

- భగభగ మండిన భానుని తీవ్రతకు విలవిలలాడిన మనమంతా కొన్ని రోజులుగా వర్షాలు కురిసి, వాతావరణం చల్లబడి కొంతవరకు సేద తీర్చుకోగలుగుతున్నాం. వర్షాలు పలకరించగానే దోమలు మనల్ని కలవరపరుస్తా యి. దోమలు పలకరించినదే తరువాయి వెంటనే జ్వరాలు వచ్చి మనల్ని పలకరిస్తాయి. భారీ వర్షాలతో వరదలు ముంచేస్తున్నాయి. ఈ వరదలతో నీరు కలుషితమై, జ్వరాలే కాకుండా అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. దోమకాటుకు గురి కాని వారు ఒక్కరు కూడా ఉండరు అంటే అది అతిశయోక్తి కాదేమో! అలాగే వర్షపు నీటి వలన గానీ,కీటకాల వలన గానీ, అపరిశుద్ధమైన నీటిని తీసుకోవడం వలన గానీ వాంతులు, విరేచనాలు, జ్వరాలు రావడాన్ని ఈ సీజన్లో ప్రతి సంవత్సరం గమనిస్తూనే ఉన్నాం. మరోవైపు కరోనా నాలుగో అల ప్రారంభమైంది.. ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిపైనే ప్రత్యేక కథనం..

ఈ సీజన్లో ప్రధానంగా వచ్చే జ్వరాలలో మలేరియా, టైఫాయిడ్, వైరస్ జ్వరాలు, ఫైలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, చిన్నపిల్లల్లో వచ్చే మెదడువాపు జ్వరాలు దోమ కాటు ద్వారా వస్తాయి. పచ్చకామెర్లు, టైఫాయిడ్, కలరా, అమీబియాసిస్ వ్యాధులు కలుషితమైన నీరు లేదా ఆహారం తీసుకోవడం ద్వారా వస్తాయి. వాతావరణంలో మార్పులు వల్ల జలుబు, దగ్గుతో కూడిన వైరస్ జ్వరాలు వస్తాయి. ఈ క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో.. ఇప్పటికే మన దేశాన్ని మూడు విడతలగా గడగడలాడించిన కరోనా నాల్గవ అల రంగప్రవేశం చేసింది. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ, ఇప్పుడు దేశంలో రోజుకు ఇరవై వేల కేసులు నమోదవుతున్న పరిస్థితిలో మనం ఉన్నాం. ఈ సీజన్లో జ్వరం వస్తే ఏ కారణంగా వచ్చిందో తెలుసుకోవడం సాధారణ ప్రజలకే కాకుండా డాక్టర్లకూ కష్టమైన పరిస్థితి ఏర్పడింది.
జ్వరం ఏ వ్యాధి వల్ల వచ్చిందో రోగులకు తెలియదు. కనుక ఏ జ్వరం వచ్చినా అశ్రద్ధ చేయకుండా ఆరోగ్య ఉప కేంద్రాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, ఫ్యామిలీ డాక్టర్‌ని గానీ, లేకపోతే అందుబాటులో ఉండే సాధారణ వైద్యుని వద్ద చూపించుకుంటే తొలి దశలోనే కారణం గుర్తించి, తగిన వైద్యం ప్రారంభిస్తారు. వ్యాధి ప్రమాదకరంగా ఉంటే, వారు మెరుగైన వైద్యం లభించే చోటుకు పంపిస్తారు. అవసరం లేకపోయినా సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం పరుగులు తీసే ధోరణి ఒకవైపు ఉంటే.. వ్యాధి తీవ్రమయ్యే వరకూ సరైన వైద్యం తీసుకోకుండా ప్రాణం మీదికి తెచ్చుకునే ధోరణి మరొకవైపు ఉంది. ఈ అశాస్త్రీయ ధోరణుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయడం అత్యవసరం. ప్రజలు, ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఉపద్రవాలను చాలావరకూ నివారించుకోవచ్చు. ఈ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా నివారించడానికి ప్రజలు ఏం చేయాలి? ప్రభుత్వం ఏం చేయాలి? అనే విషయాలు తెలుసుకుందాం.

- మనం ఏమి చేయాలి?
బహిరంగ మల విసర్జన చేయరాదు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. రక్షిత మంచినీటిని వినియోగించాలి. రక్షిత మంచినీరు అందుబాటులో లేనప్పుడు నీటిని వడకట్టి, మరిగించి, చల్లార్చి శుభ్రమైన పాత్రలో ఉంచి, వాడుకోవాలి. అలాగే వండిన ఆహారం వేడిగా ఉన్నప్పుడే తినాలి. వండిన ఆహారంపై మూతలు పెట్టాలి. నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తినవద్దు. కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి మాస్కు ధరించడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం మరచిపోవద్దు. గుంపులుగా ఉండవద్దు. అవసరమైన ప్రయాణాలు మాత్రమే చేయాలి.

- దోమలు పుట్టకుండా ఏం చేయాలి?
- చలికాలంలో ప్రబలే వ్యాధులకు ప్రధానకారణం దోమ. ఈ దోమలు పుట్టకుండా, పుట్టినా అవి మనల్ని కుట్టకుండా చూసుకోగలిగితే ఈ వ్యాధుల నుంచి మనం తప్పించుకోవచ్చు. దోమలు పుట్టకుండా ఏం చేయాలంటే..
- ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి.
- తాగి పారేసిన కొబ్బరి బొండాలు, కొబ్బరి చిప్పలు, పగిలిపోయిన కుండలు, ఖాళీ డబ్బాలు, వాడి పారేసిన సైకిల్ ట్యూబులు, టైర్లను ఇంటి పరిసరాలలో లేకుండా చూసుకోవాలి. వీటిలో వారం రోజులు నీరు నిల్వ ఉంటే, దోమలు గుడ్లు పెట్టి లక్షలాది దోమలు ఉత్పత్తవుతాయి.
- రోజూ నీళ్లను వాడకుండా నిల్వ ఉండే తొట్టెల పైన, వాటర్ ట్యాంకుల పైన మూతలు కప్పాలి.
- గ్రామ ప్రజలంతా కలిసి వారానికి ఒక రోజుని 'డ్రైడే' గా ప్రకటించుకోవాలి. ఆ రోజు పూల కుండీలు, కూలర్లు, నీటి తొట్టెలు మొదలైన వాటిలో ఉన్న నీటిని పూర్తిగా తొలగించాలి. అలా వాటిని గంట సేపు ఎండ నిచ్చి, మళ్లీ నీళ్లు పట్టుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఎవరికి వారు చేసే కంటే గ్రామం మొత్తం చేయడం మంచిది. జిల్లా మొత్తం ఒకేరోజు చేయడం ఇంకా మంచిది. వీలైతే రాష్ట్రం మొత్తం ఒకేరోజును 'డ్రైడే'గా పాటించడం మరీ మంచిది.
- ఇంట్లో చెత్తను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. తొలగించిన చెత్తను పబ్లిక్ కుండీలలో వేయాలి. వీలుకాకపోతే, చెత్త సేకరించే వారికి ఆ చెత్త అప్పజెప్పాలి. రోడ్డుపక్కన వుండే మురుగు కాలువలో చెత్త వేయరాదు. అలా వేయడం వలన మురుగునీరు నిలిచిపోయి, కాలువలు దోమల పెంపక కేంద్రాలుగా మారతాయి.
- మునిసిపాలిటీ వారు కానీ, పంచాయతీ వారు కానీ ఫాగింగ్ (పొగ పట్టడం) చేసేటప్పుడు మన ఇంటి తలుపులు, కిటికీలు తెరిచి ఉంచుకోవాలి. ఆ పొగ ఇంటిలోకి రావడం మంచిది. మీ ఇంటిలోని గోడలపై, మూలల్లో కూడా క్రిమిసంహారక మందులను పిచికారీ చేయించాలి.
- ఇళ్లలో ఉండే మరుగుదొడ్డి యొక్క సెప్టిక్ ట్యాంక్ పైపు చివర నైలాన్‌ను కట్టి, ఉంచాలి. అలా చేయకపోతే సెప్టిక్ ట్యాంకులు దోమల ఉత్పత్తి స్థావరాలుగా మారిపోతాయి.
పై చర్యలన్నీ మన ఇంటి వరకే చేస్తే దోమలను నిర్మూలించలేము. పక్క ఇంటిలో తయారైన దోమ మన ఇంటికి వచ్చి మనల్ని కుట్టవచ్చు. అందుకని ప్రజలందరూ కలిసికట్టుగా కృషి చేసినట్లయితేనే ప్రయోజనం ఉంటుంది. ప్రజల సహకారం, క్రియాశీలక భాగస్వామ్యం లేకుండా దోమల నిర్మూలన, పారిశుధ్య నిర్వహణలు సాధ్యం కావు. ప్రజలు తమ హక్కులను, బాధ్యతలను గుర్తించాలి. ప్రభుత్వాలను తన బాధ్యతను నెరవేర్చమని ప్రజలు డిమాండ్ చేస్తూ మన పరిధిలో జరిగే కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలి.

ఇదీ 'దోమా'యణం!
- చాలా మంచి దోమ.. మన నిద్రకి ఇబ్బంది లేకుండా పగలే కుడుతుంది. రాత్రి పూట పెద్దగా కుట్టదు. ఉదయం 5 నుంచి 7 గంటల లోపల, సాయంత్రం 5 నుంచి 7 గంటల లోపల కుట్టడం దీనికిష్టం. విద్యుత్ దీపాల వెలుతుర్ని కూడా సూర్యకాంతిగా భావించి, అప్పుడు కూడా కుడుతుంది.
- శుభ్రమైన దోమ: మంచి నీళ్ళలోనే గుడ్లు పెడుతుంది. మురికి నీళ్ళ జోలికి పోదు.
- మొద్దు దోమ: పెద్దగా ఎగరలేదు. అందుకే ఇంట్లోనే ఉండి కుట్టుకుంటూ ఉంటుంది. ఎక్కువ సందర్భాలలో మనం మన వాహనాలలో ఇంకొక ఊరికి తీసుకుపోతేనే ఊరు దాటి బయటికిపోతుంది
- బతకనేర్చిన దోమ: వీలయితే ఆరు వారాల్లో దీని గుడ్డు పగులుతుంది. ఇబ్బందులు ఉంటే ఆరు నెలల వరకు గుడ్డు బతికే ఉండగలదు. ఎక్కడ మనం బట్టలు సరిగా వేసుకోమో చూసి మోకాళ్ళ కింద, మోచేతుల కిందనే ఎక్కువగా కుడుతుంది.
- మనుషులంటే ప్రేమ ఎక్కువ: ఈ దోమకు మనిషి రక్తమంటే ఇష్టమెక్కువ. కుక్కల్ని, పశువుల్ని ఈ దోమ పెద్దగా కుట్టదు. మనుషుల్ని ఎక్కువగా కుడుతుంది.
- గండు దోమ: నల్లగా, లావుగా చూడటానికి విచిత్రంగా, వంటిమీద పులి చారల్లా తెల్లటి పట్టీలు ఉంటాయి. అందుకే దీనిని టైగర్ దోమ అంటారు.
- ఆడ దోమ మాత్రమే కుడుతుంది. ఆడ, మగ, జాతి తేడా లేకుండా మనుషులందరినీ కుడుతుంది.
- డెంగ్యు జ్వరం మనిషి జీవితంలో 4 సార్లకు మించి రాదు. ఐదోసారి రాకపోవడానికి కారణం మనిషి గొప్పతనం కాదు. అలాగని దోమ చేతకానితనం అంతకన్నా కాదు. డెంగ్యు జ్వరానికి కారణమైన వైరస్‌లు నాలుగు రకాలు ఉండడమే ఇందుకు కారణం. ఏదైనా ఒక రకం ద్వారా డెంగ్యు జ్వరం వస్తే, ఆ రకానికి వ్యతిరేకంగా జీవితంలో మరోసారి ఆ రకం ద్వారా డెంగ్యు జ్వరం రాకుండా మనిషి శరీరంలో వ్యాధి నిరోధకశక్తిని మన శరీరం తయారుచేసుకుంటుంది. ఇలా ఒకసారి వచ్చిన రకం మళ్ళీ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ గుర్తించుకోవలసిన మరో విషయమేమిటంటే, మొదటిసారి కంటే రెండవసారి ప్రమాదమెక్కువ.. రెండవ సారి కంటే మూడవసారి, మూడవసారి కంటే నాలుగోసారి ప్రమాదమెక్కువ.
- డెంగ్యూ జ్వరం ఉన్నవారు ఆస్పిరిన్ మాత్రలు వేసుకుంటే ప్రమాదం.
- డెంగ్యూ జ్వరాలు వున్న ప్రాంతంలో, జ్వరంతో బాధపడుతున్న ప్రతివ్యక్తి వీలైనంత వరకు నొప్పుల మాత్రలు గాని ఆస్పిరిన్ మాత్రలు గాని వాడకూడదు. ఎందుకంటే డెంగ్యూ వ్యాధిలో ప్లేట్లెట్స్ తగ్గిపోయి, రక్తస్రావం జరిగి ప్రమాదానికి గురయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు. ఆస్పిరిన్ మాత్రలకూ రక్తస్రావాన్ని పెంచే లక్షణం ఉంది. ఇవి రెండూ జత కట్టాయనుకోండి. రక్తస్రావ తీవ్రత బాగా పెరిగి ప్రాణాపాయం జరిగే పరిస్థితి ఏర్పడవచ్చు. వచ్చిన జ్వరం ఏదయినా, డెంగ్యూ జ్వరంగా భావించి, జ్వర ప్రభావం నుంచి బయటపడేదాకా ఆస్పిరిన్ మాత్రలు, నొప్పుల మాత్రలు వాడడం మంచిది కాదు.
- నొప్పుల మాత్రలు వాడడం వలన జీర్ణాశయంలో పుండ్లు ఏర్పడి, అందులో నుంచి రక్తస్రావం జరిగే అవకాశం ఏర్పడుతుంది. అందుకే డెంగ్యూ జ్వరాలు ఉన్నపుడు నొప్పుల మాత్రలు వాడడం మంచిది కాదు.

ఈ వ్యాధుల నివారణ ప్రధాన బాధ్యత ప్రభుత్వాలది. పారిశుధ్యం లోపించడమే ప్రధానకారణం. అధికార యంత్రాంగాన్ని, ఉద్యోగులను కదిలించి పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషి చేయాలి.
- మురుగు కాల్వలలో నీరు నిలువ లేకుండా సక్రమంగా ప్రవహించేలా చూడాలి.
- నీరు నిలువ ఉన్నచోట ఆయిల్ బాల్స్ వంటివి చేయించి, దోమల గుడ్లను నిర్మూలించాలి.
- చెత్త కుండీలను ఎప్పటికప్పుడు ఖాళీ చేయించాలి.
- పట్టణ ప్రాంతాలలో భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.
- ప్రణాళికాబద్ధంగా అన్ని ప్రాంతాలలో ఫాగింగ్ నిర్వహించాలి.
- ఇళ్ళమధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో నీళ్లు నిలువ ఉండడం వలన ఆ ఖాళీ స్థలాలు దోమల పెంపక కేంద్రాలుగా మారుతున్నాయి. అధికారులు యజమానులతో సంప్రదించి వీటిని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలి.
- నివాస ప్రాంతాల సమీపంలో ఉన్న చెరువులు గుంటలలో దోమల లార్వాలను నియంత్రించేందుకు గంబూజియా చేపలను వదలాలి.
- ప్రజలు ప్రతివారం 'డ్రైడే'ని పాటించే విధంగా ప్రోత్సహించాలి.
- ప్రజలకు ఆరోగ్య సూత్రాల పట్ల అవగాహన పెంచాలి.
- దోమల నిర్మూలనను ఒక ఉద్యమంగా చేపట్టాలి. ఇందులో ప్రజలను, ప్రజాసంఘాలను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి.
పరిశుభ్రమైన నీరు తాగడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, దోమలు పుట్టకుండా మరియు పుట్టిన దోమలు మనల్ని కుట్టకుండా చూసుకోవడం ఈ వ్యాధుల నివారణకు ఉత్తమ పరిష్కారం. ఇది అందరి సమస్య అందరం కలిస్తేనే సమస్య పరిష్కారమవుతుంది.


- దోమలు కుట్టకుండా ఏమి చేయాలి?
- దోమతెరలు వాడాలి. రోజు మొత్తంలో మనల్ని కుట్టడానికి దోమలకు అనువైన సమయం మనం నిద్రపోయే సమయం. అందుకే దోమల కుట్టకుండా చూసుకోవడంలో దోమతెరలది ప్రధానపాత్ర. క్రిమి సంహారక మందులు పూసిన దోమతెరలు వాడితే ఇంకా మంచిది.
- ఇంటి కిటికీలకు, తలుపులకు మెష్ బిగించుకోవాలి.
- దోమలు ఎక్కువగా ఉన్న సమయంలో శరీరాన్ని వీలైనంతగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి.
- దుస్తులు కప్పని భాగాలలో దోమలను వికర్షించే లేపనాలు పూసుకోవాలి.
- దోమలను చంపడానికి ఎలక్ట్రిక్ బ్యాట్లను వాడుకోవాలి.
- ప్రతిరోజూ సాయంత్రం పూట తప్పక స్నానం చేయాలి. ఉతికిన బట్టలనే వేసుకోవాలి. ఎందుకంటే చెమట వలన వచ్చే వాసన దోమలను ఎక్కువగా ఆకర్షిస్తుంది.
- వదులుగా ఉన్న దుస్తులను వాడుకోవాలి. బిగుతుగా ఉన్న దుస్తులు వాడితే దుస్తుల మీద నుంచి దోమ కుట్టగలదు.
- రాత్రులు నల్లని దుస్తులు వాడవద్దు. నల్ల రంగు దుస్తులు దోమల్ని ఆకర్షిస్తాయి. తెల్ల రంగు దుస్తులను లేదా లేత రంగు దుస్తులను వాడడం మంచిది.

రాష్ట్ర అధ్యక్షులు ప్రజారోగ్య వేదిక,
ఆంధ్రప్రదేశ్
9490300431