Sep 07,2022 06:42

విశాఖ స్టీల్‌ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని, సెప్టెంబర్‌ 9న విశాఖ లోని కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ భారీ పరిశ్రమల్లో నిరసన తెలపాలని విశాఖ ఉక్కు పోరాట కమిటీ పిలుపునిచ్చింది. మూడు రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు భారీ ఉద్యమం నేడు మనకు దిక్సూచిగా ఉంది. రైతు ఉద్యమం తరువాత ప్రభుత్వ రంగాన్ని అమ్మకుండా అడ్డుకోవడంలో విశాఖ స్టీల్‌ పోరాటం అగ్రభాగన వుంది. వివిధ రూపాల్లో గత 20 మాసాల నుంచి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ధీటుగా ఎదుర్కొంటున్నది. ప్రకటనలే తప్ప కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా అడ్డుకుంటున్నది. విశాఖ స్టీల్‌ ఆస్తులను అంచనా వేయడానికి నియమించిన కమిటీలను విశాఖ స్టీల్‌ గేటు లోకి కూడా రాకుండా పోరాట కమిటీ సవాల్‌ చేస్తున్నది.
      కోవిడ్‌ను అడ్డం పెట్టుకొని-కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన విశాఖ స్టీల్‌, విశాఖ పోర్టు, హిందుస్థాన్‌ పెట్రోలియం, షిప్‌యార్డు, భేల్‌, ఎన్‌.టి.టి.సి లు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రైల్వే, రక్షణ రంగాలతో సహా హోల్‌సేల్‌గా అమ్ముతాం. ఎవరూ కొనకపోతే మూసివేస్తాం-అని 2020 బడ్జెట్‌ సమావేశాల్లో బిజెపి ప్రభుత్వం తరపున నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దేశాభివృద్ధికి, ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి మూల స్థంభాలుగా తోడ్పడి స్వయం సమృద్ధిని సాధించిన ఈ భారీ పరిశ్రమలను ఎందుకు అమ్ముతారు? ప్రైవేటు పరిశ్రమలన్నీ తమ లాభాలకే పరిశ్రమలను ఉపయోగించు కున్నాయి. సమర్ధవంతమైన మారుతీ కంపెనీని జాపాన్‌ 'సుజికీ'కి అమ్మడం వల్ల లాభాలు జపాన్‌కు వెళ్తున్నాయి.
      కార్పొరేట్ల కోసమే బిజెపి, ఆర్‌యస్‌యస్‌ లు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాయనేది ముమ్మాటికి వాస్తవం. సుమారు రూ. 40 లక్షల కోట్ల విలువైన భారీ పరిశ్రమలను కార్పొరేట్లకు కారుచౌకగా కట్ట బెట్టడానికి దూకుడుగా తప్పుడు విధానాలను బిజెపి అమలు చేస్తున్నది. మూడు లక్షల కోట్ల పైన విలువైన విశాఖ స్టీల్‌ను దక్షిణ కొరియాకు చెందిన పోస్కోకు కట్టబెట్టడానికి సిద్ధపడింది. పర్మినెంట్‌, కాంట్రాక్టు కార్మికులు, ఆఫీసర్లు ఒక్కటై నేటి వరకు ఒక్క శాతం వాటాను కూడా అమ్మకుండా అడ్డుకోగలిగారు.
      బిజెపి కేంద్రంలో మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు... ప్రభుత్వ రంగ నష్టాలు, పరిశ్రమ అసమర్ధత వగైరా కారణాలు పైకి చెప్పినా...నేడు పరిశ్రమలు అమ్మేందుకు బరితెగిస్తున్నది. దేశ సంపదను విదేశీ, స్వదేశీ బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతున్నది. అన్నింటికీ ఒకటే మంత్రం ప్రయోగిస్తున్నది. స్వాతంత్య్రానంతరం 75 సంవత్సరాల పాటు అశేష త్యాగాలతో నిర్మించిన ఆధునిక దేవాలయాల వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర బిజెపి ప్రభుత్వం ధ్వంసం చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గపు విధానాల్ని అడ్డుకోవటానికి కార్మికుల ముందున్న మార్గం ఒక్కటే. సమైక్య పోరాటాలతో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకుండా అడ్డుకోవడం. రైల్వే, రక్షణ రంగాలలో ప్రైవేటు, ఔట్‌సోర్సింగ్‌ విధానాలను అడుగడుగునా అడ్డుకోవడం, ఎల్‌.ఐ.సి వాటాల అమ్మకానికి గండికొట్టడం. బ్యాంకింగ్‌ విలీనాలను తుంగలో తొక్కడం ఒక్కటే మార్గం. దేశ సంపదైన భారీ పరిశ్రమలు, గనులు, సముద్ర తీరంతో సహా అమ్మడమే బిజెపి ఏకైక కార్యక్రమం. బిజెపి పైకి చెప్పేది ఆత్మనిర్భర భారత్‌. ఇది దేశభక్తి నినాదం. గాంధీజీ 'స్వదేశీ ఉద్యమం'తో సమానం. కాని చేసేది దానికి పూర్తిగా భిన్నం. విదేశాలకు మన దేశాన్నే తాకట్టు పెట్టడం. లేదా అదాని, అంబానీలకు అప్పగించడం.
     కార్మిక సంఘాలు విడివిడిగా తమ పరిశ్రమల్లో పోరాడుతున్నాయి. గత సంవత్సరం బ్యాంకింగ్‌ ఉద్యోగులు, ఆఫీసర్లు కలిసి నాలుగు రోజులపాటు సంపూర్ణ సమ్మెలు చేశారు. అన్ని రంగాల్లోను పోరాటాలు సాగుతున్నాయి. విడివిడిగా జరిగే పోరాటాలను కేంద్ర బిజెపి పట్టించుకోవడం లేదు. రైతాంగ పోరాటమే నేడు మనకు స్ఫూర్తి. 550 సంఘాలు కలిసి ఏక తాటిపైకి వచ్చి ఒకే సంఘటనగా ఏర్పడ్డాయి. లక్షలాది మంది హైవే లోనే గుడారాలు వేసుకొని సంవత్సరం పైగా నిరంతర పోరాటం చేశాయి. ప్రధాని మోడీ దిగి వచ్చి మాఫ్‌కీజియే (క్షమించండి) అని దణ్ణం పెట్టి మూడు రైతు చట్టాలను పూర్తిగా విరమించేటట్లు చేసి బిజెపి కేంద్ర ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్పాయి.
       అందుకే 2022 సెప్టెంబర్‌ 9వ తేదీన విశాఖపట్నం లోని అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమలైన రైల్వే, రక్షణ రంగం, ఇన్సూరెన్స్‌తో సహా ఒకేసారి నిరసన తెలపాలని కార్మిక సంఘాలన్నీ నిర్ణయించాయి. ఐక్య పోరాటాలు ఉధృత స్థాయిలో చేయడం విశాఖ నుంచే ఆరంభించాయి. ఇదే విశాఖ స్టీల్‌ ఉద్యమంలో మరో మలుపు. ఇంతేగాకుండా ఏ పరిశ్రమలో ఆందోళన జరిగినా మిగిలిన అన్ని పరిశ్రమల్లో సంఘీభావంగా ఆందోళనలు చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది. 'విశాఖ పోర్టు' అన్ని పరిశ్రమలకు తల్లి లాంటిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోనే పరిశ్రమల అభివృద్ధికి కీలకం విశాఖ పోర్టు. ఎగుమతి, దిగుమతులకు సహజ పోర్టుగా వున్నందునే భారీ పరిశ్రమలైన విశాఖ స్టీల్‌తో సహా విశాఖపట్నంలో ఏర్పడ్డాయి. విశాఖనగరం, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తోడ్పడింది. కాని పోర్టులోని బెర్తులన్నింటిని ప్రైవేటుకు అప్పగించి ల్యాండ్‌లార్ట్‌ పోర్టుగా మార్చాలని కేంద్ర బిజెపి నిర్ణయించింది. పోర్టు హాస్పటల్‌ ప్రాంతాన్ని ప్రైవేటు మాల్స్‌కు అప్పగించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఈ నిర్ణయానికి ఎదురొడ్డి నిలవాలని, తల్లి లాంటి విశాఖ పోర్టును రక్షించుకోవాలని విశాఖ ప్రజలకు సిఐటియు పిలుపునిస్తున్నది. యావత్‌ కార్మికులు, ప్రజలు, యువకులు ఐక్యంగా పోరాడటమే నేటి తక్షణ కర్తవ్యం.

/ వ్యాసకర్త : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ /
సిహెచ్‌. నరసింగరావు

Visakha-Steel-is-another-turning-point-in-the-movement