Sep 30,2022 07:01

రైల్వే జోన్‌ భవన నిర్మాణాలకు సుమారు రూ. 300 కోట్లు అవసరమని ప్రారంభంలో అంచనా వేసి ఆ తర్వాత రూ. 176 కోట్లకు తగ్గించారు. 2020-21 బడ్జెట్‌లో ఈ నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కాని ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో దీని ప్రస్తావనే లేదు. కేవలం రూ.40 లక్షలు మాత్రమే కేటాయించారు. దీన్నిబట్టే విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ఎడల
బిజెపి చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లమౌతున్నది.

రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా ప్రకటించిన విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు సాధ్యం కాదని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారం, చట్టంలో రెండు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలుపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ప్రకటించినట్లు వార్తలొచ్చాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు లాభదాయకం కాదని, అందుకే డి.పి.ఆర్‌ ను కూడా రైల్వే బోర్డు ఆమోదించలేదని పేర్కొన్నట్లు పత్రికలు తెలియజేశాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క ఈ వైఖరిపై ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమయ్యింది. దీంతో కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించాల్సి వచ్చింది. పత్రికల్లో వచ్చిన వార్తలు ఊహాగానాలేనని, విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెలియ జేయాల్సి వచ్చింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు కోసం ఓఎస్‌డీ ఇచ్చిన నివేదికపై ప్రస్తుతం సమీక్ష్ష జరుగుతున్నట్లు తూర్పు కోస్తా రైల్వే జోన్‌ కూడా ప్రకటన చేసింది. ఇలా రైల్వే జోన్‌ విషయంలో కేంద్రం పరిపరి విధాల ప్రకటిస్తోంది.
          కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశ ఎజెండాలో రైల్వే జోన్‌ అంశం లేదని, పత్రికల్లో వచ్చిన వార్తలన్నీ కట్టుకథలని వైసిపి అధికార ప్రతినిధి విజయసాయిరెడ్డి కొట్టిపారేశారు. సమావేశ ఎజెండాలో విశాఖ రైల్వేజోన్‌ అంశం లేకపోవటాన్ని గొప్పగా చెప్పుకోవటం సిగ్గుచేటు. ఎజెండాలో ఈ అంశం లేకపోతే పట్టుబట్టి చేర్చి ఎప్పటిలోగా రైల్వేజోన్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తారో నిలేసి తగిన సమాధానం రాబట్టి ఉండాల్సింది. పైపెచ్చు రైల్వేజోన్‌ రాకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రజలను మభ్యపెట్టటానికి ఇదో నాటకం. కనీసం రైల్వే జోన్‌ ఇప్పటికీ ఏర్పడకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని ఒక్క మాట కూడా మాట్లడలేదు. రేపో మాపో రైల్వేజోన్‌ రాబోతున్నట్లు బీరాలు పలికి బిజెపి ఎడల ప్రభుభక్తిని చాటారు.
విశాఖ రైల్వే జోన్‌పై పత్రికల్లో వచ్చిన వార్తలను కేంద్ర రైల్వే మంత్రి, వైసిపి ప్రభుత్వం కొట్టిపారెయ్యెచ్చు. వాస్తవంగా జరుగుతున్న తంతేమిటి? మూడున్నరేళ్ల క్రితం విశాఖ రైల్వే జోన్‌ను ప్రకటించారు. కాని గడిచిన కాలంలో రైల్వే జోన్‌ సత్వర ఏర్పాటుకు బిజెపి ప్రభుత్వం అవసరమైన చర్యలు ఉద్దేశ్యపూర్వకంగా తీసుకోలేదు. జోన్‌ ప్రకటించిన తరువాత కూడా పలుమార్లు కొత్తగా రైల్వేజోన్ల ఏర్పాటు లేదని పార్లమెంటులో ప్రకటనలు చేశారు. విశాఖ రైల్వే జోన్‌ కార్యాలయాల నిర్మాణానికి అవసరమైన భూమి లేదని కొంతకాలం, ఇటీవల ఈ జోన్‌ లాభదాయకం కాదనే విష ప్రచారానికి కూడా పూనుకున్నారు.
         ఎట్టకేలకు జోన్‌ ఏర్పాటు పర్యవేక్షణ పేర ఓఎస్‌డి (ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ)ని నియమించారు. డి.పి.ఆర్‌ (డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్ట్‌) తయారు చేశారు. ఇది జరిగి రెండేళ్లు పూర్తయ్యింది. నేటికీ డి.పి.ఆర్‌ ను రైల్వేబోర్డు ఆమోదించలేదు. రైల్వే బోర్డే ఇప్పటికీ డి.పి.ఆర్‌ ను ఆమోదించకపోతే కేబినెట్‌ ఎప్పుడు ఆమోదిస్తుంది? అమలు ఎప్పుడు ప్రారంభమౌతుంది? ఈ ప్రశ్నల పరంపర గత రెండేళ్ల నుండి కొనసాగుతూనే ఉంది. డి.పి.ఆర్‌ తో సంబంధం లేకుండానే విశాఖ రైల్వే జోన్‌ కార్యకాలాపాలు ప్రారంభించొచ్చు. దీనికి ఎటువంటి ఆటంకాలు లేవు. కాని ప్రభుత్వం ఇందుకు సిద్ధం కావటంలేదు. జోన్‌ ఆపరేషన్‌ లోకి ఎప్పటి నుండి వస్తుందో కూడా చెప్పడంలేదు.
         రైల్వేజోన్‌ భవన నిర్మాణాలకు సుమారు రూ. 300 కోట్లు అవసరమని ప్రారంభంలో అంచనా వేసి ఆ తర్వాత రూ. 176 కోట్లకు తగ్గించారు. 2020-21 బడ్జెట్‌లో ఈ నిధులను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కాని ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో దీని ప్రస్తావనే లేదు. కేవలం రూ.40 లక్షలు మాత్రమే కేటాయించారు. దీన్నిబట్టే విశాఖ రైల్వే జోన్‌ ఏర్పాటు ఎడల బిజెపి చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లమౌతున్నది.
విశాఖ కేంద్రంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ బిజెపి దయాదాక్షిణ్యమేమి కాదు. గత 5 దశాబ్దాల నుండి ఉత్తరాంధ్ర ప్రజలు దీని కోసం పోరాడుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్ర పునర్విభజన చట్టంలో భాగంగా సెక్షన్‌ 93 షెడ్యూల్‌ 13(8) ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి రైల్వే జోన్‌ ఇవ్వాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఆరు నెలల్లోగా దీనిపై చర్య తీసుకోవాలని కూడా చట్టంలో పొందుపర్చారు. కాని బిజెపి ఐదేళ్లపాటు రైల్వే జోన్‌ ప్రకటించడానికి నిరాకరించింది. పైపెచ్చు సాకులు, అబద్ధాలు, అసత్యాలు రైల్వే జోన్‌పై ప్రచారం చేసింది.
రైల్వే జోన్‌ ఇవ్వటానికి చట్టంలో సరిగా పేర్కోలేదని, కొంతకాలం ఒడిషా ప్రభుత్వం ఒప్పుకోవడంలేదని మరికొంత కాలం, కమిటీ వేశామని ఇలా నాలుగేళ్లు ప్రకటనలు చేస్తూ కాలం వెళ్లబుచ్చింది. చివరికి సాంకేతిక పరంగా జోన్‌ ఏర్పాటు లాభదాయకం కాదని నిపుణుల కమిటి తేల్చిందని, అందువల్ల విశాఖ రైల్వే జోన్‌ సాధ్యం కాదని ప్రకటించింది. బిజెపి యొక్క ఈ కుట్రపూరిత వైఖరికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం, ఆంధ్రలో బిజెపి నామరూపాలు లేకుండా పోతుందనే భయంతో లోక్‌సభ ఎన్నికలకు ముందు అనగా 2019 ఫిబ్రవరిలో నరేంద్ర మోడీ విశాఖ ఎన్నికల పర్యటనకు రెండు రోజుల ముందు అప్పటి రైల్వే మంత్రి పియూష్‌ గోయల్‌ రైల్వే జోన్‌ ప్రకటించారు.
         ప్రకటించిన రైల్వే జోన్‌లో సైతం బిజెపి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దగా చేసింది. విశాఖ కేంద్రంగా ఏర్పడే రైల్వే జోన్‌కు ఆయువు పట్టుగా ఉండే వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ను రద్దు చేసింది. విభజన చట్టంలో జోన్‌ని ఏర్పాటు చేయమన్నారే గాని ఉన్న డివిజన్‌ను రద్దు చేయమనలేదు. దీనికి విరుద్ధంగా మోడీ ప్రభుత్వం వ్యవహరించింది. రైల్వే వ్యవస్థలో జోన్లు ఎంత ముఖ్యమో డివిజన్లు కూడా అంతే కీలకం. డివిజన్‌ పరిధిలో అభివృద్ధి, స్టేషన్లు, రైళ్ల రాకపోకలు, నిధుల ఖర్చు మొత్తం పరిపాలనలో డివిజన్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే రైల్వే జోన్‌ కేంద్రాలున్న ఎక్కువ చోట్ల డివిజన్‌ కేంద్రాలు కూడా ఉన్నాయి. నేడు దేశంలో 17 రైల్వే జోన్లు, వీటిల్లో అంతర్భాగంగా 68 రైల్వే డివిజన్లు ఉన్నాయి. నూతనంగా ప్రకటించిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ 18వ జోన్‌ అవుతుంది. అయితే కొత్తగా జోన్‌ ఏర్పాటుచేసిన ప్రతి సందర్భంలో కూడా జోన్‌ ప్రధాన కేంద్రంలో ఉన్న రైల్వే డివిజన్‌ను కొనసాగించారు. జోన్‌ వచ్చిందని జోన్‌ కేంద్రంలో ఉన్న డివిజన్‌ను ఎక్కడా రద్దు చేయలేదు. దీనికి విరుద్ధంగా మోడీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను ఆశించి వాల్తేరు డివిజన్‌ను రద్దు చేసి అత్యధిక భాగాన్ని కొత్తగా ప్రకటించిన రాయగఢ్‌ డివిజన్‌లో కలిపేశారు.
వాల్తేర్‌ రైల్వే డివిజన్‌ దేశంలో ఎక్కువ ఆదాయం పొందుతున్న డివిజన్లలో నాల్గవ స్థానంలో ఉంది. గతేడాది సుమారు రూ. 8500 కోట్లు ఆదాయం ఆర్జించింది. విశాఖ రైల్వే జోన్‌లో వాల్తేర్‌ డివిజన్‌ ఉన్నట్లు అయితే దేశంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ అగ్రస్థానంలో నిలిచేది. కాని మోడీ ప్రభుత్వం కుట్రతో వాల్తేర్‌ డివిజన్‌ను రద్దుచేసి విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ను ప్రకటించింది.
వాల్తేరు డివిజన్‌ ఉంటే కేంద్ర బడ్జెట్‌ నుండి ప్రత్యేకంగా డివిజన్‌కి నిధులు కేటాయించబడతాయి. ఇప్పుడు అది కోల్పోతాం. విజయవాడ డివిజన్‌కి మాత్రమే నిధులు కేటాయించబడతాయి. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతానికి న్యాయం జరగదు.
          రైల్వే జోన్‌తో నిమిత్తం లేకుండానే రైల్వే నియామక బోర్డు (ఆర్‌ఆర్‌బి)ను ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఏర్పాటు చేసి ఉండాల్సింది. కాని ఎ.పి లో ఆర్‌ఆర్‌బిని ఏర్పాటు చేస్తామని ఇప్పటి వరకు బిజెపి ప్రకటన కూడా చేయలేదు. దేశంలో నేడు 21 ఆర్‌ఆర్‌బిలు ఉన్నాయి. ఒక ఆంధ్ర రాష్ట్రంలో తప్ప అన్ని పెద్ద రాష్ట్రాలలోను ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఒకటి కంటే ఎక్కువ కూడా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రానికి ఆర్‌ఆర్‌బి లేకపోవడంతో రాష్ట్రం లోని నిరుద్యోగ యువతకు తీవ్ర నష్టం జరుగుతున్నది. జోన్‌ లోని ఖాళీ పోస్టులు కూడా భర్తీ కావడంలేదు.
         ఇంత దారుణం జరుగుతున్నా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం బిజెపిపై పల్లెత్తి మాట్లాడటంలేదు. ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి ప్రధాని నరేంద్ర మోడీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారు. ప్రతిపక్షం లోని తెలుగుదేశం, జనసేనలు బిజెపి ఈ రాష్ట్రానికి చేస్తున్న ద్రోహాన్ని ఎదిరించడంలేదు. ఈ పార్టీలన్నీ బిజెపికి లొంగిపోవడం వల్ల చివరికి విభజన చట్టంలోని ఏ ఒక్క అంశం, హామీ కూడా అమలు కావడంలేదు. రైల్వే జోనే కాదు. కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజుపట్నం పోర్టు వంటివి కూడా ఎనిమిదేళ్లు అయినా ఆచరణకు నోచుకోలేదు. ప్రత్యేక హోదాని ఇవ్వబోమని చెప్పేశారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్యాకేజీ నిలిపివేశారు. విభజన చట్టంలో పేర్కొన్న 13 విద్యాసంస్థలకు పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేయటం లేదు. పోలవరానికి, రాజధానికి నిధులు ఇవ్వటంలేదు. రెవిన్యూ లోటు భర్తీ చేయటంలేదు. విశాఖ మెట్రో రైలు నిర్మాణం నేటికి అతీగతి లేదు. అయినా ఈ పార్టీలు కనీసం విమర్శ కూడా చేయటంలేదు. అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయి. బిజెపితో మిత్రత్వానికి అర్రులు చాస్తున్నాయి. చివరికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి పెట్టినా బిజెపితో ప్రత్యక్ష పోరాటానికి సిద్ధంకావడంలేదు. దీన్ని అవకాశంగా తీసుకొని బిజెపి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీస్తున్నది. విశాఖ రైల్వే జోన్‌ను అమలులోకి తీసుకురాకుండా రాష్ట్ర ప్రయోజనాలను నిర్వీర్యం చేస్తున్నది.

/ వ్యాసకర్త సెల్‌ : 9490098792 /

డా|| బి. గంగారావు

డా|| బి. గంగారావు