Jul 16,2023 07:47

సువర్ణముఖి నదికి ఆవల పంచముఖి అనే సామ్రాజ్యం ఉండేది. ఐదు సామంత రాజ్యాలు కలిసి ఉండటంతో రాజు విక్రమవర్మ దీనికి పంచముఖి సామ్రాజ్యం అని పేరు పెట్టారు. వర్షాలు లేక పంటలు పండక పోవడంతో కరువు తాండవిస్తోంది. దాంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దొంగతనాలు పెరిగాయి. పట్టుబడ్డ దొంగలు రాజు గారితో 'వ్యవసాయం సాగక పని చేద్దామనుకున్నా పనులు దొరకడం లేదు. తినడానికి తిండి లేదు. మరి మేమెలా బతకాలి? అందుకే దొంగతనాలు చేస్తున్నాం. మాకు పని కల్పిస్తే దొంగతనాలు మానేస్తాం' అని మొరపెట్టుకున్నారు.
రాజు విక్రమవర్మ కరువు సమస్య దాటించి, ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆలోచించారు. అందుకే పంచముఖి రాజధానిలో మిగిలిన నాలుగు సామంత రాజ్యాల రాజులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. సామంత రాజులతో పాటు, ఐదు రాజ్యాల్లో గల ధనికులకు, పండితులకు ఆహ్వానం పంపించారు. విక్రమవర్మ సమావేశానికి హాజరైన ఐదు రాజ్యాల ధనికులను, పండితులను ఉద్దేశించి 'మన పంచముఖి రాజ్యంలో అన్ని ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడం వలన కరువు కాటకాలు ఏర్పడి, ప్రజలు తినడానికి తిండిగింజలు కూడా లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొంగతనాలు కూడా పెరిగిపోయాయి. ఈ కరువు కాటకాలు పోయి, మరలా చక్కగా వ్యవసాయం సాగి, ప్రజలందరూ ఆనందంగా జీవించే మార్గాలుంటే చెప్పండి' అన్నారు.
పంచముఖిలో ఒక సామంత రాజైన ఈశ్వరవర్మ 'మహారాజా! ఈ కరువు పరిస్థితులు గట్టెక్కాలంటే వరుణ యాగం చేయాలి. దానివలన వరుణుడు కరుణించి, సమృద్ధిగా వానలు కురిపిస్తాడు. అప్పుడు వ్యవసాయం సాగి, కరువు తీరుతుంది. యాగానికయ్యే ఖర్చు మన ఐదురాజ్యాల వారు సమానంగా భరిస్తే సరిపోతుంది. నేను అందుకు సిద్ధం' అన్నాడు.
ఈశ్వర వర్మ మాటల విన్న మిగిలిన మూడు రాజ్యాల రాజులూ 'వరుణ యాగ నిర్ణయం సరైనదే, అయ్యే ఖర్చులో మేమూ భాగస్వాములవుతాం' అన్నారు.
సమావేశానికి విచ్చేసిన ధనికులూ వారి వంతు ధన సహాయం చేస్తామని ప్రకటించారు. పండితులు 'దాన ధర్మాలు, పేదలకు అన్నదానం చేయాలి!' అని సూచించారు.
వీరందరి మాటలు విన్న విక్రమవర్మ 'యాగమనేది చాలా వ్యయంతో కూడుకున్న పని' అని అనడంతో.. సామంత రాజులు, ధనికులు 'వరుణ యాగము చేయడానికి అయ్యే వ్యయం అందరం కలిసికట్టుగా భరిద్దాం' అంటూ భరోసా ఇచ్చారు.
విక్రమ వర్మ అందరినీ ఉద్దేశిస్తూ 'వరుణ యాగం చేసిన తర్వాత వర్షాలు కురుస్తాయన్న మీ నమ్మకం అభినందనీయం. అందుకయ్యే ఖర్చు అందరూ భరిస్తామనడం మరింత ఆనందదాయకం. అయితే మీరందరూ నేను చెప్పే మాటను వింటారని భావిస్తున్నాను. పంచముఖి సామ్రాజ్య ప్రజల కష్టనష్టాలను తీర్చడానికి, ఈ వరుణ యాగానికయ్యే సగం ఖర్చుతోనే రాజ్యంలో వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించవచ్చనేది నా భావన' అని ఆగారు. సమావేశంలో ఉన్న అందరూ విక్రమవర్మ ఏమి చెబుతారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
విక్రమవర్మ మరల చెప్పటం ప్రారంభించారు. 'మన రాజ్యానికి ఆనుకొని స్వర్ణముఖి నది ప్రవహిస్తున్నది. అధిక వర్షాలు వచ్చినప్పుడు నది నుండి సముద్రంలోకి చాలా నీరు ్లపోయి వృధా అవుతున్నాయి. అందుకే స్వర్ణముఖి నదిపై ఒక ఆనకట్ట నిర్మించి. కాలువల ద్వారా పంట పొలాలకు వ్యవసాయానికి నీరు అందిస్తే చక్కగా వ్యవసాయం సాగుతుంది. కరువు అనే మాటే ఉండదు. ఆనకట్ట నిర్మించడం వల్ల అధిక వర్షాలు వచ్చినప్పుడు కూడా నీరు నిల్వ ఉండి, సంవత్సరం పొడుగునా నది జలముతో కళకళలాడుతుంది. ఈ ఆనకట్ట నిర్మాణానికి మీ అందరి సహకారం, బాధ్యత నాకు ఇవ్వగలరని ఆశిస్తున్నాను. మా తండ్రిగారి పాలనలోనూ ఈ ఆనకట్ట విషయమై మీ అందరి ముందూ ప్రణాళిక సిద్ధంచేసి తెలియజేశారు. కానీ అధికవ్యయం అవుతుందని, ధనాగారంపై భారం పడుతుందని ఆనాటి సామంత రాజులు వ్యతిరేకించారు. ఈ రోజు కరువు పరిస్థితులు ఏర్పడేసరికి వరుణయాగం నిమిత్తం అందరూ ఖర్చును భరిస్తామని ముందుకొచ్చారు. అలాగే ధనికులు కూడా భాగస్వామ్యులవుతామని అన్నారు. అందుకే వరుణ యాగానికయ్యే సగం ఖర్చులోనే స్వర్ణముఖి నదిపై ఆనకట్ట నిర్మించి, మన పంట భూములను సస్యశ్యామలం చేద్దాం. ఆనకట్ట పనులలో ప్రజలను భాగస్వామ్యం చేద్దాం. దాని వలన వారికి ఉపాధి కూడా లభిస్తుంది. రాజ్యాలలో దొంగతనాల బెడద తీరుతుంది. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి' అంటూ ముగించారు.
విక్రమవర్మ నిర్ణయాన్ని విని సభలో ఉన్న వారందరూ కరతాళ ధ్వనులు చేశారు. విక్రమ వర్మ నిర్ణయాన్ని ముక్త కంఠంతో ఆమోదించారు. విక్రమవర్మ నిర్ణయం తెలిసి, ప్రజలు కూడా సంతోషించారు.
స్వర్ణముఖి నదిపై ఆనకట్ట నిర్మాణానికి, ఐదు సామంత రాజ్యాల పంట భూములకు నీరు అందేటట్లు ప్రణాళిక సిద్ధం చేశారు.
ప్రణాళిక అమలయ్యాక ఇప్పుడు పంట భూములకు సాగునీరు సకాలంలో అందుతుండడంతో వ్యవసాయానికి సానుకూలత ఏర్పడింది. ప్రజలకు వ్యవసాయ, వివిధ పనుల్లో ఉపాధి దొరికింది. కరువు తీరింది. పంచముఖి రాజ్యం సుభిక్షమైంది.

మొర్రి గోపి
8897882202