Oct 19,2022 07:15

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వున్నప్పుడే భూమి ఆక్రమణలకు గురైంది. ల్యాండ్‌ ట్యాంపరింగ్‌ అయింది. ఆ సందర్భంగానే సిట్‌ను వేసి దర్యాప్తు చేశారు. మరలా వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి రాగానే మరో సిట్‌ వేసి దర్యాప్తు చేశారు. ఈ రెండు సిట్‌ ల నివేదికలను నేటికీ ఎందుకు బహిర్గతం చేయడంలేదు? నాడు చంద్రబాబు, నేడు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాలు భూ కబ్జాదారులను కాపాడే పనిలో నిమగమయ్యాయనేది జగమెరిగిన సత్యం. ఈ భూముల కుంభకోణంలో అధికార, ప్రతిపక్ష పార్టీ పెద్దలందరూ భాగస్వాములుగా ఉన్నారు కాబట్టే నివేదికలు బయటకు రానివ్వకుండా పరస్పరం సహకరించుకుంటున్నారు.

           పరిపాలనా రాజధాని ప్రకటనకు ముందు, తరువాత విశాఖలో భూకబ్జాదారుల ఆగడాలు విపరీతంగా పెరిగాయి. ఇటీవల కాలంలో భూకబ్జాలలో రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల బంధం మరింత పెనవేసుకుంది. అది వైసిపి లేదా టిడిపి ఏ పార్టీ అధికారంలో వున్నా భూ దోపిడీ యథేచ్ఛగా సాగిపోతోంది. బిల్డర్లు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు రాజకీయ నాయకుల అవతారం ఎత్తి తమ వ్యాపారాలను మూడు పువ్వులు, ఆరు కాయలుగా అభివృద్ధి చేసుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా భూ కుంభకోణాలకు నిలయంగా మారింది. రాజకీయ నాయకులు ప్రజల ఆస్తులను కొల్లగొడుతూ తమ ఆస్తులు, బంధువుల ఆస్తులు పెంచుకొనే పనిలో నిమగమై వున్నారు. తీగ లాగితే డొంక కదిలినట్లు ఉమ్మడి విశాఖలో ఒక్కొక్కటిగా భూ కుంభకోణాలు బయటకొస్తున్నాయి. చివరకు భూ కుంభకోణాలు పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తలు చూసి లోకాయుక్త సుమోటోగా తీసుకుందంటేనే భూ కబ్జాలు ఏ స్థాయిలో జరిగాయో మనం అర్ధం చేసుకోవచ్చు. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికార పార్టీ పెద్దలే కబ్జాలు చేస్తున్నారు. ప్రభుత్వరంగ కేంద్రంగా, ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖలో భూ కబ్జాదారులు స్వాహా చేసిన భూముల వివరాలు క్లుప్తంగా పరిశీలిద్దాం.
 

                                                                        రుషికొండ విధ్వంసం

విశాఖలో రుషికొండ పర్యాటకులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతం. గతంలో ఈ కొండ చుట్టూ టూరిజం డిపార్టుమెంట్‌ ఆధ్వర్యంలో అనేక రిసార్టులు నడిచాయి. పచ్చని ప్రకృతి నిలయాలుగా ఉన్న ఈ రిసార్టులు దేశ, విదేశాల నుంచి వచ్చిన పర్యాటకులకు ఎంతో ఆహ్లాదాన్ని అందించేవి. నేడు ఈ పచ్చని కొండలను తవ్వి పర్యావరణ విధ్వంసానికి కారకులయ్యారు. ఈ కొండల విధ్వంసంపై హైకోర్టు అనేక దఫాలు హెచ్చరించినా రాష్ట్ర ప్రభుత్వం, భూకబ్జాదారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీనిని పరిశీలించడానికి వచ్చిన హైకోర్టు ప్రముఖ న్యాయవాది కె.ఎస్‌.మూర్తిపై అక్రమ కేసులు బనాయించారు. కొండల విధ్వంసం కొనసాగుతూనే వుంది. అదే రుషికొండ స్వర్ణభారతి నగర్‌ సర్వే నెంబర్‌ 17/1, 2, 5 లో ఆర్థికంగా వెనుకబడిన ఈడబ్ల్యుఎస్‌ స్కీం కింద 400 మందికి 60 గజాల చొప్పున లేఅవుట్లు వేసి రాష్ట్ర ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. వీటితో పాటు పార్కులు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలకు కేటాయించిన భూమి సుమారు 1.5 ఎకరాలు కబ్జాకు గురైంది.
 

                                                      దసపల్లా భూములు ప్రభుత్వానివి కావట !

దసపల్లా భూములు ప్రభుత్వ భూములు కావని స్వయానా ఎం.పి విజయసాయిరెడ్డి చెబుతున్నారు. అత్యంత ఖరీదైన ఈ 15 ఎకరాల భూముల విలువ సుమారు రూ.2000 కోట్లు. దసపల్లా భూముల యజమానులుగా చెప్పుకుంటున్న 64 మంది ఒకే మాటపై వచ్చి తమకు 29 శాతం వాటా, బిల్డర్‌కు 71 శాతం అని అంగీకరించారు. దసపల్లా భూములు సీలింగ్‌ భూములు. సీలింగ్‌ భూములంటేనే ప్రభుత్వ భూములు. ప్రభుత్వ భూములు కానప్పుడు దశాబ్దాలుగా ప్రభుత్వం ఎందుకు కోర్టులు చుట్టూ తిరిగింది? ఆ భూములకు 22(ఎ)గా ఎందుకు ప్రకటన చేసింది? సుప్రీం కోర్టు తీర్పు ఆ భూములను భూ యజమానులకు కట్టబెట్టాలని చెప్పిందా? తీర్పు రాకముందే దసపల్లా భూములకు సంబంధించి 22(ఎ)ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎత్తివేసింది? దశాబ్దాలుగా ఈ భూములు కొనుగోలు చేసిన యాజమాన్యాలు ఏదోరకంగా సమస్య పరిష్కారం అయితే మంచిదని భావించిన తరుణంలో ఎష్యూర్‌ ఎస్టేట్స్‌ డెవలపర్స్‌ ఎల్‌ఎల్‌సి సంస్థతో ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారు? 22 (ఎ) భూముల సమస్య ఒక్క విశాఖ లోనే కాదు, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో వుంది. ఆ ప్రాంతాల్లో 22 (ఎ) ఎత్తివేయకుండా దసపల్లా భూముల విషయంలోనే ఎందుకు ఎత్తివేసి ఇంత ప్రేమ చూపించారు? ఇతర భూములలో వున్న వారు ప్రజలు కాదా? దసపల్లా భూముల వ్యవహారం ఇలా వుంటే...విశాఖ ఎం.పి కూర్మన్నపాలెంలో నిర్మిస్తున్న భారీ వెంచరు కథ మరోలా వుంది. భూ యజమానులకు కేవలం 1 శాతం మాత్రమే వాటా ఇచ్చి తమ డెవలప్‌మెంట్‌ వాటాగా 99 శాతం తీసుకున్నారు. ప్రజాసేవకు అంకితం అవ్వాల్సిన ఎంపీలు ప్రజల ఆస్తులను లూటీ చేయడం ఎంతవరకు సమంజసం !
 

                                                             దబ్బంద గ్రామ భూములు స్వాహా

ఆనందపురం మండలం, మామిడిలోవ పంచాయతీ దబ్బంద గ్రామం సర్వే నెంబర్‌ 23లో 1970వ దశకంలో ప్రభుత్వం 120 మంది పేదలకు 80 ఎకరాల సాగు కోసం భూమిని కేటాయించింది. 2015లో ప్రభుత్వం టిడ్కో ఇళ్ల కోసం దళితులు, గిరిజనులైన వీరి నుండి ఈ భూమిని తిరిగి ల్యాండ్‌ పూలింగ్‌ చేసింది. వీటిలో 66 ఎకరాలను టిడ్కో ఇళ్లు మరియు అర్బన్‌ హౌసింగ్‌ కోసం కేటాయించారు. మిగతా 14 ఎకరాలను ఒక బడా వ్యక్తి స్వాధీనం చేసుకొని తోటలు వేసుకొని అనుభవిస్తున్నాడు. వీటితోపాటు సర్వే నెంబర్‌ 10లో ఉన్న నరసింహ చెరువును ఆక్రమించి సుమారు 6.8 ఎకరాల్లో జీడి, మామిడి, కొబ్బరి తోటలు వేశాడు. సర్వే నెంబర్‌9/1, 12/4,13/1,13/2,14/2లో సుమారు 12.50 ఎకరాల భూమి ఈ పెద్దమనిషి కబ్జాÛ లోనే ఉన్నది. ఇవి దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులకు చెందిన భూములు.
 

                                                               కుసులవాడ భూములపై పెద్దల కన్ను


ఆనందపురం మండలం కుసులవాడలో 1970వ దశకంలో ల్యాండ్‌ సీలింగ్‌ మిగులు భూమి సుమారు 43 ఎకరాలు సర్వే నంబరు 98, 108లో ఎస్‌సి, బిసిలు 43 కుటుంబాలకు ప్రభుత్వం కేటాయించింది. పద్మనాభం, శొంఠ్యాం ప్రాంతాల మధ్య ఉన్న ఈ భూమి విలువ సుమారు రూ. 100 కోట్లు ఉంటుంది. వీటిపై అధికార పార్టీ పెద్దల కన్ను పడింది. పేదలను బెదిరిస్తూ ల్యాండ్‌ పూలింగ్‌కు పథకం వేశారు. పేదలను లొంగదీసుకొని ఎకరాకు రూ.13 లక్షల చొప్పున చెల్లించి భూములు లాక్కోవాలని చూస్తున్నారు.
 

                                                     బయ్యవరం భూముల బలవంతపు కొనుగోళ్లు

ప్రస్తుత అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరం రెవెన్యూ పరిధి లోని విస్సన్నపేట పరిసర ప్రాంతాల్లో సుమారు 500 ఎకరాల డీపట్టా, అసైన్డ్‌ భూములను రైతుల నుండి బలవంతంగా కొనుగోలు చేయడమే కాకుండా ఈ భూముల చుట్టూ ఉన్న వాగులు, ఇతర ప్రభుత్వ భూములు కూడా ఆక్రమించారు. అక్కడున్న కొండలను కూడా అక్రమంగా తవ్వేశారు. సర్వే నెంబరు 624లో రెండు కొండల మధ్య ఉన్న వాగును పూడ్చేశారు. ఆ ప్రాంతంలో 403 ఎకరాల భూమిలో 230 మౌంట్‌ విల్లాలు పేరుతో రిసార్ట్స్‌ నిర్మించాలనే లక్ష్యంతో భూ వ్యాపారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ భూముల్లో అనేక అక్రమాలు జరిగాయని నాడు ఆర్డీవో, గనులశాఖ ఏ.డి, తహశీల్దార్‌, ఇనాం తహశీల్దార్‌ గుర్తించారు. అందులో నీటి వాగులు, గోర్జీలు వంటివి కూడా కబ్జాకు గురి అయ్యాయని తెలియజేశారు. అసలు అసైన్‌మెంట్‌ చట్టం ప్రకారం ఆ భూములకు సంబంధించి ఎటువంటి అమ్మకాలు, కొనుగోలు జరపరాదు. దీనికి భిన్నంగా విస్సన్నపేటలో జరిగిందని, రాజకీయ నాయకుల ప్రమేయం వుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు.
 

                                                           రెండు సిట్‌ నివేదికలు బహిర్గతం చేయాలి

గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వున్నప్పుడే విశాఖ అర్బన్‌, రూరల్‌ మండలాలు, భీమిలి, ఆనందపురం, పెందుర్తి, గాజువాక, పెదగంట్యాడ, సబ్బవరం, పరవాడ, అనకాపల్లి ప్రాంతాల్లో 1 లక్ష 6 వేల 239 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైంది. ల్యాండ్‌ ట్యాంపరింగ్‌ అయింది. మాజీ సైనికుల భూములకు జిల్లా కలెక్టర్లు ఎన్‌ఒసిలు ఇచ్చారనే కథనాలు వచ్చాయి. ఆ సందర్భంగానే సిట్‌ను వేసి దర్యాప్తు చేశారు. మరలా వైఎస్‌ఆర్‌సిపి అధికారంలోకి రాగానే మరో సిట్‌ వేసి దర్యాప్తు చేశారు. ఈ రెండు సిట్‌ ల నివేదికలను నేటికీ ఎందుకు బహిర్గతం చేయడంలేదు? నాడు చంద్రబాబు, నేడు జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వాలు భూ కబ్జాదారులను కాపాడే పనిలో నిమగమయ్యాయనేది జగమెరిగిన సత్యం. ఈ భూముల కుంభకోణంలో అధికార, ప్రతిపక్ష పార్టీ పెద్దలందరూ భాగస్వాములుగా ఉన్నారు కాబట్టే నివేదికలు బయటకు రానివ్వకుండా పరస్పరం సహకరించుకుంటున్నారు. డి-ఫామ్‌ పట్టా భూములకు ఎంత రక్షణ ఉందో ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు కేటాయించే భూములకు అన్ని నిబంధనలూ ఉన్నాయి. అయినప్పటికీ రాష్ట్ర రెవెన్యూ మంత్రి సిఫార్సుతో ఎన్‌ఓసిలు ఇచ్చి భూములు అమ్మకాలు, కొనుగోళ్ళు జరిగాయని రెవెన్యూ మంత్రిపై ఆరోపణలు ఎదుర్కొంటు న్నారు. అనేకచోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు బినామీలతో భూములు అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారు. కబ్జాలకు గురైన భూముల వివరాలను రెండు సిట్‌ కమిటీలకు సిపిఎం ఆధారాలతో సహా ఇచ్చింది. పారదర్శకత కోసం రోజూ మాట్లాడే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి చిత్తశుద్ధి వుంటే వెంటనే రెండు సిట్‌ నివేదికలను బహిర్గతం చేస్తే భూ కబ్జాదారులెవరో ప్రజలకు అర్ధమౌతుంది. ఉమ్మడి విశాఖ నగరానికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్‌ పూలింగ్‌లో కూడా అనేక భూబాగోతాలకు పాల్పడ్డారు.
           ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న విశాఖ నేడు భూ బకాసురుల కంబంధ హస్తాల్లో చిక్కుకొని వుంది. దాని నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై వుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూములను పరిరక్షించే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కబ్జాకోరుల చేతుల్లో చిక్కుకుపోయిన పేదల భూములన్నింటినీ తిరిగి పేదలకు అప్పగించాలి.

/వ్యాసకర్త :సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు/
కె.లోకనాథం

కె.లోకనాథం