Oct 08,2022 07:11

ఎన్నికల నిబంధనావళిలో కొత్త మార్గదర్శకాలు చొప్పించేందుకు ఎన్నికల కమిషన్‌ తొందరపడడం ఆశ్చర్యాన్ని, మరింత అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఇది, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీలు, సంక్షేమ చర్యలను లక్ష్యంగా చేసుకోవడమా? అన్ని కేంద్ర పథకాలు నిజమైన సంక్షేమ చర్యలని ప్రధానమంత్రి భావిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అటువంటి సంక్షేమ పథకాలను మాత్రం ఉచితాలుగా ముద్ర వేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ తాజాగా తీసుకుంటున్న చర్య ప్రధానమంత్రి అభిప్రాయాలను స్పష్టం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

       న్నికల ప్రణాళికల్లో చేసిన వాగ్దానాల అమల్లోని ఆర్థిక పర్యవసానాల గురించి రాజకీయ పార్టీలు సవివరంగా సమాచారం ఇవ్వాలని భారత ఎన్నికల కమిషన్‌ (ఇసిఐ) భావిస్తోంది. అలాగే, ఈ వాగ్దానాల అమలు ప్రభావం సంబంధిత రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులపై ఎలా వుంటుందో కూడా చెప్పాలని భావిస్తోంది. ఇందుకుగాను ఎన్నికల కమిషన్‌, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సవరించాలని ప్రతిపాదిస్తోంది. రాజకీయ పార్టీలు తాము చేసిన వాగ్దానాలను వెల్లడించడానికి, వీటి ఆర్థిక అమలు పర్యవసానాలు తెలియచేయడానికి రెండు భాగాలుగా గల ప్రొఫార్మా నింపాలని ప్రతిపాదిస్తోంది. ఎన్నికల కమిషన్‌ చేసిన ఈ ప్రతిపాదన అత్యంత అసాధారణంగా, విచిత్రంగా వుంది. రాజకీయ పార్టీలు చేసే వాగ్దానాల స్వభావాలు ఎలా వుంటాయో కమిషన్‌కి తెలియదు. కానీ, ఆ వాగ్దానాలను అమలు చేయడం వల్ల తలెత్తే ఆర్థిక పరమైన చిక్కులు, పర్యవసానాలపై ఆరోగ్యకరమైన చర్చను ప్రారంభించేందుకు కొన్ని ప్రామాణికాలను రూపొందించాల్సిన ఆవశ్యకత వుందని, ఇందుకుగాను సమీప భవిష్యత్తులో, దీర్ఘకాలంలో ఆర్థిక స్థిరత్వం నెలకొనాల్సిన పరిస్థితి వుందని, అప్పుడే స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికలు నిర్వహించడానికి వీలవుతుందంటూ ఈ ప్రతిపాదన చేయడానికి గల కారణాన్ని ఎన్నికల కమిషన్‌ చెబుతోంది.
         కానీ ఇటువంటి వివరణతో అంతా జరిగిపోదు. ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లలకు ఉచితంగా స్కూలు యూనిఫారాలు ఇవ్వాలని ఏదైనా ఒక రాజకీయ పార్టీ నిర్ణయిస్తే, అటువంటి హామీ యొక్క విలువ లేదా ప్రాముఖ్యతను నిర్ణయించాల్సింది ఆ ఎన్నికల్లో ఓటు వేసే ప్రజలే. ఆ యూనిఫారాలకు ఎంత ఖర్చవు తుంది, వాటికి నిధులను ఎలా సమకూర్చాలో నిర్ణయించాల్సిన బాధ్యత కొత్తగా ఎన్నికై అధికారంలోకి వచ్చే ప్రభుత్వానిది. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ పాత్ర ఎక్కడ వుంది ?
         తాజా బడ్జెట్‌ అంచనాలు లేదా సవరించిన అంచనాల ప్రాతిపదికన ఆయా రాష్ట్ర లేదా కేంద్ర ప్రభుత్వం ముందుగా భర్తీ చేసే కొంత ఆర్థిక సమాచారం ప్రొఫార్మా రెండో భాగంలో వుంటుందని కమిషన్‌ పేర్కొంటోంది. ఎన్నికల హామీలను అమలు చేసేందుకు పెరిగిన ఆర్థిక అవసరాల నేపథ్యంలో తాజా బడ్జెట్‌ అంచనాలు లేదా సవరించిన అంచనాల ప్రస్తావనతో ఈ అంతరాన్ని భర్తీ చేసేందుకు నిధులు ఎలా సమకూరుస్తారో తెలియచేయడం ద్వారా ప్రొఫార్మా కుడి వైపు భాగాన్ని రాజకీయ పార్టీ పూర్తి చేయాల్సి వుంటుంది.
ఇటువంటి ప్రక్రియలో సంక్లిష్టమైన ఆర్థిక అకౌంటింగ్‌ వుంటుంది. అధికారికంగా బడ్జెట్‌ను రూపొందించే అనుభవం కలిగిన ఆర్థిక నిపుణుల బృందం వల్లనే ఇది సాధ్యమవుతుంది.
     అంతేగాక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వాగ్దానాల అమలుకోసం అదనపు వనరుల పెంపు ప్రభావాన్ని ఎన్నికల సంఘం అంచనా వేయగోరుతున్నది. వాటి ఆర్థిక సామర్థ్యంపై ప్రభావాన్ని మదింపు వేయాలనే ఈ ఆకాంక్ష ప్రమాదకర ప్రదేశంలోకి ప్రవేశించడమే.
      మరో విధంగా చెప్పాలంటే సరళీకరణవాదులు చెప్పే ద్రవ్యపర మితవాదం, నిర్వహణ సామర్థ్యం వంటి అభిప్రాయాలను ఆమోదిస్తున్నట్టు కనిపిస్తోంది. జిడిపిలో మూడు శాతం మించి ద్రవ్య లోటు అనుమతించరాదనే ఎఫ్‌.ఆర్‌.బి.ఎం చట్టాన్ని సిపిఎం కు సంబంధించినంతవరకూ వ్యతిరేకిస్తూనే వుంది. ఆర్థిక సమర్థత ఏంటనే దానిపై ఇప్పుడు ఎన్నికల సంఘం తీర్పరి పాత్ర వహించబోతోందా ?
        రాజకీయ పార్టీలు చేసే ఎన్నికల వాగ్దానాల ఆర్థిక పర్యవసానాల గురించి వివరాలు తెలుసుకునేందుకు, పైగా వాటిని సంబంధిత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులతో సరిపోల్చేందుకు ఎన్నికల కమిషన్‌ తీసుకుంటున్న ప్రస్తుత చర్య ఆశ్చర్యపరిచేలా వుంది. ఎందుకంటే కొన్ని మాసాల క్రితమే (ఈ ఏడాది ఏప్రిల్‌లో) ఎన్నికల కమిషన్‌ సుప్రీం కోర్టుకు ఒక అఫిడవిట్‌ సమర్పించింది. అందులో ఇలా పేర్కొంది: ''ఎన్నికల ముందు లేదా తర్వాత ఇవ్వాలనుకునే లేదా పంపిణీ చేసే ఉచితాలనేవి సంబంధిత పార్టీ విధాన నిర్ణయంగా వుంటుంది. అటువంటి విధానాలు ఆర్థికంగా సమర్ధనీయమా కాదా? లేదా ఆయా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయా అనే ప్రశ్నను పరిశీలించాల్సింది, నిర్ణయించాల్సింది ఆ రాష్ట్ర ఓటర్లు.''
        ఎన్నికల్లో గెలుపొందిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినపుడు తీసుకునే నిర్ణయాలు, ఆ రాష్ట్ర విధానాలను తాము నియంత్రించలేమని కూడా ఎన్నికల కమిషన్‌ పేర్కొంది. ''చట్టంలో తగిన నిబంధనలు లేకుండా ఇటువంటి చర్య తీసుకోవడం అధికారాలను అతిగా ఉపయోగించడమే అవుతుంది.'' అని పేర్కొంది. కొన్ని మాసాల్లోనే ఎన్నికల కమిషన్‌ ఎందుకు మనస్సు మార్చుకుంది? జులైలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, ఉచితాల సంస్కృతిని విమర్శించడం, దీనికి ప్రతిపక్షాన్ని నిందించడమే ఇ.సి తన పూర్వపు వైఖరిని పున:పరిశీలించుకోవడానికి ఒక కారణమా? ఉచితాలపై రేగిన ఈ మొత్తం చర్చంతా కూడా ఆహారం, ఎరువులు, విద్యుత్‌ వంటి వాటికిచ్చే సబ్సిడీలన్నీ ప్రజా వనరులను వృధా చేయడమేనంటూ వెలువడే నయా ఉదారవాద అభ్యంతరాలను వ్యక్తం చేయడం తప్ప మరొకటి కాదు. ఇప్పుడున్న నయా ఉదారవాద పోకడ ప్రకారం...అభివృద్ధిని పెంపొందించాలంటే, కార్మిక వర్గానికి జరిగే బదిలీలను బడా పెట్టుబడిదారులకు చేసే బదిలీలతో భర్తీ చేయాలి.
        అందుకే, ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే ఉచితాలకు వ్యతిరేకంగా బిజెపి నేత ఒకరు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ చేపట్టినపుడు...దీనిపై చర్చించాల్సింది, ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన హామీలు ఉచితాలా కాదా అనేది నిర్ణయించాల్సింది సుప్రీంకోర్టు కాదని సిపిఎం చెప్పింది. ఈ అంశం పూర్తిగా రాజకీయ పరిధికి సంబంధించింది. ప్రజాస్వామ్యంలో, రాజకీయ పార్టీలకు ఎన్నికల ప్రణాళికల్లో తమ వేదికను, హామీలను పేర్కొనడానికి స్వేచ్ఛ వుంది. వాటిపై నిర్ణయించాల్సింది, ఆమోదించాలా లేదా తిరస్కరించాలా అనేది చూడాల్సింది ప్రజలు. సంక్షేమ చర్యలకు సంబంధించి ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడమనేది ఎన్నికల్లో గెలుపొందిన రాజకీయ పార్టీకి గల విశేషాధికారం.
       2013లో సుబ్రమణియం బాలాజి కేసులో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును పున:పరిశీలించాలని కోరిన పిటిషన్‌ను అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వం లోని బెంచ్‌ విచారించింది. ఈ కేసును కొత్త ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసే త్రిసభ్య ధర్మాసనం విచారించాలని, ఆగస్టు 26న తన పదవీకాలం చివరి రోజున జస్టిస్‌ రమణ ఆదేశించారు. అందువల్ల, ఉచితాలకు సంబంధించి ఎన్నికల వాగ్దానాల అంశం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో వుంది. అయినప్పటికీ, ఎన్నికల నిబంధనావళిలో కొత్త మార్గదర్శ కాలు చొప్పించేందుకు ఎన్నికల కమిషన్‌ తొందరపడడం ఆశ్చర్యాన్ని, మరింత అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఇది, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రత్యక్ష నగదు బదిలీలు, సంక్షేమ చర్యలను లక్ష్యంగా చేసుకోవడమా? అన్ని కేంద్ర పథకాలు నిజమైన సంక్షేమ చర్యలని ప్రధానమంత్రి భావిస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న అటువంటి సంక్షేమ పథకాలను మాత్రం ఉచితాలుగా ముద్ర వేస్తున్నారు. ఎన్నికల కమిషన్‌ తాజాగా తీసుకుంటున్న చర్య ప్రధానమంత్రి అభిప్రాయాలను స్పష్టం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
       రాజకీయ పార్టీలు చేసే ఎన్నికల వాగ్దానాల ఆర్థిక పర్యవసానాలపై ఇసిఐ జోక్యం చేసుకోవడమంటే...ప్రజల కీలకమైన ఆందోళనలను పరిష్కరించడానికి, మరింత ప్రజాస్వామ్యమైన రీతిలో వాటి పట్ల స్పందించడానికి రాజకీయ పార్టీలకు గల హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే. ఈ విషయమై ఎన్నికల కమిషన్‌ చర్యను వ్యతిరేకించడంలో రాజకీయ పార్టీలన్నీ ఒక్కటిగా వుండాలి.
 

(పీపుల్స్‌ డెమోక్రసీ సంపాదకీయం)