
విశాఖ జిల్లాలోని రుషికొండపై నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు, నిర్మాణాలు జరిగాయని హైకోర్టు బుధవారంనాడు పేర్కొనడంతో సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే పర్యావరణ హననానికి పాల్పడిందని స్పష్టమైంది. ఈ అంశంపై నియమించిన నిపుణుల కమిటీ నివేదిక ఆ కొండపై నిర్మాణాల్లో ఉల్లంఘనల గురించి కుండ బద్దలు కొట్టింది. 9.88 ఎకరాల్లో నిర్మాణాలకు అనుమతి ఉంటే 17.96 ఎకరాల్లో పనులు జరిగాయని తేల్చింది. నిబంధనలను ఉల్లంఘించి తవ్వకాలు, నిర్మాణాలు జరిగాయని కమిటీ హైకోర్టుకు స్పష్టం చేసింది. నివేదిక ఆధారంగా ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖను ఆదేశిస్తామని హైకోర్టు పేర్కొనడం బాగానే ఉంది. అయితే సుప్రీంకోర్టు అనుమతిచ్చిన మేరకు నిర్మాణాలు ఎందుకు చేయలేదని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని వేసిన ప్రశ్న నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికీ, సంబంధిత పనులు చేపట్టిన ఉన్నతాధికారులకూ ఉద్దేశించినదిగా భావించాలి. అనుమతించిన దానికంటె కొద్దిగా ఎక్కువ విస్తీర్ణంలో నిర్మాణాలు చేపట్టడం కొన్ని సందర్భాల్లో జరుగుతుంటుంది కానీ ఏకంగా రెట్టింపు విస్తీర్ణంలో అలా చేయడం అసాధారణమైన విషయం. అది కూడా ఎవరో అనధికారిక వ్యక్తులో ప్రైవేటు సంస్థలో కాదు సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఇంత తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడడం తగని పని. ఇది కాకతాళీయంగా జరిగినదని అనుకునే అవకాశమే లేదు. ఉద్దేశపూర్వకమే! ఉల్లంఘనలపై తొలి రోజుల్లోనే మీడియాలో కథనాలు ఫొటోలు, వీడియోలతోసహా పతాక శీర్షికల్లో ప్రచురితం, ప్రసారం అయ్యాయి. ఆ తరువాత పలువురు కోర్టులనాశ్రయించారు. న్యాయస్థానాల్లో వివాదం కొనసాగుతుండగానే సర్కారువారు నిర్మాణాలు చకచకా చేపట్టడం పంతానికి పోవడంగానో లేక మమ్మల్నెవరెేం చేస్తారులే అన్న భావనతోనే అన్నది జనవాక్యం.
అయితే రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణ అనుమతులు ఇచ్చిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖనే ఉల్లంఘనలపై చర్యలు నిర్ణయించమని హైకోర్టు ఆదేశించడం ఆశించిన ఫలితాలనిస్తుందో లేదో తెలియదు. అడవులను, ప్రకృతి వనరులనూ కార్పొరేట్లకు ఎలా కట్టబెట్టాలా అన్న రీతిలోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఇటీవలి సంవత్సరాల్లో తీసుకుంటున్న చర్యలుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వంలోని అధికార పార్టీ ప్రయోజనాల కోసం ఆయా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వాలను నడిపించే పార్టీలవారు ఓట్లు వేయడానికి, చట్టసభల్లో చేతులెత్తడానికీ ఆయా రాష్ట్రాలకు కొన్ని పాలనాపరమైన రాయితీలివ్వడం తాజాగా నడుస్తున్న రాజకీయం. కేంద్రానికి భజన చేసే పార్టీల ఏలుబడిలోని రాష్ట్రాలకు ఉదారంగానూ వ్యతిరేకించే పార్టీల పాలనలోని రాష్ట్రాలకు కోతలు పట్టడం కమలనాథుల పాలనా విధానంగా ఉంది. వివిధ పథకాల ప్రమాణాలను, నిబంధనలను తమకు నచ్చిన రీతిలో నిర్వచించడం, నిర్ణయించడంలో వారిది అందె వేసిన చెయ్యి. ఈ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఎవరికైనా అటువంటి సందేహాలు కలగడం సహజం. అయితే ఉల్లంఘనల తీవ్రత, విధ్వంసం మూలంగా జరిగే నష్టాన్ని శాస్త్రీయంగా మదింపు వేయడం అటవీ పర్యావరణ శాఖకే ఉంటుందన్న హైకోర్టు అవగాహన మాత్రం ముమ్మాటికీ సరైనదే.
పర్యావరణ నిబంధనల్ని ఉల్లంఘించి ప్రభుత్వం నిర్మించినది ఒక ఆసుపత్రో పాఠశాలో కళాశాలో కాదు సరికదా కనీసం ప్రభుత్వ కార్యాలయం కూడా కాదు. కేవలం టూరిస్టు రిసార్టు మాత్రమే! అంటే అతి కొద్ది మంది సంతోషానికి విహారానికి ఉద్దేశించబడినదే. ఇంకా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో సంపన్నుల విలాసాలకు వినియోగపడేదే! ఇటువంటి పరిమిత ప్రయోజనం(?) కోసం ఎవరూ తిరిగి సృష్టించలేని ప్రకృతిని, పర్యావరణాన్ని ధ్వంసం చేయడం సబబు కాదు. పైపెచ్చు అందుకోసం సుప్రీం కోర్టు వరకూ వెళ్లడం అంత విజ్ఞత అవుతుందా? ఆ నిర్మాణాల్లో ప్రభుత్వం పర్యావరణ హననానికి పూనుకుందన్న విషయాన్ని కోర్టు నియమించిన నిపుణుల కమిటీ నిర్ధారించింది కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇంకా వివాదాన్ని కొనసాగించకుండా ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అమలు చేయడం మంచిది. ఇకముందైనా ప్రకృతి వనరుల రక్షణ, పర్యావరణ పరిరక్షణ పట్ల తగు జాగ్రత్తలు వహించడం అవసరం. ప్రపంచం యావత్తూ కర్బన ఉద్గారాల ప్రమాదాన్ని గురించి గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వాలు పర్యావరణ విధ్వంసానికి తెగబడరాదు.