
ముంబయిలో ఆటలమ్మ (మీజిల్స్) వ్యాధి విజృంభించడం తీవ్ర ఆందోళనకర పరిణామం. ఈ ఒక్క నగరంలోనే గత రెండు నెలల్లో 200కు పైగా కేసులు పొడచూపగా...13 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గత కొన్ని సంవత్సరాల గణాంకాలతో పోలిస్తే ఇది చాలా రెట్లు ఎక్కువ. 2021లో 10 కేసులు నమోదు కాగా ఒకరు చనిపోయారు. 2020లో 29 కేసులు నమోదయ్యాయి. 2019లో 37 కేసులు నమోదు కాగా ముగ్గురు చనిపోయారు. ఈ వ్యాధి ముంబయితో పాటు మహారాష్ట్ర లోని నాసిక్, యావత్మాల్ ప్రాంతాల్లోనూ వ్యాపిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. కోవిడ్ సమయంలో సార్వత్రిక టీకాలు వేయకపోవడం వల్లే ప్రస్తుతం ఆటలమ్మ వ్యాధి విజృంభణకు కారణమని విశ్లేషణలు నిగ్గుతేలుస్తున్నాయి. ప్రజారోగ్యం పట్ల పాలకుల నిర్లక్ష్యానికి ఇది దర్పణం పడుతోంది. కేవలం 41 శాతం పిల్లలకు మాత్రమే ముంబయిలో ఆటలమ్మ టీకాలు వేసినట్లు మహారాష్ట్ర ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఆశా కార్యకర్తలతో సహా ప్రజారోగ్య సిబ్బంది మొత్తాన్ని కోవిడ్ టీకాలు వేయడానికి కేటాయించడం, ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత, ప్రజారోగ్య వ్యవస్థలో నెలకొన్న ఇతర ఇబ్బందులను పరిష్కరించడంలో పాలకుల నిర్లక్ష్యం అన్నీ ఒకదానికి ఒకటి తోడై ప్రాణాధార టీకాలను పిల్లలకు దూరం చేసినట్లు అయ్యింది. టీకా సమయంలో పిల్లలకు జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపించిన కారణంగా తల్లిదండ్రులు ఆటలమ్మ తదితర వాటికి టీకాలు వేయించకుండా ఉండిపోయారు. గతంలో ఇలాంటి అనుమానాలు వస్తే ప్రజారోగ్య సిబ్బంది వారికి నచ్చజెప్పి అనుమానాలను నివృత్తి చేసి పోలియో చుక్కలు, ఆటలమ్మ, పొంగు వంటి వ్యాధి నివారణ ముందస్తు టీకాలు వేసేవారు. కోవిడ్ మహా విపత్తు సమయంలో ప్రజారోగ్య వ్యవస్థ అలా తల్లిదండ్రులకు నచ్చ జెప్పి భరోసాను కల్పించలేకపోయింది. ప్రభుత్వాలు ఈ దిశలో కనీస చర్యలు కూడా తీసుకోకుండా కోవిడ్ సమయంలో ప్రజారోగ్యాన్ని ప్రధానంగా పిల్లల భవిష్యత్తును గాలికొదిలేశాయని చెప్పడానికి ముంబయిలో ఆటలమ్మ విజృంభణ ఒక ఉదాహరణగా నిలుస్తోంది.
పిల్లలందరికీ సకాలంలో వ్యాధి నివారణ టీకాలు అందజేసేందుకు కేంద్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించిన 'ఇంధ్ర ధనుష్' ఏమైపోయిందన్నది ఇప్పుడు ప్రశ్న. భారత్ సహా అల్ప, దిగువ మధ్య తరగతి ఆదాయాలున్న దేశాల్లో గత రెండేళ్లుగా పిల్లలకు టీకాలు సరిగా అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ సంస్థలు నివేదించాయి. ప్రధానంగా డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం రాకుండా పిల్లలకు వేసే డిపిటి (డిప్తీరియా, పెర్టుసిస్, టెటనస్) టీకాలతో పాటు ఆటలమ్మ రాకుండా వేసే టీకాలు అర్హులైన పిల్లలకు సరిగా అందడం లేదని ఈ రెండు సంస్థలు నివేదించాయి. లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో కనీసం లక్ష మంది చిన్నారులు ఈ టీకాలకు దూరమయ్యారని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) కూడా పేర్కొంది. వాస్తవానికి ఆటలమ్మ అనేది శరవేగంగా వ్యాపించే అంటువ్యాధి. సార్వత్రిక టీకాల్లో కేవలం 5 శాతం మందికి టీకాలు వేయకపోయినా...హెర్డ్ ఇమ్యూనిటీ దెబ్బతింటుందని, దానివల్ల వ్యాధి వేగంగా విస్తరిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముంబయిలో క్రమంగా పెరుగుతున్న ఆటలమ్మ కేసులు ఆ హెచ్చరికలను నిజం చేస్తున్నాయి.
ముంబయితో పాటు రెండు వారాలుగా జార్ఖండ్ లోని రాంచీ, గుజరాత్ లోని అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లోనూ ఆటలమ్మ కేసులు నమోదయ్యాయి. పెను విపత్తులా ముంచుకొస్తున్న ఈ వ్యాధి పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం కోవిడ్ సమయంలో వ్యవహరించినట్లే అంతులేని నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తుండటం దుర్మార్గం. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి వ్యాధి విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన కేంద్రం ఆ పని చేయకుండా వ్యాధి ప్రబలిన ప్రాంతాలకు అధ్యయన బృందాలను పంపి చేతులు దులిపేసుకుంటోంది. వ్యాధి విజృంభిస్తున్న ప్రాంతాల్లో 5 నుంచి 9 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు అదనపు డోసు టీకాలు వేయాలని హితబోధ చేయడంతో సరిపెడుతోందే కానీ అందుకు సరిపడా నిధులను కానీ, వైద్య సిబ్బందిని కానీ సమకూర్చే చర్యలకు కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించడం లేదు. కోవిడ్ వంటి ఆరోగ్య అత్యయిక పరిస్థితులను ఎదుర్కోవాలంటే ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతంగా ఉండాలని ఆటలమ్మ విజృంభణతో మరో మారు హెచ్చరించిట్లు అయింది. ఇప్పటికైనా పాలకులు దీనిని ఒక గుణపాఠంగా స్వీకరించి ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరముంది.