
అదానీకి విశాఖ స్టీల్‌ను కట్టబెడితే నేడు వున్న ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి. అతి ఆధునీకరణ, రోబోట్లను ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. మనుషులు లేకుండా సెన్సార్లలో వాహనాలు నడుపుతారు. అందుకే ప్రైవేట్ అంటే ప్రమాదం. ప్రైవేట్ వారు ఎవరైనా లాభాల కోసమే కంపెనీలు నడుపుతారు. ప్రభుత్వ రంగంలాగా వీరికి ప్రజల పట్ల బాధ్యత ఉండదు. రిజర్వేషన్లు వుండవు. బిజెపి నూతన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రభుత్వ రంగాన్ని అమ్మడం మా విధానం అంటూనే 'విశాఖ స్టీల్ ఎక్కడికీ పోదు' అని వాదిస్తున్నారు. అమ్మితే విదేశీ కంపెనీ చేతిలోకి వెళ్తుందని తెలియదా? విదేశీ కంపెనీలకు అమ్మడమేనా బిజెపి, ఆర్.ఎస్.ఎస్ దేశభక్తి? అందుకే 'ప్రైవేట్‌కు విశాఖ స్టీల్‌ను అమ్మం' అని ప్రకటించే వరకూ ఈ పోరాటం కొనసాగుతుంది.
కేంద్ర బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నూరు శాతం అమ్మాలని 27-01-21న నిర్ణయించింది. ఆనాడు గుర్తింపులో వున్న సిఐటియు యూనియన్ అన్ని కార్మిక సంఘాలు, కాంట్రాక్టు కార్మిక సంఘాలు, ఆఫీసర్స్ అసోసియేషన్‌ను కలుపుకొని 'విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ'ని ఏర్పాటు చేసింది. పోరాట కమిటీ ఆధ్వర్యంలో 900 రోజుల నిరంతర పోరాట ఫలితంగానే నేటికీ ఒక్క శాతం వాటాలు అయినా అమ్మకుండా అడ్డుకోగలిగాం. ఒకసారి రెండు రోజుల సమ్మె, రెండుసార్లు ఒకరోజు సమ్మెలు, రెండుసార్లు రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించి శాంతియుతంగా 900 రోజుల పోరాటాన్ని విజయవంతం చేశాం. ఐక్య పోరాటం ద్వారానే విశాఖ స్టీల్‌ను అమ్మకుండా అడ్డుకోగలమని రుజువు చేశాం.
పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల మద్దతు కూడగట్టాం. బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీల సభ నిర్వహించాం. జాతీయ ట్రేడ్ యూనియన్ నాయకులను రప్పించి కార్మికులను చైతన్యపరిచాం. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో చారిత్రాత్మక పోరాటం జరుపుతున్న 'సంయుక్త కిసాన్ మోర్చా' ముఖ్య నాయకులతో విశాఖ బీచ్‌లో 'కార్మిక-కర్షక శంఖారావం' నిర్వహించాం. ప్రతి సభలోను 20 వేల మందికి తక్కువ కాకుండా కార్మికులు, ప్రజలు పాల్గొన్నారు. పది వేల మందితో 10 కి.మీల మానవహారం, స్టీల్‌ప్లాంట్ ఎడ్మిన్ల ముట్టడులు, విద్యార్థుల 5 కి.మీ వాకింగ్, మహిళల దీక్షలు, ర్యాలీలు వంటివి జరిపారు. ఢిల్లీలో జరిగిన రెండు రోజుల ధర్నాలో దేశంలోని అన్ని ప్రతిపక్ష పార్టీలు పాల్గొని విశాఖ స్టీల్ పోరాటానికి మద్దతు పలకడం విశేషం. స్థానిక పోరాటాలు ఇంకా అనేకం జరిగాయి. అన్నింటిని మించి 900 రోజులు విశాఖ స్టీల్‌ప్లాంట్ మెయిన్ గేట్ వద్ద, విశాఖ నగరం నడిబొడ్డున గాంధీ విగ్రహం వద్ద నిరాహార దీక్షలు...కోవిడ్ కాలమైనా, ఎండైనా, వానైనా జరపడం ఒక చారిత్రాత్మక విశేషం. అందుకే 30.7.23న వడ్డే శోభనాధ్రీశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్మిక-కర్షక రాష్ట్ర సదస్సులో జాతీయ నాయకులు హన్నన్ మొల్లా, మేధా పాట్కర్, వెంకట్ సహా జాతీయ రైతు నాయకులంతా విశాఖ స్టీల్ పోరాటాన్ని కొనియాడారు.
రాష్ట్రంలోని అధికార వై.ఎస్.ఆర్ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు 25 మంది పార్లమెంట్ సభ్యులున్నారు. ఇద్దరూ కలిసి విశాఖ స్టీల్‌కు స్వంత గనులు ఎందుకు ఇవ్వరూ అని ఒక్కరోజైనా పార్లమెంట్‌ను స్థంభింపచేశారా? అదే చేసి వుంటే కేంద్ర బిజెపి ప్రభుత్వం విశాఖ స్టీల్ అమ్మకాన్ని ఎప్పుడో ఆపి వుండేది. జనసేన పార్టీ రెండుసార్లు భారీ సభలు పెట్టింది. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసింది లేదు. పోరాట కమిటీ నిర్ణయించిన కార్యక్రమాలకు రాజకీయ పార్టీల మద్దతు కోరాం. సిపియం, సిపిఐ, వామపక్షాలు మాత్రం ఆది నుంచి ప్రైవేటీకరణకు వ్యతిరేకం. రాష్ట్ర ప్రజల్లో స్టీల్‌ప్లాంట్ పోరాటానికి అనుకూలంగా బలమైన సెంటిమెంట్ వుంది. రాష్ట్ర ప్రజల్లో తమ పార్టీపై వ్యతిరేకత రాకుండా వుండడానికి అనేక పార్టీలవారు ఇక్కడ నటిస్తున్నారని కార్మికులు భావిస్తున్నారు. అందుకే వారిపై ఆధారపడకుండా అకుంఠిత దీక్షతో సమరశీల పోరాటం కొసాగించాలని పోరాట కమిటీ నిర్ణయించింది.
విశాఖ స్టీల్‌ప్లాంట్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం. 32 మంది త్యాగధనుల బలిదాన ఫలితం. దేశంలోనే పోరాటం ద్వారా సాధించుకున్న ఏకైక భారీ పరిశ్రమ. ఆనాడు 52 మంది ఎమ్మెల్యేలు కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రతిపక్షాలన్నీ కలిసి విద్యార్థుల ఆధ్వర్యంలో జరిగిన మహత్తర పోరాటం ఇది. కమ్యూనిస్టుల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు, నందికొండ నాగార్జునసాగర్ కోసం జరిపిన భారీ పోరాటాలతోనే నేడు రాష్ట్రంలో భారీ పరిశ్రమ, భారీ సాగునీటి ప్రాజెక్టులు సాధించుకోగలిగాం. కానీ, నేడు ఎ.పి లో ఉన్న భారీ పరిశ్రమను విదేశీ 'పోస్కో' కంపెనీకి చౌకగా కట్టబెట్టాలనే కేంద్ర బిజెపి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ పోరాటం సాగుతున్నది. దేశంలోని 'భారీ పరిశ్రమలన్నీ అమ్మేస్తాం. లేకపోతే మూసేస్తాం' అని ప్రధానమంత్రి మోడీ బరితెగించి ప్రకటించారు. దేశ సంపదను విదేశీ, స్వదేశీ బడా పెట్టుబడిదారులకు అమ్మే హక్కు మోడీకి ఎవరిచ్చారు? రైతులు త్యాగాలతో భూములిచ్చారు. గత 75 సంవత్సరాలలో కార్మికుల కష్టార్జితంతో భారీ పరిశ్రమలు అభివృద్ధి చెందాయి. స్వాతంత్య్రం వచ్చేనాటికి విద్యుత్‌గాని, రసాయనిక ఎరువులుగాని, పురుగు మందులుగాని లేవు. సోషలిస్టు దేశాల సహాయంతో నాటి ప్రభుత్వం అభివృద్ధి చేసింది. భారీ పరిశ్రమలను ఆధునిక దేవాలయాలుగా నెహ్రూ కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వం కావాలని విశాఖ స్టీల్ ఉత్పత్తి 40 శాతం తగ్గించింది. 2020-21 సంవత్సరంలో విశాఖ స్టీల్‌కు రూ.948 కోట్లు లాభాలొచ్చాయి. ముడిసరుకులకు డబ్బులు ఉంచకుండా లాభాలన్నీ అప్పులకు చెల్లించారు. ఉత్పత్తి తగ్గించడానికి ఇదొక నాటకం. ఉత్పత్తి తగ్గించడం వల్ల 2022-23 విశాఖ స్టీల్‌కు రూ.1,000 కోట్ల విలువైన కోకింగ్ కోల్‌ను గంగవరం పోర్టులో మూడు రోజులుంచారు. విశాఖ స్టీల్‌ను బలహీనం చేయాలని బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. 1980 లోనే విశాఖ స్టీల్‌ప్లాంట్ స్వంత పోర్టు కోసం గంగవరం, దిబ్బపాలెం గ్రామాల వారి భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. కానీ, టిడిపి, వైఎస్‌ఆర్ ప్రభుత్వాలు రెండూ ఆ భూములను ప్రైవేట్‌కు అప్పగించారు. డివియస్ రాజు మెడపై కత్తిపెట్టి గంగవరం పోర్టును అదానీ లాక్కొన్నాడు. రాష్ట్ర ప్రభుత్వ వాటా 10.5 శాతం జగన్‌మోహన్ రెడ్డి హారతి పళ్లెంలో పెట్టి అదానీకి అప్పగించారు. విశాఖ స్టీల్‌ను కబ్జా చేయడం కోసమే గంగవరం పోర్టును అదానీ లాక్కొన్నాడని ఇప్పుడు ఎవరికైనా అర్థం అవుతుంది. 'క్విట్ మోడీ, క్విట్ అదానీ' మన నినాదం.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 16 వేల మంది పేద రైతులు 20 వేల ఎకరాల భూములిచ్చారు. వీరు నిజమైన త్యాగధనులు. విశాఖ స్టీల్ వచ్చి 35 సంవత్సరాలైనా నేటికీ సగం కుటుంబాలవారికి ఉద్యోగాలే రాలేదు. అదానీకి విశాఖ స్టీల్‌ను కట్టబెడితే నేడు వున్న ఉద్యోగాలు కూడా ఊడిపోతాయి. అతి ఆధునీకరణ, రోబోట్లను ఉత్పత్తిలో ఉపయోగిస్తారు. మనుషులు లేకుండా సెన్సార్లలో వాహనాలు నడుపుతారు. అందుకే ప్రైవేట్ అంటే ప్రమాదం. ప్రైవేట్ వారు ఎవరైనా లాభాల కోసమే కంపెనీలు నడుపుతారు. ప్రభుత్వ రంగంలాగా వీరికి ప్రజల పట్ల బాధ్యత ఉండదు. రిజర్వేషన్లు వుండవు. బిజెపి నూతన రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రభుత్వ రంగాన్ని అమ్మడం మా విధానం అంటూనే 'విశాఖ స్టీల్ ఎక్కడికీ పోదు' అని వాదిస్తున్నారు. అమ్మితే విదేశీ కంపెనీ చేతిలోకి వెళ్తుందని తెలియదా? విదేశీ కంపెనీలకు అమ్మడమేనా బిజెపి, ఆర్.ఎస్.ఎస్ దేశభక్తి? అందుకే 'ప్రైవేట్‌కు విశాఖ స్టీల్‌ను అమ్మం' అని ప్రకటించే వరకూ ఈ పోరాటం కొనసాగుతుంది.
మోడీ అధికారంలోకి రాకుంటేనే విశాఖ స్టీల్‌ను కాపాడుకోగలం. అదానీని గంగవరం పోర్టు నుంచి గెంటివేస్తేనే విశాఖ స్టీల్ పబ్లిక్ సెక్టారుగా వుంటుంది. ఖాళీగా వున్న 5 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలి. విశాఖ స్టీల్‌కు స్వంత గనులు ఇవ్వాలి. విశాఖ స్టీల్‌ను పూర్తి సామర్థ్యంతో నడపాలి.
(వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు)
సిహెచ్.నర్సింగరావు