
హైదరాబాద్ నగరంలో గడచిన మూడు నాలుగు రోజులుగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్త సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. భాగ్యనగరంలో మత ఉద్రిక్తతల సృష్టికి సంఘపరివార్ శక్తులు చేస్తున్న కుట్ర ద్యోతకమవుతోంది. తెలంగాణ శాసనసభలో బిజెపి పక్ష నేత రాజాసింగ్ ఒక వీడియోలో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడడం, మహ్మద్ ప్రవక్త గురించి అనుచితంగా మాట్లాడడంతో ఈ చిచ్చు రేగింది. హైదరాబాద్‌లో జరిగిన మునావర్ ఫారుఖీ షోపై అభ్యంతరం రూపంలో రాజా సింగ్ పోస్టు చేసిన వీడియోను కాసేపటికే బిజెపి కార్యకర్తలు, పరివార్ అనుయాయులు పథకం ప్రకారం వైరల్ చేశారు. వీడియోలో వాడిన భాష, చేసిన వ్యాఖ్యలతో చిచ్చు రాజుకుని పరిస్థితి తీవ్ర రూపం దాల్చింది. రాజాసింగ్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని పాత బస్తీతో పాటు పలు ప్రాంతాల్లో ముస్లిం యువత రోడ్ల పైకి వచ్చి ఆందోళనలకు దిగారు. మరోవైపున ఆ ఎమ్మెల్యేకు మద్దతుగా కొందరు ఊరేగింపులు తీశారు. కేసు విచారించిన కింది కోర్టు రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు ధర్మాసనం మంగళవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. గురువారంనాడు పోలీసులు పి.డి చట్టం కింద కేసుపెట్టి రాజాసింగ్‌ను అరెస్టు చేశారు. ఇటువంటి కేసుల్లో పోలీసులు ఆషామాషీగా వ్యవహరించకుండా తగిన న్యాయ సలహాతో చర్యలు చేపట్టడం ఎంతో అవసరం.
రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాతో పాటు దేశ వ్యాప్తంగా పలువురు ఖండించారు. దీంతో బిజెపి నాయకత్వం ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి, పార్టీ నుండి ఎందుకు బహిష్కరించకూడదంటూ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. నోటీస్ అందిన తరువాత కూడా రాజాసింగ్ తన వ్యాఖ్యలను సమర్ధించుకోవడంతో పాటు, వీడియో సెకండ్ వెర్షన్ కూడా ఉంటుందని ప్రకటించారంటే ఇది ఎంత పకడ్బందీ వ్యూహమో విదితమవుతోంది. ఆ వీడియోను మునావర్ ఫారూఖీ షో కు స్పందనగానే పరిగణించాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజరు బుధ, గురు వారాల్లో సైతం వెనకేసుకొస్తున్నారంటే ఆ షోకాజ్ నోటీసుకు ఏపాటి విలువ ఉందో సుస్పష్టం. కేవలం ముస్లిం ప్రజానీకం నుండి వ్యక్తమవుతున్న నిరసనలను తప్పించుకోవడానికి, కేసును మసిబూసి మారేడు కాయ చేయాలనే కమలనాథులు ఈ షోకాజ్ నాటకం ఆడుతున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పర్యటన ముగిసిన రెండు రోజుల్లోనే ఈ సంఘటనలు చోటు చేసుకోవడం యాదృచ్ఛికం కాకపోవచ్చు.
తెలుగు రాష్ట్రాల్లో ఎలాగైనా పట్టు సాధించాలని బిజెపి నాయకత్వం కేంద్రీకరించిన విషయం జగద్విదితమే! తొలి నుండీ కొంత బలమున్న తెలంగాణలో గత రెండేళ్లుగా గట్టి ప్రయత్నం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో రథం దగ్ధం, రామతీర్థం వంటి ఘటనలను ఆసరా చేసుకుని మత విద్వేషాలు పెంచాలని యత్నిస్తోంది. అంబేద్కర్ అమలాపురం జిల్లాలో విధ్వంసం వెనుక పరివార్ శక్తుల కుట్ర దాగి వుంది. బిజెపి జిల్లా కార్యదర్శిని పోలీసులు అరెస్టు చేసిన విషయం మరువరాదు. గుంటూరులో జిన్నా టవర్ వివాదాన్ని రేపడం, కర్నూలు జిల్లాలో టిప్పు సుల్తాన్ విగ్రహ ప్రతిష్టను అడ్డుకోవడం వంటి వాటిని చెదురుమదురు ఘటనలుగా భావించరాదు. మత విద్వేష వ్యాప్తితోపాటు సోషల్ ఇంజనీరింగ్ కూడా పకడ్బందీగా అమలు చేయాలని రెండు నెలల క్రితం హైదరాబాదు లోనే జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టాలన్న సంఘపరివార్ శక్తులపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడం ఎంతో అవసరం. అదే సమయంలో మైనార్టీ ఉగ్రవాద భావనల పట్ల జాగరూకులై ఉండాలి. మెజార్టీ లేదా మైనార్టీ మతతత్వం అది ఏదైనా మానవాళికి ప్రమాదకరం. పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపి మతతత్వ శక్తుల విద్వేష కుట్రలను అదుపు చేయాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని శక్తులు మత ఘర్షణలను రేపిన సందర్భంలో నాటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు వ్యవహరించిన తీరు పలు ప్రశంసలు పొందింది. మత సామరస్య పరిరక్షణకు ప్రజల అప్రమత్తతే రక్ష! కార్పొరేట్- మతతత్వ శక్తుల కుట్రల పట్ల జాగరూకులై మెలగాలి !