
రెండున్నరేళ్లుగా తిష్ట వేసిన కరోనా, వ్యాప్తి వేగం పెంచుకున్న మంకీ పాక్స్, వాటికి తోడు వానాకాలంలో విజృంభించే సీజనల్ వ్యాధులు జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న ప్రపంచం పైకి మంకీపాక్స్ వచ్చి పడి ఠారెత్తిస్తోంది. ఆఫ్రికా ఖండానికి పరిమితమైన మంకీపాక్స్ ఇప్పుడు ఖండాంతరాలను దాటి దేశ దేశాలకూ పాకుతూ భయపెడుతోంది. ప్రస్తుతం 75 దేశాలకు విస్తరించి 16 వేల కేసులను దాటేసింది. ఐదుగురు మృతి చెందారు. మంకీపాక్స్‌ను 'ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితి'గా శనివారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దేశాలను అప్రమత్తం చేసింది. యావత్ ప్రపంచాన్నీ భయకంపితం చేస్తున్న మంకీపాక్స్ మన దేశంలోనూ అడుగిడటం ఆందోళన కలిగించే అంశం. కేరళలో మూడు కేసులు, రాజధాని ఢిల్లీలో ఒక కేసు నిర్ధారణయ్యాయి. తెలంగాణలో కామారెడ్డి వాసిలో లక్షణాలున్నాయని పరిశీలనలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఎ.పి లోనూ ఒక చిన్నారిలో లక్షణాలున్నాయని కలకలం లేవగా నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు.
క్రమేణ వివిధ ఉత్పరివర్తనాలతో కోవిడ్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజువారీ పాజిటివ్ కేసులు 20 వేలకు అటూ ఇటూ ఉంటున్నాయి. లక్షా యాభైవేల యాక్టివ్ కేసులు వ్యాప్తి పెరుగుదలను సూచిస్తున్నాయి. మరణాలు తక్కువగా ఉండటం కొంతలో కొంత ఊరట. ఇప్పుడు నమోదవుతున్నవన్నీ ఒమిక్రాన్‌వేనంటున్నారు. మరో వైపు టీకా పంపిణీ కార్యక్రమాన్ని కేంద్రం అర్ధంతరంగా నిలిపేసింది. డబ్బులు చెల్లిస్తే బూస్టర్ డోస్ అంది. కేసులు పెరుగుతుండటంతో ఎట్టకేలకు ఉచితంగా బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది. కాగా టీకాకు అర్హులైన పౌరుల్లో ఒక్క డోసు కూడా వేయించుకోని వారు కోట్లల్లో ఉండటం టీకా పంపిణీ వైఫల్యాన్ని తెలియజేస్తోంది. మన రాష్ట్రంలోనూ ఒక్క డోసు కూడా తీసుకోని వారు గణనీయంగానే ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బూస్టర్ డోసుతో పాటు ఒకటి రెండు డోసులు తీసుకోనివారిని గుర్తించి చైతన్యపర్చి ఇప్పించాలి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా టీకా పంపిణీని వేగవంతం చేయాలి. వైద్య సదుపాయాల కల్పనపై ముందస్తు ఏర్పాట్లు చేయాలి. కోవిడ్ తొలి రోజుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఒకానొక దశలో పరిస్థితి అదుపు తప్పినంత పనైంది. మంకీపాక్స్ విషయంలో అలాంటివి పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలి. విదేశాల నుంచి వచ్చే వారిని సంపూర్ణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించాకనే అనుమతించాలన్న డబ్ల్యుహెచ్‌ఒ సూచనలను కేంద్ర ప్రభుత్వంతో కలిసి రాష్ట్రం పాటించాలి. కనీసం జిల్లా కేంద్రాల్లోనైనా మంకీపాక్స్ రోగుల కోసం ప్రత్యేక ఐసొలేషన్ వార్డులు తెరవాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు కాకుండా తొలుతనే కోవిడ్, మంకీపాక్స్ కట్టడికి అన్ని విధాలా యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి.
వర్షాలు అలా మొదలవగానే ఇలా సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. సిఆర్‌డిఎ పరిధిలోనే ఉన్న కృష్ణా జిల్లా తెంపల్లి గ్రామంలో డయేరియా వ్యాపించి నలుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. వర్షాలకు డయేరియా, అతిసార, మలేరియా, టైఫాయిడ్, ఫ్లూ, విషజ్వరాలు, డెంగీ, గున్యా, మెదడువాపు విజృంభిస్తాయి. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య పరిరక్షణ, తాగునీటి పథకాల క్లోరినేషన్ నిర్వహించాలి. స్థానిక సంస్థల్లో నిధుల్లేవు. ఫైనాన్స్ కమిషన్ నిధులు వేరే వ్యాపకాలకు ప్రభుత్వం మళ్లించడంతో బ్లీచింగ్‌కు సైతం నోచుకోవట్లేదు. పారిశుధ్య కార్మికులకు ఇచ్చే అస్తుబిస్తు జీతాలూ ఒక పట్టాన అందట్లేదు. ప్రజలపై వివిధ రూపాల్లో పన్నులు మాత్రం బాదుతున్నారు. ఏజెన్సీలో ఆరోగ్య సేవల్లో మెరుగుదల శూన్యం. ఆరోగ్యశాఖలో డాక్టర్, సిబ్బంది ఖాళీల భర్తీ అలాగే ఉంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు అంతంతే. ఆరోగ్యశ్రీ ఉండీ లేనట్టుంది. ప్రభుత్వరంగంలో వైద్య, ఆరోగ్య సేవలను ప్రభుత్వం మెరుగుపర్చాలి. కోవిడ్, మంకీపాక్స్ గుర్తింపునకు పరీక్షలు పెంచి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సీజనల్ వ్యాధులపై యావత్ యంత్రాంగాన్నీ అప్రమత్తం కావించాలి. అదే ప్రజల ప్రాణాలకు భరోసా.