాక జరిగిన గోష్టిలో ఆమెను అదే పత్రిక ప్రతినిధి ఈ విషయమై అడిగినపుడు మీడియా గోష్టిలో దీనిపై తమ అసమ్మతి ప్రకటించారు. ప్రశ్నించిన వారిని ఇలా వెంటాడటం సరైంది కాదని స్పష్టం చేశారు. ఆమెతో పాటు పత్రికా వ్యవహారాల కార్యదర్శి కెరెన్ జీన్ పిర్రే కూడా వేధింపులను ఖండించారు
ఒబామా అయితే మాకేంటి ?
ఇది ఎవరో విలేకరి విషయమే అనుకుంటే సాక్షాత్తూ అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా విషయంలోనూ ఇదే అప్రజాస్వామిక పోకడలు ప్రదర్శించారు బిజెపి పరివార్ నేతలు. డెమోక్రటిక్ పార్టీ నాయకుడూ తొలి నల్లజాతి అధ్యక్షుడు అయిన ఒబామా ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పరిపాటి. మోడీ ప్రధాని అయిన కొత్తలో వచ్చిన ఒబామా మత సామరస్యం గురించి, ఆర్భాటాలకు దూరంగా వుండాల్సిన అవసరం గురించి చెప్పడం గుర్తుండే వుంటుంది. మోడీని నరేంద్ర అనీ, బరాక్ అని పిలుచుకునేంత చనువు వారి మధ్య ఏర్పడిందని అప్పట్లో చెప్పేవారు. భారత దేశం మైనార్టీల హక్కుల రక్షణ గురించి జాగ్రత్త వహించాల్సి వుంటుందని ఒబామా అనడం బిజెపి భరించలేకపోయింది. నేనే బైడెన్ స్థానంలో వుంటే ఈ సమస్యను తప్పక ప్రస్తావించేవాడినని కూడా ఒబామా అన్నారు. వెంటనే పరివార్ రంగంలోకి దిగింది. ఒబామా ఆఫ్రికన్ ముస్లిం మూలాలు గలవాడు కావడం వారి కోపాన్ని రెట్టింపు చేసింది. ఇటీవలి కాలంలో చవకబారు వ్యాఖ్యలకు మారుపేరుగా మారిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ 'హుసేన్ గనక ఇలా చేయడంలో ఆశ్చర్యమేమీ లేద'ని ఆయనను మత కోణంలో అవహేళన చేస్తూ ట్వీట్ పెట్టారు. వాస్తవంలో ఒబామా క్రైస్తవుడే గాక వారి మతాచారాలు పాటిస్తారు! శర్మ తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరింత తీవ్రంగా సుదీర్ఘంగా ఇదే విషయమై దాడి చేశారు. ఒబామా హయాంలో అమెరికా ఏ ముస్లిం దేశాలపై దాడి చేసిందీ ఏకరువు పెట్టారు. వాస్తవానికి ఆ సమయంలో భారతదేశం లేదా బిజెపి అందుకు అభ్యంతరం చెప్పిందేమీ లేకపోగా అమెరికా నాయకత్వంలో టెర్రరిజంపై పోరాటంలో పాల్గొనాలని వత్తాసు పలికింది. బిన్ లాడెన్ వంటి వారికి అమెరికానే అండగా నిల్చిన విషయం మర్చిపోయింది. డోనాల్డ్ ట్రంప్ హయాంలోనైతే మోడీ ఎంతగా చెట్టపట్టాలేసుకుందీ ఎవరూ మర్చిపోరు. ఆఖరుకు ఒకరికొకరు ఎన్నికల ప్రచారంలోనూ సహకరించుకున్నంత పనిచేశారు. ట్రంప్‌కు మద్దతు పలకడంలో మోడీ మామూలు దౌత్య మర్యాదలను కూడా దాటిపోవడం అమెరికాలోనూ విమర్శకు గురైంది. అలాంటి ప్రభుత్వంలో కీలక మంత్రిగా వున్న నిర్మలా సీతారామన్ ఇప్పుడు మాత్రం వాటన్నిటినీ గుర్తు చేస్తూ 'మా వ్యవహారాలలో మీ జోక్యం ఏమిట'ని రెచ్చిపోయారు. ఆరు ముస్లిం దేశాలపై దాడి చేసిన అమెరికా మాకు మైనార్టీల గురించి చెప్పడమేమిటని రెచ్చిపోయారు. అంతటితో ఆగక ప్రతిపక్షాలనూ జత చేశారు. తాము కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టి కష్టపడుతుంటే ప్రతిపక్షాలు సరైన సమస్యలపై పోరాడలేక అమెరికా మాజీ అధ్యక్షుడితో కలసి ఈ అప్రధానమైన అంశం ఎత్తుకున్నారని వాపోయారు. దేశంలో ప్రభుత్వాన్ని మార్చడం కోసం పాకిస్తాన్‌తో చేతులు కలిపాయని, విదేశీ టూల్‌కిట్లు దిగుమతి చేసుకుంటున్నారనీ కాంగ్రెస్‌పై తీవ్ర ఆరోపణ చేశారు. రాజ్‌నాథ్ సింగ్ వంటి సీనియర్ మంత్రి కూడా ఇదే పాట పాడటం గమనించదగింది.
కళ్లు మూసుకున్న పిల్లి
ఒబామా అయినా సిద్దిఖి అయినా ప్రైవేటు వ్యక్తులుగానే మాట్లాడారు తప్ప అమెరికా తరపున కాదు. తమకు ఇబ్బంది కలిగింది గనకనే కనీస దౌత్య మర్యాదలు కూడా పాటించక ఒబామాపై విరుచుకుపడటం బిజెపి ద్వంద్వనీతికి అద్దం పడుతుంది. కొంత కాలం కిందట బిబిసి ఆనాటి గుజరాత్ పరిస్థితిపై డాక్యుమెంటరీ ప్రసారం చేసినప్పుడు కూడా మోడీ సర్కార్ ఇలాగే దాడి చేసింది. దానిపై నిషేధం విధించి మనకు ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ పట్ల గౌరవం లేదని చాటుకుంది. ఎన్‌డి టి.వి, వైర్ వంటి వాటితో సహా మీడియా సంస్థలపై ఎలా ఒత్తిడి సాగిందీ అందరికీ తెలుసు. అది ముదిరి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరిందన్నమాట. రాహుల్ గాంధీ లేక గతంలో మన్మోహన్ సింగ్ వంటి వారు విదేశాల్లో ఏదో మాట్లాడితే దేశ ప్రతిష్ట దెబ్బ తిని పోయిందని గగ్గోలు పెట్టిన ఈ దేశభక్తులు విశ్వగురువులమంటూనే వికృత వివాదాలు ఎలా పెంచుతున్నదీ దేశంలో తమ నడవడి ద్వారా ప్రతిష్టను దెబ్బ తీస్తున్నదీ దాచిపెట్టాలని చూస్తున్నారు. కానీ వారెన్ని తంటాలు పడినా ప్రజాస్వామ్య ప్రమాణాలు ఘోరంగా దెబ్బ తింటున్నాయని ప్రపంచం గమనిస్తున్నదని ఈ సందర్భాలు స్పష్టం చేస్తున్నాయి. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టు కపట నాటకమాడుతున్న మోడీ తదితరులు ఇప్పటికైనా ఈ అప్రజాస్వామిక పోకడలు విరమించితే దేశానికి శ్రేయస్కరం. నిర్మలా సీతారామన్ విమర్శ చేసేవరకూ ఒబామా వ్యవహారం పెద్దగా ప్రచారమివ్వమని మోడీ అనుకూల బడా మీడియాకు కూడా ఇది గుణపాఠమే.
తెలకపల్లి రవి