
ప్రజాస్వామ్యంపై, సమాఖ్య వ్యవస్థపై, రాజ్యాంగ మౌలిక స్వరూపంపై గతంలో ఎన్నడూ లేనివిధంగా మోడీ ప్రభుత్వం దాడులకు తెగబడుతోంది. అధికార యంత్రాంగంపై అజమాయిషీతో సహా ప్రధాన పాలనా రంగాలపై ప్రజల చేత ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానికి ఉన్న హక్కులను పరిరక్షిస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన ఏకగ్రీవ తీర్పును తుంగలో తొక్కేందుకు మొండిగా ఆర్డినెన్స్ జారీ చేయడం సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలిగించడమే.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడం, ఆయా పార్టీలను చీల్చి అధికారంలోకి రావడం, ఎన్నికైన ప్రభుత్వం పనిచేయకుండా గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల ద్వారా నిత్యం అడ్డంకులు సృష్టించడం, రాష్ట్ర ప్రభుత్వాలు అసెంబ్లీలో చేసిన నిర్ణయాలకు సంబంధించిన బిల్లులపై సంతకాలు పెట్టకుండా ప్రతిష్టంభన సృష్టించడం, నిధులు విడుదల చేయకుండా కక్షసాధింపు చర్యలకు పాల్పడటం ... ఇలా ఎన్నో నిరంకుశ చర్యలకు పాల్పడుతూ ఉంది. 2014 వరకూ ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర ప్రభుత్వ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చిన బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కడి ప్రభుత్వ అధికారాలన్నీ హరించడానికి చేయని ప్రయత్నం లేదు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్‌కే అధికారాలుండాలని కోరుకుంటోంది. 1991 నాటి ఢిల్లీ ప్రభుత్వ రాజధాని ప్రాంత చట్టానికి సవరణలు తీసుకురావడం ద్వారా 2021లో పాలనాపరమైన నిర్ణయాలపై ఎల్‌జికి అధికారాన్ని అప్పగించింది. 1991లో 69వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేరిన 239 ఎఎ అధికరణ ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలకు భిన్నంగా ఢిల్లీ ప్రభుత్వానికి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చిందని 2018లో ఇచ్చిన తీర్పులోనూ, ఇటీవల తీర్పులోనూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అధికారుల బదిలీలు, ఇతర సర్వీసు వ్యవహారాల గురించి 2018 తీర్పులో సుప్రీంకోర్టు ప్రత్యేకంగా చెప్పకపోయినా అంతర్లీనంగా ఉందని కేంద్రం వాదిస్తోంది. తాజా తీర్పులో ఆ వాదనకు ముగింపు పలుకుతూ... 239ఎఎ అధికరణంలోని క్లాజు (3) (ఎ) ఢిల్లీ ప్రభుత్వానికి విస్తృతాధికారాలిస్తోందని సుప్రీం స్పష్టం చేసింది. శాంతిభద్రతలు, పోలీసు వ్యవస్థ, భూసంబంధ అంశాల్లో మినహా మిగతా అన్ని విషయాల్లో ప్రజల చేత ఎన్నికైన ఢిల్లీ ప్రభుత్వానికే అధికారం ఉంటుందని విస్పష్టంగా తీర్పుచెప్పింది. ఆ మూడు అంశాలు మినహా మిగిలిన అధికారాల విషయంలో ఢిల్లీ సిఎం, మంత్రివర్గ సలహా సంప్రదింపులకు లెఫ్టినెంట్ గవర్నర్ లోబడి ఉండాలని తేల్చిచెప్పింది. ప్రజలకు అసెంబ్లీ.. అసెంబ్లీకి మంత్రులు, వారికి అధికారులు జవాబుదారులుగా ఉండాలని స్పష్టం చేసింది.
ఈ తీర్పును తుంగలో తొక్కేందుకు మోడీ సర్కారు ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి మరో ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. అధికారుల బదిలీ, పోస్టింగ్, నిఘాకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్‌కే సర్వాధికారాలు కట్టబెట్టింది. సిఎంతోపాటు కేంద్రప్రభుత్వం చేత నియమితులైన ఢిల్లీ చీఫ్ సెక్రటరీ, హోం మంత్రిత్వశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సభ్యులుగా ఉండే నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని కేంద్రం నియమిస్తుంది. ఈ కమిటీ నిర్ణయాలు మెజారిటీ ఓటు ప్రకారం అమలవుతాయి. అంటే.. కేంద్రం నియమించిన ఇద్దరు అధికారులకు సిఎంకన్నా ఎక్కువ అధికారం ఉంటుంది. ఈ కమిటీ ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించకపోయినా, అభిప్రాయ భేదాలు వచ్చినా లెఫ్టినెంట్ గవర్నర్ నిర్ణయమే ఫైనల్. రాజ్యాంగంపై ఇంతకన్నా భయంకరమైన దాడి ఉంటుందా? ఢిల్లీ అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికల్లో బిజెపిని ప్రజలు ఛీకొట్టినా... ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా పెత్తనం చేస్తుందా? ఐఎఎస్‌లు, గ్రూప్స్ అధికారులు మాటవినకపోతే ప్రభుత్వ విధానాలు, వాగ్దానాలు ఎలా అమలవుతాయి? ఇది రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో భాగమైన సమాఖ్య విధానంపైనే దాడి. ఇది కేవలం ఢిల్లీ ప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన అంశమే కాదు, రాజ్యాంగ సమాఖ్య చట్ర పరిధిని ధ్వంసం చేస్తున్నందున ప్రజలందరి సమస్య. ఈ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించేలా ఈ దుర్మార్గాన్ని జనమంతా ముక్తకంఠంతో వ్యతిరేకించాలి.