Aug 27,2023 08:34

నువ్వు వేరంటివి
నేను వేరంటివి
ఇప్పుడెలా ఒక్కటౌతం

నీదో రాజ్యం
నాదో రాజ్యం
భౌగోళిక నైసర్గిక స్వరూపం వేరు
ఏదో ఓ గొడుగు కింద దూరం
వర్షంలో తడవకుండా! అంతే!
వేర్వేరు లక్షణాలతో
వేర్వేరు మనుగడ గుర్తెరిగి!

అంతా వేర్వేరు
నీ తిండి వేరు
నా తిండి వేరు
నేను గొడ్డును సైతం ఆరగిస్తా
నువ్వు మొక్కలనే తింటవ్‌

నీకు నాకు పొసగదు
నా గూడు వేరు
నీ గూడు వేరు
నా గుడ్డ వేరు
నీ గుడ్డ వేరు
ఇన్ని తేడాలు నీకు తెలియదు
నీకు జ్ఞానం లేదు
నువ్వు చదువుకోలేదు
ఇప్పటికైనా చదువుకో

నీదో పైకులం
నాదో కింది కులం
నీకో మొక్క ఆరాధ్యం
నాకో జంతువు పూజ్యనీయం
నువ్వు ఆకారాన్ని
ప్రాకారంలో బెట్టి మొక్కుతావ్‌
నేను రాయినో రప్పనో
మొద్దునో మొక్కుతా

నన్ను భయపెట్టి
నువ్వు ఆకలి తీర్చుకుంటవ్‌
నేను చెమటను చిందించి
పొట్ట నింపుకుంట
నీ గుడి వేరు
నా మసీద్‌ వేరు
ఇంకొకరి చర్చి వేరు
భిన్నత్వంలో ఏకత్వమే ఈ దేశం
ఒకే ప్రజ కానేరదు

అడవిలో జనం
వూరి బైట జనం
వూరి మధ్య జనం
వాడలు వేరు
కట్టుబాట్లు వేరు
సంస్కృతి వేరు
ఇన్ని కతలు వుంటే
ఒకే పౌరస్మృతి ఏల
వెర్రి బాగుల వాడా!
- గిరిప్రసాద్‌ చెలమల్లు
9493388201