Oct 26,2022 10:47
  • జడ్జీల నియామకంతో పరిష్కారమవుతున్న కేసులు
  • అత్యధిక కేసుల నమోదులో విశాఖ అగ్రస్థానం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో వినియోగదారుల ఫోరంలో నమోదయ్యే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వీటిల్లో అన్సూరెన్స్‌, హెల్త్‌ క్లెయిములు, కొనుగోలు చేసిన వస్తువుల్లో నాణ్యత లేకపోవడం వంటి అనేక అంశాలపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ కొనుగోళ్లు పెరుగుతుండటంతో ఏమి చేయాలో తెలియక బాధితులు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని కేసుల్లో సంస్థలను పిలిచినా, కొన్ని కేసుల్లో పిటీషన్లు దాఖలు చేశారని తెలియగానే సమస్యను ఆయా సంస్థలు పరిష్కరించుకుంటున్నాయి.
           ఇటీవల కాలంలో తమకు న్యాయం చేయాలని వినియోగదారుల ఫోరం కోర్టులను ఆశ్రయించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో 17 ఫోరం కోర్టుల్లో గతనెల వరకూ జడ్జిలు కూడా ఏర్పాటు చేయలేదు. కేసులు పెరుగుతుండటంతో అన్ని కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం పూర్తి చేశారు. దీంతో కేసుల విచారణ వేగవంతమైంది. కేసులు ఫైల్‌ చేసేవారిలో ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్న వ్యక్తి చనిపోయిన సమయాల్లో, హెల్త్‌ పాలసీ, బీమా సంస్థలు సకాలంలో క్లైమ్స్‌ చెల్లించకపోవడం వంటి కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. తమ చేతి డబ్బు పడకుండా బీమా సంస్థ నుంచి పూర్తి స్థాయి బిల్లులను ఇప్పించాలంటూ వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించే వారు ఎక్కువయ్యారు. వినియోగదారుల ఫోరం రాష్ట్ర కార్యాలయంలో ఇటీవల 3,942 కేసులు ఫైల్‌ చేశారు. ఇందులో ప్రస్తుతం 151 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఫస్ట్‌ అప్పీల్‌ కింద 30,864 ఫైల్‌ కాగా, ఇందులో 558 రివిజన్‌ పిటిషన్లకు సంబంధించి 3,323 కేసులు ఉన్నాయి. ఇందులో 15 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రం మొత్తమ్మీద ఒక్క విశాఖపట్నంలోని రెండు వినియోగదారుల ఫోరాల్లో 22,723 కేసులు ఫైల్‌ అయి మొదటిస్థానంలో నిలవగా, రెండో స్థానంలో నెల్లూరు నిలిచింది. జడ్జీల నియామకంతో కేసుల పరిష్కారం వేగవంతంగా అవుతున్నాయి. అయినా జిల్లాల్లో ఇంకా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

22