విరబూసే ప్రకృతిలో వినూత్న కాంతులు కురిపించే పూల మొక్కలు ఎన్నో. దీపపు కాంతుల్లా, నక్షత్ర తళుకుల్లా కాంతులీనే తారాజువ్వ మెరుపుల్లా, చిందించే చిచ్చుబుడ్డు నిప్పురవ్వల్లా, మెరిసే మతాబుల వెలుగుల్లా, కురిసే కాకర పువ్వొత్తి చినుకుల్లా... గుభాళిస్తూ విరబూసే విరులెన్నో! ఆకాశమంతా అపురూప కాంతులు వెదజల్లే దీపావళి వేళ.. తారలను తలపించే వినూత్న పూల మొక్కలు గురించి ఈ వారం తెలుసుకుందాం..
భూచక్ర పువ్వు ఆస్టియోస్పెర్మ్ ఫ్రూటికోసమ్..
దీపావళి బాణసంచాలో భూచక్రం లేదా విష్ణుచక్రం ఒక వినోదమైన కాల్చే టపాకాయి. చీకట్లో రంగులు వెదజల్లుతూ గుండ్రంగా తిరుగుతుంది. అచ్చంగా అలాగే ఉండే నీలిరంగు పువ్వులు పూసే సౌందర్యవతి ఆస్టియోస్పెర్మ్ ఫ్రూటికోసమ్. ఇది దక్షిణాఫ్రికాకు చెందిన ఒక పొద మొక్క. పొద్దుతిరుగుడు (ఆస్టెరేసి) కుటుంబానికి చెందిన చిన్న తెగ. ఇది 6 నుంచి 12 అంగుళాల వరకూ పెరుగుతుంది. తేలికపాటి వాతావరణంలో శాశ్వతంగా పెరిగే మొక్క. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పువ్వులు పూస్తూ ఉంటుంది.
నక్షత్ర తళుకులు బ్రైడల్ బొకే..
కారు చీకట్లో నక్షత్ర మెరుపుల్లా తళ తళలాడే పూలమొక్క బ్రైడల్ బొకే. ఇది తీగ జాతి మొక్క. నాలుగు సన్నని రేఖలతో పువ్వు అచ్చంగా నక్షత్రంలానే ఉంటుంది. మధ్యలో ఉండే రేఖలు పూలకు మరింత శోభనద్దుతాయి. పాలమీగడ తెలుపు ఈ పూల ప్రత్యేకత. రోజంతా పూలు విచ్చుకున్నప్పటికీ సాయంత్రం వేళల్లో చాలా దూరం వరకూ ఘాటైన సువాసనలు విరజిమ్ముతాయి. కుండీల్లోనూ నేల మీదా బాగానే పెరుగుతాయి. అక్టోబర్ నుంచి పూలు పూయడం మొదలై, మార్చి వరకు గుభాళిస్తూనే ఉంటాయి. క్లేమేటిస్ టెర్నీఫ్లోరా దీని శాస్త్రీయ నామం. ఉత్తరాసియా దీని స్థానికం. ఆర్నమెంటల్ జాతికి చెందిన ఈ మొక్క ప్రస్తుతం ప్రపంచం అంతా ఎగబాకింది. బట్టర్ కప్ జాతికి చెందిన రణుకులయేసి కుటుంబం దీనిది.
మతాబుల రైన్కోస్టైలిస్ గిగాంటియా..
వెలుగుతున్న మతాబులా తెల్లని ప్రకాశంవంతమైన తళుకులు ధారలా కురిపించేది.. మెరుస్తూ విరిసేది మతాబుల పూల మొక్క. పువ్వులు గుచ్చం మాదిరిగా పొడవుగా విచ్చుకుంటాయి. ఆర్చిడ్ జాతికి చెందిన దీని శాస్త్రీయ నామం రైన్కోస్టైలిస్ గిగాంటియా. ఒక్క వేసవికాలం తప్ప మిగతా అన్ని సీజన్లలోనూ వికసిస్తుంది. శీతాకాలంలోనూ, చల్లని ప్రదేశాల్లోనూ పువ్వులు నిగారింపుగా విచ్చుకుంటాయి.
దీన్ని ఇండోర్‌లోను, సెమీషేడ్‌లోనూ పెంచుకోవచ్చు. కొబ్బరి పొట్టు మిశ్రమం, బొగ్గుల మిశ్రమంలో కూడా ఈ మొక్కలు పెరుగుతాయి. సిట్‌ఔట్లు, టీవీ టేబుల్, రీడింగ్ టేబుల్, కప్‌బోర్డు, క్యారిడార్, బాల్కనీ, ఆఫీస్ టేబుల్ దగ్గర అలంకరించుకుని, పెంచుకోవడానికి ఈ మొక్క ఎంతో అందంగా ఉంటుంది.
సిసింద్రీల రస్సెలియా ఈక్విసెటిఫార్మిస్..
ఎరుపు లేదా కాషాయరంగు పూలు సిసింద్రీల మొక్క. మొక్క నిండా పూలు గుభాళిస్తూ అలరించేది సిసింద్రీ మొక్క. రస్సెలియా ఈక్విసె టిఫార్మిస్ దీని శాస్త్రీయ నామం. సర్వు చెట్టు ఆకుల్లా దీని పత్రాలు సన్నని కేసరాల్లా పొడవుగా ఉంటాయి. లవంగ మొగ్గలు ఆకారంలో పువ్వులు విరబూస్తాయి. సంవత్సరం పొడుగునా మొక్కకు పువ్వులు పూస్తూనే ఉంటుంది. శీతాకాలం వస్తే ఆకులు కనిపించినంతగా పువ్వులు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 'గడ్డి మొక్క' అనీ పిలుస్తారు. పొద జాతికి చెందిన మొక్క ఇది. పువ్వుల్లో మకరందం మెండుగా ఉండటంతో హమ్మింగ్ బర్డ్స్, సీతాకోకచిలుకలు నిత్యం ఈ మొక్క చుట్టూ ప్రదర్శనలు చేస్తూ ఉంటాయి. ఇంటి ముంగిట బోర్డర్ ప్లాంట్లులా ఈ మొక్కలు భలే అందంగా ఉంటాయి.
చిచ్చుబుడ్డి గ్రెవిల్లె రోస్మరినిఫోలియా..
నింగి వైపు ఎగసిపడుతూ కాంతులీనే చిచ్చుబుడ్డి నిప్పురవ్వలల్లే... రవళించే సుమధుర సుమం చిచ్చుబుడ్డి పూల మొక్క. శాస్త్రీయ నామం గ్రెవిల్లె రోస్మరినిఫోలియా. ప్రోటేసియా కుటుంబానికి చెందిన ఈ మొక్క బయట వాతావరణంలో పెరుగుతుంది. శీతాకాలం నుంచి వసంత ఋతువు వరకు పూలు విచ్చుకునే సీజనల్ మొక్కిది. ఎర్రని పువ్వులు మధ్య మధ్యలో తెల్లని మచ్చలాంటి డిజైన్‌తో మంట మండుతున్నట్టుగా పూలగుత్తి కనిపిస్తుంది. తమాషా ఏంటంటే ఈ మొక్క నుంచి చిన్న కొమ్మను తుంచి, వేరేచోట గుచ్చినా మొలుస్తుంది. కొద్దిగా నీటి వనరు అందిస్తే ఎలాంటి నేలలో అయినా పెరుగుతుంది. ఈ పువ్వులు కూడా మకరందాన్ని కలిగి ఉంటాయి. చేతన ప్రాంతాల్లో బాగా విచ్చుకుంటాయి.
కాకరపువ్వొత్తిలాంటి కాలిస్టెమోన్..
సన్నని కేసరాలు వాటి చివరన చిన్న మెరిసే పుప్పొళ్ళు.. చూడ్డానికి అచ్చంగా కాకరపువ్వొత్తుల్లా వెలుగు జిలుగులా కనిపించేది కాలిస్టెమోన్. మిర్టేసి కుటుంబానికి చెందిన దీన్ని స్థానికంగా 'బాటిల్ బ్రష్' అని పిలుస్తారు. పొదల జాతికి చెందిన పూలమొక్క. ఇది పది అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. దీని పుట్టుక ఆస్ట్రేలియా. కుండీల్లోనూ నేల మీదా బాగా పెరుగుతుంది. జులై నుంచి మార్చి వరకూ పూలు విరబూస్తుంది. ఇసుక నేలల్లో, శీతల ప్రాంతాల్లో ఇంకా బాగా పెరుగుతుంది. సాధారణంగా ఎర్రని కేసరాలకు పసుపు రంగు పుప్పొళ్ళు ఉంటాయి. వీటిలో కూడా విభిన్న రంగుల పువ్వులు పూసే సరికొత్త మొక్కలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి.
చిలుకూరి శ్రీనివాసరావు, 89859 45506