- నెలకు రూ.1500 ప్రోత్సాహకం
- 37లక్షల మెట్రిక్ టన్నుల సేకరణే లక్ష్యం
ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ఈ ఏడాది ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ బాధ్యత గ్రామ వాలంటీర్లకు ప్రభుత్వం అప్పగించింది. రైతు పండించిన ధాన్యం కళ్లాల్లో ఉన్నప్పటి నుంచి ధాన్యం సేకరణ, తరలింపు నుంచి మిల్లర్ వద్దకు ధాన్యం చేర్చి రశీదు తీసుకునే వరకు గ్రామ వాలంటీర్లు కీలకపాత్ర పోషించనున్నారు. గ్రామ వాలంటీర్లు సేకరించిన ధాన్యాన్ని తరలించే వాహనానికి రూట్ ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు. రెగ్యులర్ డ్యూటీలకు అదనంగా ధాన్యం సేకరణ చేపట్టే వాలంటీర్లకు ప్రభుత్వం నెలకు రూ.1500 పారితోషికంగా అందజేయనుంది. పారితోషికం సరిపోదని వాలంటీర్లు ప్రభుత్వ అధికారుల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
2022-23 ఖరీఫ్‌లో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ప్రభుత్వం ఆరు నెలల పాటు నెల వారీ లక్ష్యాలను నిర్ధేశించింది. అక్టోబరులో 59 వేల మెట్రిక్ టన్నులు, నవంబరులో 6.13 లక్షల మెట్రిక్ టన్నులు, డిసెంబరులో 12.40 లక్షల మెట్రిక్ టన్నులు, 2023 జనవరిలో 8.80 లక్షల మెట్రిక్ టన్నులు, పిబ్రవరిలో 5.11 లక్షల మెట్రిక్ టన్నులు, మార్చిలో 3.97 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. పంట దిగుబడి రాక పోవడంతో అక్టోబరు నెలలో నామమాత్రంగా ధాన్యం సేకరణ జరిగినట్లు సమాచారం. సేకరించిన ధాన్యాన్ని రైతుకు ఇష్టమైన మిల్లులో అమ్ముకునే వీలు లేకుండా ప్రభుత్వం సూచించిన మిల్లుకే తరలించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇటీవల ప్రభుత్వం మిల్లర్లతో ఓ సమావేశం జరిపింది. తాము రైతులకు వ్యవసాయం చేసుకునేందుకు పెట్టుబడులు పెట్టామని, తమకే ధాన్యం సరఫరా చేయకపోతే నష్టపోతామని మిల్లర్లు అధికారులకు తెలియజేసినట్లు సమాచారం.
ధాన్యం సేకరణలో 12 దశలు
ధాన్యం సేకరణ చేయాలంటే భూయజమానులు తప్పనిసరిగా ఇ క్రాప్, వెబ్‌ల్యాండ్‌లో తమ భూమి సర్వే నెంబర్ నమోదు చేసుకుని ఉండాలి. క్షేత్రస్ధాయి వెరిఫికేషన్ సంబంధిత అధికారులు చేయాల్సి ఉంటుంది. అనంతరం ఎంఎస్‌పి ధరల గురించి రైతులకు అవగాహన కలిగించాలి. ధాన్యంలో తేమశాతం, క్వాలిటీ తనిఖీ కోసం సాంకేతిక నిపుణుల సహకారం తీసుకుంటారు. పిపిసి కూపన్లు రైతు భరోసా కేందాల్లో జనరేట్ చేస్తారు. అనంతరం సేకరించిన ధాన్యాన్ని ఫ్యాక్ చేసేందుకు గన్నీ బ్యాగులు, రవాణా, రూట్ ఆఫీసర్లు కేటాయిస్తారు. సాంకేతిక నిపుణులు నాణ్యతను పరీక్షించిన అనంతరం ధాన్యం ఫోటోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ధాన్యం సేకరణకు వెళ్లే రవాణా వాహనం నెంబరు, వేబ్రిడ్జిల బరువును రూట్ ఆఫీసర్ల సమక్షంలో సరిచూస్తారు. అనంతరం బిల్లును జనరేట్ చేస్తారు. గన్నీ బ్యాగుల్లో ధాన్యం నింపడం, ప్యాకింగ్ చేయడం, మిల్లుకు రవాణా, ట్రక్కు, బరువును అధికారి ధ్రువీకరించిన అనంతరం వరి ధాన్యాన్ని అన్‌లోడ్ చేయడానికి అనుమతిస్తారు. ధాన్యం మిల్లర్‌కు (కస్టోడియన్‌కు) అప్పజెప్పిన అనంతరం రైతుకు రశీదు ఇస్తారు.
వాలంటీర్లకు శిక్షణ
రైతు వద్ద ధాన్యం సేకరించేటప్పుడు క్వాలిటీని పరిశీలించడంతోపాటు ధాన్యాన్ని తూకం వేయడం, రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడటంపై నవంబరు మొదటి వారంలో వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి పలు కేటగిరీల ఉద్యోగులకు అక్టోబరు 7లోపు శిక్షణను ఇచ్చారు. నవంబరు మొదటి వారంలో శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, మన్యం, విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాల్లో మాస్టర్ ట్రైనర్స్‌కు శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు 3,423 రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి రూట్ అసిస్టెంట్లు 4,117 మంది, సబ్‌స్టిట్యూట్ సిబ్బంది 3,423మంది, కస్టోడియన్ ఆఫీసర్లు 3,078 మందికి మాస్టర్ ట్రైనీస్ శిక్షణ ఇచ్చారు.










